ఎస్ఐఆర్ ప్రక్రియతో ముస్లిం ఓట్లు తొలగించే అవకాశం.. ఓటర్ల హక్కులపై ఆందోళన వ్యక్తం చేసిన అజహరుద్దీన్
Azharuddin Raises Concern Over SIR and Minority Voting Rights
తెలంగాణ రాజకీయాల్లో ఓటర్ల జాబితా సవరణ అంశం సరికొత్త వివాదానికి తెరలేపింది. ఎన్నికల కమిషన్ చేపట్టే ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియను అడ్డం పెట్టుకుని ముస్లింల ఓట్లను అక్రమంగా తొలగించే అవకాశం ఉందంటూ రాష్ట్ర మంత్రి మహ్మద్ అజారుద్దీన్ సంచలన ఆరోపణలు చేశారు. గాంధీభవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘సర్’ (SIR) ప్రక్రియ అనేది సాంకేతికంగా అందరు ఓటర్లకు వర్తించేదే అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ముస్లింల ఓట్లను మాత్రమే ప్రత్యేకంగా టార్గెట్ చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలలో ముస్లింల ఓట్లను భారీగా తొలగించడం ద్వారానే బీజేపీ లబ్ధి పొంది అధికారంలోకి రాగలిగిందని ఆయన విమర్శించారు. ఇప్పుడు అదే తరహా కుట్రలు తెలంగాణలోనూ పునరావృతమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ ప్రక్రియలో తొలగించే ఓట్ల ఆధారంగానే ఎన్నికల ఫలితాలు మారిపోయే ప్రమాదం ఉందని, కాబట్టి ప్రజలందరూ అలసత్వం వహించకుండా తమ ఓటు హక్కును స్వయంగా సరిచూసుకుంటూ కాపాడుకోవాలని మంత్రి సూచించారు.
ఇదే సమావేశంలో తన భాషా నైపుణ్యాల గురించి మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు తెలుగు చదవడం, రాయడం వచ్చని, చిన్నప్పుడు బాగానే ప్రాక్టీస్ చేశానని చెప్తూనే, మాట్లాడేటప్పుడు మాత్రం కొంత ఇబ్బందిగా ఉంటుందని ఒప్పుకున్నారు. మాట్లాడే క్రమంలో ఏవైనా తప్పులు దొర్లితే ఇబ్బందికరంగా మారుతుందనే ఉద్దేశంతోనే, తాను సులభంగా మాట్లాడగలిగే భాషనే ఎంచుకుంటానని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వ పాలన గురించి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అద్భుతమైన ప్రజాపాలన సాగుతోందని మంత్రి అజారుద్దీన్ కొనియాడారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని, గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పెండింగ్లో పడిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తాము క్రమబద్ధంగా విడుదల చేస్తున్నామని గుర్తుచేశారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఇప్పటివరకు ప్రచార ఆర్భాటాలకు పోకుండా, దాదాపు 200 మందికి పైగా సామాన్య ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించానని, పబ్లిసిటీపై తనకు ఎలాంటి మోజు లేదని మంత్రి స్పష్టం చేశారు.