Skip to content
జాతీయం వార్తలు

ముగ్గురు భారతీయులు మృతి..ఒమన్ తీర ఘటనపై అమెరికాపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్

Prajapaksham 13 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ముగ్గురు భారతీయులు మృతి..ఒమన్ తీర ఘటనపై అమెరికాపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్

India Raises Strong Objection With U.S. Over Death of Three Indians

గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో పలావు దేశ జెండాతో ప్రయాణిస్తున్న సెట్టెబెల్లో అనే ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా నావికా దళం జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికాకు తన నిరసనను దౌత్యపరంగా తెలియజేసింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫోన్‌లో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర, వాణిజ్య నౌకలపై ఇలాంటి ప్రాణాంతక దాడులు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. ఈ ఉద్రిక్తతలకు సంబంధించి ఆయన సోషల్ మీడియా వేదికగా తన నిరసనను పంచుకున్నారు.

ఈ దౌత్యపరమైన వివాదం ముదరడంతో, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఢిల్లీలోని అమెరికా తాత్కాలిక రాయబారి (CDA) జాసన్ మీక్స్‌ను సౌత్ బ్లాక్ కార్యాలయానికి పిలిపించి గట్టిగా వివరణ కోరింది. భారతీయ నావికులు ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం పదేపదే దాడులకు తెగబడటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పౌర నౌకలపై ఇలాంటి ఘోరమైన ఆయుధాలను ఉపయోగించడం అంతర్జాతీయ సముద్ర చట్టాలకు విరుద్ధమని, ఇది ప్రపంచ వాణిజ్య భద్రతను, ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని భారత్ గట్టిగానే హెచ్చరించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రాణాంతక సంఘటనలు పునరావృతం కాకుండా అమెరికా తగిన చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేసింది.

ఈ ప్రమాద సమయంలో సెట్టెబెల్లో నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 24 మంది భారతీయులు ఉన్నారు. అమెరికా వైమానిక దళం జరిపిన ఈ దాడి తర్వాత 21 మంది భారతీయ నావికులు సురక్షితంగా బయటపడగా, గల్లంతైన ముగ్గురు భారతీయులు మరణించినట్లు అధికారికంగా నిర్ధారణ అయింది. మరణించిన వారిని డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్‌లుగా గుర్తించారు. ఈ నౌకలో భారతీయులతో పాటు ఇద్దరు పాకిస్థానీయులు, ఒక ఉక్రెయిన్, ఒక రష్యా జాతీయుడు కూడా ప్రయాణిస్తున్నారు.

మరోవైపు ఈ దాడిపై అమెరికా సైనిక విభాగం సెంట్రల్ కమాండ్ (CENTCOM) స్పందిస్తూ.. ఇరాన్‌పై విధించిన అంతర్జాతీయ చమురు ఆంక్షలు, నౌకా దిగ్బంధనాన్ని ఉల్లంఘించి ఈ ట్యాంకర్ చమురు రవాణాకు ప్రయత్నించిందని ఆరోపించింది. అమెరికా దళాలు ఇచ్చిన హెచ్చరికలను, ఆదేశాలను నౌక సిబ్బంది పదేపదే ధిక్కరించడం వల్లే దానిని నిలిపివేసేందుకు నౌక ఇంజిన్ రూమ్‌ను లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన క్షిపణి దాడి చేయాల్సి వచ్చిందని సెంట్‌కామ్ సమర్థించుకుంది.

పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దాడి జరగడం అంతర్జాతీయ సమాజంలో ఆందోళన కలిగిస్తోంది. సముద్ర మార్గాల్లో సురక్షిత రవాణాను పునరుద్ధరించడానికి తక్షణమే దౌత్యపరమైన చర్చలు జరపాలని భారత్ కోరుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *