ప్రతి పేదవాడికి ఇంటి కొరకు మరో ఇండ్ల పోరాటానికి వామపక్షాలు సంసిద్ధం
Left-Wing Groups Launch New Campaign for Housing Rights
*ప్రతి నిరుపేదకు ఇల్లు, ఇల్లు ఉన్నవారికి పట్టాలకు సర్వేలు, దరఖాస్తుల స్వీకరణ
*10 వేల మందితో ఈ నెల 27న హనుమకొండలో భారీ ప్రదర్శన
*జూలై 1న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, కలెక్టర్ కార్యాలయాల ముందు పెద్దఎత్తున ముట్టడి, నిరసన ప్రదర్శనలు
*జూలై 6న హైదరాబాద్ (ఇందిరాపార్క్) లో వేలాది మందితో ధర్నా
పేదలకు ఇళ్లను సాధించడమే లక్షంగా సమరశీల పోరాటాలు ః
మహత్తర గుడిసెల పోరాటానికి’ ఏ పేరు పెట్టాలనేది జూలై 2న జరుగు సమావేశం లో స్పష్టత
కూనంనేని సాంబశివరావు వెల్లడి…
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు ఇళ్లు, ఇంటి స్థలం సాధించడమే లక్షంగా వామపక్షపార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యమం తరహాలో మరో పోరాటానికి శ్రీకారం చుట్టనున్నట్లు వామపక్ష పార్టీల నేతలు ప్రకటించారు. ఇందులో భాగంగా గుండ్ల సింగారం, గోపాల్ పూర్ తొలగించిన గుడిసెల స్థానాలలో పేదలకు ఇళ్ల కట్టించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, సిపిఐ(ఎం) ఇతర వాపపక్ష పార్టీల ఆధ్వర్యంలో 10 వేల మందితో ఈ నెల 27న హనుమకొండలో భారీ ప్రదర్శనను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హనుమకొండ జిల్లాలోని గుండ్ల సింగారంలో పేదలు నిలువ నీడ కోసం వేసుకున్న గుడిసెలను అధికారులు బందిపోటు దొంగలల చోరబడి రాత్రి రాత్రికి వాటిని తొలగించారని తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. అత్సుహాంతో అధికారులు ఎక్కడెక్కడ గుడిసెలు తొలగించారో అక్కడ తిరిగి గుడిసెవాసులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని లేకపోతే ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తామని వారు హెచ్చరించారు.
సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్ ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ ఏ కూనంనేని సాంబశివరావు, సహాయ కార్యదర్శులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈ.టి.నరసింహా, కార్యదర్శివర్గ సభ్యురాలు పశ్యపద్మ, సిపిఐ ఎంఎల్ సి నెల్లికంటి సత్యం,హైదరాబాద్ జిల్లా కార్యదర్శి బి.స్టాలిన్, వరంగల్ జిల్లా సెక్రటరీ బాషామియా, హనుమకొండ జిల్లా పార్టీ కార్యదర్శి కర్రె భిక్షపతి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అబ్బాస్ , సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కె.గోవర్ధన్, ఎంసిపిఐ నాయకులు సుధాకర్, ఎస్ నాయకులు భరత్ పాల్గొన్నారు.
పేదలకు ఇళ్లను సాధించడమే లక్షంగా సమరశీల పోరాటాలు ః కూనంనేని సాంబశివరావు
సమావేశంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్లు లేని నిరు పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు దక్కేలా కమ్యూనిస్టు పార్టీలు సమరశీల పోరాటాలకు సన్నద్దం కావాలని వామపక్ష పార్టీలు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన దశల వారి ఉద్యమ కార్యాచరణను ఆయన వెల్లడించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం జూలై 1న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, కలెక్టర్ కార్యాలయాల ముందు పెద్దఎత్తున ముట్టడి, నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదల నుంచి దరఖాస్తులను సేకరించి జూలై 6న హైదరాబాద్ (ఇందిరాపార్క్) వేలాది మందితో ధర్నా నిర్వహించనున్నట్లు వారు చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పేదల నుంచి సేకరించిన దరఖాస్తులను నేరుగా సమర్పిస్తామన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి స్పందన మేరకు తమ ఉద్యమ కార్యాచరణ ఉంటుందని వారు చెప్పారు. ఈ ‘మహత్తర గుడిసెల పోరాటానికి’ ఏ పేరు పెట్టాలనేది జూలై 2న సమావేశమై నిర్ణయించనున్నట్లు కూనంనేని సాంబశివరావు వెల్లడించారు.
అధికారులు, పోలీసులు దొంగల మాదిరిగా అర్ధరాత్రి ఇళ్ళను కూల్చడం దుర్మార్గం
హనుమకొండ జిల్లా గుండ్ల సింగారంలో గత 4 ఏళ్లుగా నిరుపేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తుంటే అధికారులు, పోలీసులు దొంగల మాదిరిగా అర్ధరాత్రి సమయంలో గ్రామంపై పడి ఎలాంటి విచక్షణ లేకుండా పేదల ఇళ్ళను కూల్చివేయడం దుర్మార్గమని సాంబశివరావు ఆగ్రహాం వ్యక్తం చేశారు. మహిళలు, పిల్లలు అని కూడా చూడకుండా బలవంతంగా లాగిపడేసి అడ్డంవచ్చిన యువకులు, వృద్ధుల కాళ్ళు చేతులు మడిచి మరీ బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి, సుమారు 300 నుండి 400 మందిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒకప్పుడు అక్కడ ఉన్న ’కోమల కుంట’ అనే చెరువును ప్రభుత్వం పూడ్చి, ఎస్సారెస్పీ కాల్వను తవ్వేందుకు సిద్ధమైందని, ఇదే క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో 2009లోనే అప్పటి సిఎం రాజశేఖర్ రెడ్డి సర్వే నంబర్ 174, 175 కింద ఉన్న 56 ఎకరాల భూమిలో దాదాపు 1400 మంది పేదలకు పట్టాలు పంపిణీ చేశారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా మరో 40 మందికి ఇక్కడే పట్టాలు ఇవ్వగా ప్రస్తుతం బాధితులు కేవలం 8 ఎకరాల పరిధిలోనే గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని తెలిపారు. ఇక్కడ, కాల్వ ద్వారా నీరు వచ్చే పరిస్థితి లేకపోయినా అధికారులు అత్సుహాంతో గుడిసెలు కూల్చివేశారని, ఇప్పటికే ఈ సర్వే నంబర్లలోని వందలాది ఎకరాలు ఇతరుల ఆధీనంలో ఉన్నాయని, వాటిని ఎందుకు కూల్చివేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ కూల్చివేతలకు సంబంధించి స్థానిక ఎంఎల్ ఏ వివరణ కోరగా తనకు తెలియదని తప్పించుకున్నారన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, సలహాదారు నరేందర్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇదే తరహాలో రెండు రోజుల కింద గోపాల్ ప్రాంతంలో సిపిఐ(ఎం) నాయకత్వంలో పేదలు వేసుకున్న గుడిసెలను కూడా ఎలాంటి దయాదాక్షిణ్యాలు లేకుండా కూల్చేసి, చుట్టూ ఫెన్సింగ్ వేశారన్నారు. గతంలో వెలుగుమట్లలోనూ ఇలాగే జరిగిందని, కూల్చేసిన చోటే మళ్ళీ ఇళ్ళు కట్టించి ఇస్తామని ప్రభుత్వం చెప్పడం వారి ద్వంద్వ విధానానికి నిదర్శనమని విమర్శించారు. గోపాల్ గుండ్ల సింగారం బాధితులకు వెలుగుమట్ల తరహాలోనే ప్రత్యామ్నాయ ఇళ్ళు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మహానగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో లక్షలాది మంది పేదలు 25, 30, 50 గజాల లోపు చిన్న చిన్న గుడిసెల్లో, మురికివాడల్లో నివసిస్తున్నారని వివరించారు. వీరంతా భూదాన్ భూములు, ప్రభుత్వ భూములు, మిగులు భూముల్లో దశాబ్దాలుగా ఉంటున్నారని వీరందరికి పట్టాలను ఇవ్వాలని సాంబశివరావు డిమాండ్ చేశారు.
పేదలపై అక్రమ కేసులు అన్యాయం ః అబ్బాస్
అబ్బాస్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లా గుండ్ల సింగారం, గోపాల్ వెలుగుమట్ల, జగిత్యాల ప్రాంతాల్లో పేదలు వేసుకున్న దాదాపు 2 వేల గుడిసెలను ప్రభుత్వం అమానుషంగా కూల్చివేయడాన్ని సిపిఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. పేదలపై అక్రమంగా కేసులు బనాయించి 40 నుండి 50 రోజుల పాటు జైళ్లలో పెట్టడం అత్యంత దారుణమన్నారు. 2007లో జరిగిన భూపోరాటంలో ముదిగొండ కాల్పుల్లో ఏడుగురు పేదలు ప్రాణాలు కోల్పోయారని, ఆతర్వాతే అప్పటి సిఎం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు ‘ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని’ ప్రారంభించారని గుర్తు చేశారు. నాడు ఆ పథకం కింద పట్టాలు పొందిన వారి ఇళ్లను కూడా నేడు ప్రభుత్వం కూల్చివేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.
పేద ప్రజలపై బుల్డోజర్లు ఎక్కించకండి: గోవర్ధన్
ప్రభుత్వం పేద ప్రజలపై యుద్ధం చేయవద్దని, వారిపై బుల్డోజర్లు ఎక్కించి ఉసురు పోసుకోవద్దని కె.గోవర్థన్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ‘గుడిసె రహిత’ లేదా ఇల్లు లేని కుటుంబం అంటూ ఏదీ లేకుండా, ప్రతి కుటుంబానికి నిలువ నీడ ఉండేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దొంగల్లాగా, బందిపోట్లలాగా తెల్లవారుజామున వెళ్లి ఇళ్లను కూల్చడం సరైన పద్ధతి కాదన్నారు. కమ్యూనిస్టులుగా తాము ఎలాంటి గొంతెమ్మ కోరికలు కోరడంలేదన్నారు. కేవలం పేదలు తల దాచుకునేందుకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
కబ్జాల చిట్టా ఇస్తాం.. చర్యలు తీసుకోండి: సుధాకర్
నిలువ నీడ లేని పేదల పక్షాన నిలబడి పోరాడేది కమ్యూనిస్ట్ పార్టీలేనని, రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయో, ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములను అక్రమించుకున్నారో ఆ వివరాలన్నీ తాము ఇస్తామని, ధైర్యముంటే వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సుధాకర్ సవాల్ చేశారు. ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందని వెలుగులోకి తెచ్చింది కమ్యూనిస్టులేనని, బడా బాబుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడుతున్నది కూడా తామేనని స్పష్టం చేశారు.
అధికారుల అత్యుత్సాహంపై విచారణ జరపాలి ః భరత్
కొంతమంది పోలీస్ అధికారులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు కొందరు పెద్దల అండతో పేదలపై అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఇళ్లను కూల్చివేస్తున్నారని భరత్ ఆగ్రహాంవ్యక్తం చేశారు. అసలు ఈ కూల్చివేతలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జరుగుతున్నాయా లేక అధికారులు ఇష్టారాజ్యంగా చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఒక వేళ ప్రభుత్వం నుండి ఎలాంటి ఉత్తర్వులు లేకుండా, అధికారులే సొంత నిర్ణయాలతో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పేదలపై దాడులకు తెగబడుతున్న అధికారులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.