Skip to content
జాతీయం వార్తలు

మారణహోమాన్ని సైనిక చర్యగా చూపినా నిజాలు ఎప్పటికీ దాగవు.. యూఎన్‌ వేదికగా పాక్‌పై విరుచుకుపడిన భారత్..

Prajapaksham 09 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
మారణహోమాన్ని సైనిక చర్యగా చూపినా నిజాలు ఎప్పటికీ దాగవు.. యూఎన్‌ వేదికగా పాక్‌పై విరుచుకుపడిన భారత్..

India Hits Back at Pakistan in UN, Says Terror Acts Cannot Be Masked as Military Operations

ఐక్యరాజ్యసమితి (UN) వేదికగా పాకిస్థాన్ దుశ్చర్యలపై భారత్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆఫ్ఘనిస్థాన్ భూభాగంపై పాకిస్థాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు ఆఫ్ఘనిస్థాన్ సార్వభౌమాధికారాన్ని నిలువునా ఉల్లంఘించడమేనని, ఇది ఆ దేశ భద్రతకే కాక యావత్ పశ్చిమాసియా, దక్షిణ ఆసియా ప్రాంతీయ శాంతికి పెను ముప్పుగా మారుతుందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస సర్వసభ్య సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి, అంబాసిడర్ హరీశ్‌ పర్వతనేని మాట్లాడుతూ.. పాక్ జరిపిన ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో అమాయక పౌరులు, మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్థాన్‌లో పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి సహాయ మిషన్ (UNAMA) నివేదికలను ఆయన సభలో ఉటంకించారు. ఈ ఏడాది కేవలం మొదటి మూడు నెలల్లోనే పాక్ దాడుల కారణంగా 372 మంది పౌరులు మరణించారని, మరో 397 మంది తీవ్రంగా గాయపడ్డారని సభ దృష్టికి తెచ్చారు. అందులోనూ అత్యధికులు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జరిగిన దాడుల్లోనే ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణమైన విషయమని ఆయన పేర్కొన్నారు.

ఇదే సమావేశంలో ఐరాస సమర్పించిన అధికారిక నివేదికల విశ్వసనీయతను పాకిస్థాన్ ప్రతినిధులు ప్రశ్నించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఐక్యరాజ్యసమితి వేదికలపై అంతర్జాతీయ నిబంధనలను గౌరవించడం అనేది ఎవరి ఇష్టానుసారం వారు ఎంచుకునే హోటల్ ‘మెనూ’ కాదని హరీశ్‌ పర్వతనేని పాకిస్థాన్‌కు గట్టిగా బదులిచ్చారు. ఐరాస నివేదికలు తమకు నచ్చినప్పుడు వాటిని నెత్తిన పెట్టుకుని, తమ తప్పులను ఎండగట్టినప్పుడు వాటిని తిరస్కరించడం కుదరదని ఘాటుగా విమర్శించారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి, స్థిరత్వం కోసం యూఎన్ఏఎంఏ (UNAMA) ప్రాణాలకు తెగించి చేస్తున్న కృషికి భారత్ ఎల్లప్పుడూ పూర్తి మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ మానవతా చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, పౌరుల రక్షణను నిర్ధారించాలని ఐరాస సెక్రెటరీ జనరల్ ఇచ్చిన పిలుపును భారత్ సంపూర్ణంగా సమర్థిస్తోందని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌పై జరిగిన ఈ వైమానిక దాడులపై ఉన్నత స్థాయి పూర్తి దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి హింసాత్మక చర్యలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *