Skip to content
జాతీయం వార్తలు

బొద్దింకలు దేనికీ భయపడవు, అవి ఎప్పటికీ చావవు.. జంతర్ మంతర్ వద్ద నిరసనలో అభిజీత్ దిప్కే..

Prajapaksham 06 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
బొద్దింకలు దేనికీ భయపడవు, అవి ఎప్పటికీ చావవు.. జంతర్ మంతర్ వద్ద నిరసనలో అభిజీత్ దిప్కే..

Abhijeet Dipke Leads Protest Movement, Delhi Security Put on Alert

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం ఉదయం తీవ్ర ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న వరుస వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (సీజేపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు.

నీట్ (NEET) పేపర్ లీకేజీ, సీబీఎస్‌ఈ (CBSE) మార్కింగ్ విధానంలో లోపాలు, సీయూఈటీ (CUET), ఎస్‌ఎస్‌సీ జీడీ (SSC GD) వంటి పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలపై దేశవ్యాప్తంగా కోట్ల మంది విద్యార్థులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో, సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది మద్దతును కూడగట్టి పెను సంచలనం సృష్టించిన ఈ డిజిటల్ ఉద్యమ వ్యవస్థాపకుడు, 30 ఏళ్ల అభిజీత్ దీప్కే అమెరికాలోని బోస్టన్ నగరం నుండి నేరుగా ఢిల్లీ చేరుకుని ఈ ఆందోళనకు స్వయంగా నాయకత్వం వహించడంతో జంతర్ మంతర్ పరిసరాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

జంతర్ మంతర్ వద్ద గుమిగూడిన నిరసనకారులను ఉద్దేశించి అభిజీత్ దీప్కే ప్రసంగిస్తూ.. “దేశ యువత ఇకపై భయపడదు, తమ హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడుతుంది. బొద్దింకలు దేనికీ భయపడవు, అవి ఎప్పటికీ చావవు” అంటూ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. గత నెలలో కోర్టు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. నకిలీ డిగ్రీలతో తిరుగుతూ వ్యవస్థపై దాడి చేసే కొంతమంది యువతను ఉద్దేశించి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యంగ్యాస్త్రంగా ఆన్‌లైన్‌లో ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆవిర్భవించింది.

ఒక చిన్న జోక్‌గా ప్రారంభమైన ఈ డిజిటల్ ప్రచారం, ఇప్పుడు దేశవ్యాప్తంగా 2 కోట్లకు పైగా సామాజిక మాధ్యమాల ఫాలోవర్లతో యువత సమస్యలపై గళమెత్తే ఒక బలమైన వ్యవస్థీకృత ఉద్యమంగా మారిందని ఆ పార్టీ ప్రతినిధులు స్పష్టం చేశారు. తాము ఓట్లేసి గెలిపించిన విద్యాశాఖ మంత్రి, తమ పన్నుల డబ్బులతోనే జీతం తీసుకుంటూ కోట్ల మంది యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టేశారని నిరసనకారులు మండిపడ్డారు. ‘బొద్దింకలు వస్తున్నాయి.. ధర్మేంద్ర ప్రధాన్ వెళ్తున్నారు’ అంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ట్రెండ్ చేస్తూ ధర్నాను కొనసాగిస్తున్నారు.

ఈ నిరసన పిలుపు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు, కేంద్ర యంత్రాంగం అత్యంత అప్రమత్తమయ్యారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లు మరియు ఢిల్లీ సరిహద్దులతో పాటు కేంద్ర ఢిల్లీకి వచ్చే ప్రధాన రహదారులపై వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 కంపెనీల పారామిలటరీ బలగాలను, వెయ్యి మందికి పైగా పోలీసులను మోహరించారు.

తొలుత ఈ ప్రదర్శనకు అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నప్పటికీ, ఆ తర్వాత పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ అధికారులను సంప్రదించగా జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతి లభించిందని సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, విజేత దహియా స్పష్టం చేశారు. దీంతో ఉదయం నుంచే దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని తమతో తెచ్చుకున్న జాతీయ జెండాలు, పుస్తకాలను ప్రదర్శిస్తూ విద్యా వ్యవస్థలోని లోపాలపై నినాదాలు చేశారు.

ఈ వినూత్న నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుండి మద్దతు లభిస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి జూన్ 5 లోగా రాజీనామా చేయని పక్షంలో తాము కూడా ఈ ఆందోళనలో భాగస్వామ్యం అవుతామని ప్రముఖ విద్యా సంస్కర్త సోనమ్ వాంగ్‌చుక్ ఇదివరకే ప్రకటించి సంఘీభావం తెలిపారు. మరోవైపు మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ పరిధిలోని అభిజీత్ స్వగ్రామమైన సంతుక్ పింప్రి గ్రామస్తులు, స్నేహితులు కూడా ఈ నిరసనకు మద్దతు తెలుపుతూ, దేశ యువత భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ పోరాటం శాంతియుతంగా ముగియాలని ఆకాంక్షించారు.

దేశవ్యాప్తంగా జనరేషన్ జెడ్ (Gen Z) యువతను విశేషంగా ఆకట్టుకున్న ఈ ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ నిరసనలు, విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం కోసం డిజిటల్ శకం సృష్టించిన ఒక సరికొత్త రాజకీయ మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఆందోళనల దృష్ట్యా నగరంలో మెట్రో సేవలకు ఎలాంటి అంతరాయం కలగలేదని, రవాణా సజావుగా సాగేలా తగిన చర్యలు తీసుకున్నామని పోలీసులు స్పష్టం చేశారు.