ఎంపిల మాటల ఫిరాయింపులు
Uddhav Sena MPs’ Remarks on Defections Trigger Fresh Political Debate
నవ్విపోదురు గాక& నాకేటి సిగ్గు అనే సామెత చందంగా ఉంది ఫిరాయింపు లోక్‌సభ సభ్యుల సమర్ధనలు. శివసేన (ఉద్దవ్ బాలాసాహెబ్ థాక్రే) పార్టీ నుంచి ఫిరాయింపునకు సిద్ధమైన ఆరుగురు ఎంపిల లో ఒకరు నిన్న తొలిసారిగా పెదవి విప్పారు. ఉస్మానాబాద్ నియోజకవర్గ లోక్‌సభ సభ్యుడైన ఓంరాజె నింబాల్కర్ మాట్లాడుతూ నియోజకవవర్గ అభివృద్ధికి నిధులు రానందుకే పార్టీ మార్పునకు సిద్ధపడినట్లు చెప్పడం విడ్డూరంగా ఉంది. తాను ప్రతిపక్షంలో ఉన్నందున అభివృద్ధి నిధులు రావటం లేదని చెప్పారు. అందుకే తనకు మరో ప్రత్యామ్నయం లేదని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే తాము ఎన్సిపిఐ పార్టీలో విలీనమైనట్లు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ అందించిన 20 మంది టిఎంసి తిరుగుబాటు ఎంపిలు తాము కట్టుతప్పటానికి సరైన కారణాలు చెప్పలేక మీడియాకు ముఖం చాటేస్తున్నారు. తమ ఫిరాయింపులకు కారణాలు వెతుక్కునే క్రమంలో, టిఎంసి పార్లమెంటరీ పార్టీ నాయకుడు అభిషేక్ బెనర్జీ ఒంటెత్తు పోకడ, టిఎంసి పాలనలో జరిగిన అక్రమాలు అంటూ సంజాయీషీలు చెప్పుకుంటున్నా అతకడం లేదు. ఎందుకు వారు మీడియా ముందుకు వచ్చేందుకు సాహసించటం లేదు. కొంత మంది నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పుకుంటున్నారు.
శివసేన (యుబిటి) ఎంపి నింబాల్కర్, కొంతమంది టింఎసి ఎంపి లు చెబుతున్నట్లుగా నియోజకవర్గ అభివృద్ధి అనేది కుంటిసాకుగానే కనబడుతోంది. ఎందుకంటే, ఈ రెండు పార్టీల ప్రాతినిధ్యం ఉన్న మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఇప్పుడు బిజెపి ముఖ్యమంత్రులే ఉన్నారు. అంటే, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి శరవేగంగా దూసుకుపోతుందని ప్రధాని మొదలు బిజెపి వారు పదే పదే చెబుతుంటారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలోనూ బిజెపి ప్రభుత్వాలే ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి అంటూ రెబెల్ ఎంపిలు చెబుతున్న కారణం విచిత్రంగా ఉంది. పైగా తాము ప్రతిపక్షంలో ఉన్నందున నిధులు రావడం లేదంటున్నారు. కానీ, వారు ప్రాతినిధ్యం వహించే లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోనే శాసనసభ సెగ్మెంట్లలో అత్యధికులు బిజెపి, దాని తాజా మిత్రపక్ష ఎంఎల్ఏలే అధికం. అలాంటప్పుడు నిధులు రావడం లేదనే కారణం నిలబడదు. ఒకవేళ నిజమనే భావిస్తే, దేశాన్ని, రాష్ట్రాన్ని సమానంగా చూడాల్సిన ప్రభుత్వ బాధ్యులు ప్రతిపక్ష నియోజకవర్గాల పట్ల వివక్ష చూపుతుండడం రాజ్యాంగ వ్యతిరేకమే. దీనిపై గట్టిగా నిలదీయడం, వివిధ వేదికల్లో ఎత్తిచూపటం మార్గమే తప్ప అధికార పార్టీలోకి ఫిరాయించటమే ఏకైక మార్గమనుకుంటే ప్రజాస్వామ్యమేమి మిగులుతుంది.
ముంబైలో శుక్రవారం శివసేన 60వ ఆవిర్భావ వేడుకలు ఆ పేరుతో ఉన్న రెండు పార్టీలు ఘనంగా నిర్వహించుకున్నాయి. కొందరు ఎంపిలు తమ శివసేనను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని, అది ఇష్టం లేకే పార్టీ ఫిరాయిస్తున్నట్లు చెప్పడాన్ని శివసేన (యుబిటి) అధినేత ఉద్దవ్ థాక్రే కొట్టిపారేసారు. అదే నిజమైతే తాము ముప్పు ఏళ్ళు కలిసి పని చేసిన బిజెపిలో ఎందుకు విలీనం చేయలేకపోయామని రెబెల్స్‌ను అడిగిన ప్రశ్న సమంజసంగానే ఉంది. ఒకవేళ శివసేనను కాంగ్రెస్ పార్టీలోనే విలీనం చేయాలని భావిస్తే, రెబెల్స్ ఎంపిలకు అనుకోని అదృష్టం లాంటిదే. ఎందుకంటే వారిపై ఎట్టి పరిస్థితిలో ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు. మాతృపార్టీ ఇతర పార్టీలలో విలీనమవడం ఇష్టం లేని ఎంపిలు, లేదా ఎంఎల్ఏలు ప్రత్యేక గ్రూపుగా ఉండవచ్చు, అలా కాకుండా స్వతంత్రంగా వ్యవహరించవచ్చని ఆ చట్టం స్పష్టంగా చెబుతోంది. ప్రస్తుతం మూడింట రెండొంతుల మంది ఎంపిలు ఉంటే విలీనం సాధ్యమని నిబంధనను తప్పుగా అన్వయించుకొని, గోడ దూకాలని చూస్తున్న ఎంపిలు అనర్హత వేటు నిబంధనను ఎదుర్కోక తప్పదు. స్పీకర్ విచారణ, కోర్టు కేసులు ఎదుర్కోక తప్పదు. తీర్పు సానుకూలంగా వచ్చే వరకు ఫిరాయింపుదారులకు టెన్షన్ తప్పదు.
శివసేన ఆవిర్భావ దినోత్సవాన్ని మరోచోట చేసిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఫిరాయింపుల గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు చూసింది ట్రైలర్ మాత్రమేనని, ఇంకా సినిమా చాలా ఉందన్న ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న వ్యక్తికి ఏ మాత్రం శోభనివ్వవు. అయినప్పటికీ, బహిరంగంగానే ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా సంకేతాలిచ్చేందుకు మొహమాట పడకపోవడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఫిరాయింపుల అంశంలో మరో చిత్రమైన అంశం వెలుగులోకి వచ్చింది. టిఎంసి, శివసేన
(యుబిటి)నుంచి ఫిరాయించిన ఎంపిలు తమకు ప్రజల్లో మద్దతుందని ఘనం గా చెప్పుకుంటున్నారు. అదే సమయంలో వారికి ఆయా రాష్ట్ర ప్రభుత్వా లు భద్రతను పెంచాయి. మరోవైపు టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ, దాడులు ఎదుర్కొన్న అభిషేక్ బెనర్జీ సహా, ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులకు రక్షకుల సంఖ్యతను కుదించి, వారి భద్రతను గాలిలో దీపంలా మార్చేస్తున్నారు.
లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో స్వంతంగా మెజారిటీ రాకపోవడం, మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో నియోజవర్గాల సంఖ్య పెంపు, పునర్విభజన బిల్లులు లోక్‌సభలో ఓడిపోవడంతో అహం దెబ్బతిన్న ప్రభుత్వ అగ్ర నాయక ద్వయం ఫిరాయింపులకు తెరలేపిందనేది వాస్తవం. ఈ ఆటలో ఇతర పార్టీల కప్పదాట్లతో బలాన్ని పెంచుకున్న మోదీ ప్రభుత్వానికి నిన్న మొన్నటి వరకు ఊపిరినందించిన తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ (యు)లతో పని తీరిపోయింది.
ఇప్పటికే జెడి(యు) అధినేత నితిశ్ కుమార్‌ను బిహార్ సిఎం పదవికి రాజీనామా చేయించి, రాజ్యసభ కు పంపించారు. కాబట్టి ఎన్‌డిఏలో ఉన్నప్పటికీ టిడిపికి నిశ్చింత అని అనుకోలేము. టిఎంసి ఎంపిల ఫిరాయింపు ఆపరేషన్‌లో టిడిపి మాజీ ఎంపి, బిజెపిలో చేరిన ప్రస్తుత అనకాపల్లి ఎంపి సి.ఎం.రమేశ్‌ను బిజెపి నేతలు కీలకంగా వాడుకోవటం విస్మరించలేనిది. శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపిస్తున్నట్లుగా ‘డబ్బులతో ఎంపిలను కాజేస్తున్నారు.’డబ్బు రాజకీయాలను శాసిస్తున్న ఈనాటి రాజకీయాల్లో విలువలు కోల్పోతున్న ప్రజాస్వామ్యం వలవల రోదిస్తోంది!