రైతులను నట్టేట ముంచుతున్న నకిలీ విత్తనాలు
Farmers Suffer Heavy Losses Due to Spurious Seeds
వానాకాలం సీజన్ వచ్చిందంటే చాలు రైతులకు నకిలీల బెడద తప్పడం లేదు. ఆరు గాలం శ్రమించి సాగుచేస్తే తీరా చేతికొస్తుందనుకున్న పంట రాకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మొదట్లోనే నకిలీ విత్తనాల ఆటకట్టిస్తే పంట చేతికొచ్చి, నష్టాల్లేకుండా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.
వానాకాలం సీజన్ కంటే ముందే నకిలీ విత్తన ముఠా చేయని ప్రయత్నమంటూ ఉండదు. లూజ్ విత్తనాలను ఆకర్షణీయమైన కవర్లలో ప్యాకింగ్ చేసి రైతులకు తక్కువ ధరలకే అంటగడుతూ నిలువునా మోసం చేయడం దళారులకు అలవాటుగా మారింది. అసలు ఏదో.. నకిలీది ఏదో.. గుర్తించలేని విధంగా విత్తనాలు మార్కెట్ ఉంటుండటం తో రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. ప్రధానంగా వరి, పత్తి విత్తనాలు నాసిరకం కావడంతో రైతుల కు నష్టాలు తప్పడంలేదు. వరి, పత్తి విత్తనాల విషయంలో దళారులదే పెత్తనమైంది. గ్రామీణ ప్రాంతాల్లో దళారులు రైతులను మచ్చిక చేసుకుని తక్కువ ధర, అధిక దిగుబడులు, తక్కువ సమయంలో పంట చేతికి వస్తుందని నమ్మించి నాసిరకం విత్తనాలు అంటకడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నా దళారుల దందాను నిలువరించలేక పోతున్నారు. గత ఏడాది మే లో అన్ని జిల్లాల్లో వ్యవసాయ శాఖ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పలు జిల్లాల్లో పలుచోట్లకేసులను కూడా నమోదు చేసిన సందర్భాలున్నాయి. ఒకానొక దశలో పిడి యాక్టును కూడా అమలు చేశారు. అయినప్పటికీ విత్తనాల నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. పెట్టుబడులు చేతిలోలేని రైతులు తక్కువ ధరకు వచ్చే విత్తనాలను తీసుకుని వేసిన సందర్భాలూ ఉన్నాయి. దీంతోనే రైతులు నష్టపోతున్నారు. తాజాగా ఆయా జిల్లా ల ఉన్నతాధికారులు టాస్క్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. వ్యవసాయ శాఖతోపాటు పోలీసు శాఖ, రెవెన్యూశాఖ సమన్వయంతో పలు టీంలు ఏర్పడి తనిఖీలు విస్తృతంగా చేయాలని నిర్ణయించాయి. ప్రతీ సీజన్ కు ముందు టాస్క్ అధికారులను తప్పుదోవ పట్టించే విధంగా పత్తి విత్తనాలు విక్రయించే రంగంలో ముదిరిపోయిన కొందరు డీలర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈసారైనా టాస్క్ అధికారులు పత్తి విత్తనాలు విక్రయించే డీలర్లపై నిఘా పెట్టి తనిఖీలు చేస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది.
ఈ నెల నాలుగో వారం నుంచి వ్యవసాయ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే దుక్కులను దున్నకుని సిద్ధం చేసుకున్నారు. తెలంగాణలో సైతం ముందుగానే వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురిస్తే ముందుగానే విత్తనాలు వేస్తారు. కొందరు డీలర్లది ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. కొందరు డీలర్లు తమకు ప్రజాప్రతినిధుల అండ ఉందని రాజకీయ పార్టీలతో సంబంధాలున్నాయని బాహాటంగా పేర్కొంటూ దందాలకు పాల్పడుతున్నట్లు రైతులనుంచి విమర్శలు వస్తున్నాయి. సీజన్ తమ దుకాణాలను టాస్క్ అధికారులు తనిఖీలు చేయకుండా ఉండేలా తమకు ప్రజాప్రతినిధుల అండ ఉందని చెబుతుండటం గమనార్హం. ప్రస్తుతం టాస్క్ పోలీస్, వ్యవసాయ, రెవెన్యూశాఖ అధికారులు ఉన్నారు. ఆంధ్ర నుంచి నిషేధిత బిటి-3 విత్తనాలు వస్తున్నాయి.
అమెరికా దేశంలోని మోనో శాంటో కంపెనీకి చెందిన బిటి-3 రకం విత్తనాలపై దేశవ్యాప్తంగా నిషేధం ఉంది. బిటి 3 విత్తనాలకు కేంద్ర ప్రభు త్వం నుంచి ఎలాంటి అనుమతి లేదు. బిటి1, బిటి 2 రకాలకు మాత్రమే అనుమతి ఉంది. దాదాపు 20 ప్రధాన కంపెనీలకు చెందిన అనుమతిగల విత్తనాలను అందుబాటులో ఉంచారు.
ఇకపోతే నిషేధిత విత్తనాలవల్ల కాలుష్యంతో ముప్పు వాటిల్లే అవకాశంతోపాటు అనేక రకాలుగా నష్టాలున్నా యి. వివిధ జిల్లాల్లో అత్యధికంగా పత్తి జిన్నింగ్ మిల్లులు ఉండటంతో విత్తనోత్పత్తి సులువుగా జరుగుతుంది. అన్ని రకాల విత్తనాలు నష్టం కలిగించనప్పటికీ దళారుల జోక్యంతో బీటీ-2 రకం విత్తనాల పేరిట బిటి-3 రకం విత్తనాలను అంటగడుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారుల దృష్టికి సైతం వచ్చినట్లు సమాచారం. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ మాచర్ల నుంచి అన్ని జిల్లాలకు నాసిరకం విత్తనాలతో పాటు బిటి-3 రకం విత్తనాలు కూడా చేరుతున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ సరిహద్దులోనే మాచర్ల ఉండటంతో సులువుగా వివిధ మార్గాల్లో నకిలీ పత్తి విత్తనాలు చేరుతున్నాయి. మహారాష్ట్ర నుండి కూడా వస్తున్నాయి. వాస్తవానికి చాలామంది డీలర్లు, వ్యాపారులు రైతులు పత్తి, వరి విత్తనాలు కొనుగోలు చేసిన వెంటనే వారికి బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలాచోట్ల రశీదు ఇవ్వకుండా రైతులను మభ్య పెట్టి పంపించి వేస్తున్న సంఘటనలున్నాయి. పంట దిగుబడులు తక్కువగా వచ్చినప్పుడు రైతు లు నిలదీస్తారన్న భయంతో ఏ వ్యాపారి కూడా బిల్లులు ఇవ్వడం లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక, ఛత్తీస్ గుజరాత్ నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి రహస్య మార్గాల్లో జిల్లాలకు చేరవేస్తున్నారు. ఒరిజినల్ కంపెనీలకు చెందిన ప్యాకెట్ల మాదిరిగానే నకిలీ ప్యాకెట్లు తయారుచేసి అందులో నాసిరకమైన పత్తి విత్తనాలను నింపి రైతులకు అంటగట్టే ప్రమాదం ఉంది.
ప్రతీ రైతు కూడా విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇతర ప్రాంతాల నుంచి బిటి-2 విత్తనాల పేరిట బిటి3 విత్తనాలను అంటగట్టే ప్రమాదం ఉంది. రైతులు పూర్తిస్థాయిలో అనుమతులున్నా లైసెన్స్ ఉన్న డీలర్లు, వ్యాపారుల వద్దే విత్తనాలను కొనుగోలు చేసి రశీదులు తీసుకోవాలి. మధ్య దళారుల వద్ద ఎట్టి పరిస్థితులోను విత్తనాలను కొనుగోలు
చేయవద్దు.