జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ నడిబొడ్డున.. ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపిన పవన్ కళ్యాణ్..
Pawan Kalyan Fires Back at Telangana Leaders, Sparks Political Debate
తెలంగాణ గడ్డతో తనకు రాజకీయాలకు అతీతమైన, విడదీయరాని అనుబంధం ఉందని, ఈ ప్రాంతంపై తనకు ఎనలేని ప్రేమ ఉందని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. తనపై కొందరు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు, హద్దులు దాటిన బెదిరింపుల నేపథ్యంలో ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని తన జూబ్లీహిల్స్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో అత్యంత ఘాటుగా స్పందించారు. ఇకపై తెలంగాణలో జరిగే అన్ని ఎన్నికల్లో జనసేన పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని సంచలన ప్రకటన చేస్తూ, తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఎలా అడుగు పెడతావని, ఇక్కడ నీకేం పని అని కొందరు నన్ను ప్రశ్నిస్తున్నారు. దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఏమైనా వాళ్ల అయ్య జాగీరా? ఇలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తిని నేను కాదు” అని కౌంటర్ ఇచ్చారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వం తనను తిరగనివ్వబోమని బెదిరించినప్పుడు, తన ‘వారాహి’ వాహనానికి రిజిస్ట్రేషన్, అనుమతులు ఇచ్చి తనకు అండగా నిలబడింది తెలంగాణ సమాజమేనని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ నడిబొడ్డున అని, ఈ గడ్డ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఒక తెలుగువాడిగా తనపై ఉందని స్పష్టం చేశారు.
తాను ఎన్నడూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గానీ, ఇక్కడి ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను గానీ వ్యతిరేకించలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆనాడు పార్లమెంట్ తలుపులు మూసి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాన్ని విభజించిన తీరును మాత్రమే తాను వ్యతిరేకించానని చెప్పారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల పోరాటాన్ని తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని, ఇక్కడ ‘సామాజిక తెలంగాణ’ రావాలన్నదే తన నిరంతర ఆకాంక్ష అని వివరించారు. ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదాన్ని కావాలనే పెద్దది చేసి, కొందరు ప్రెస్ క్లబ్‌లలో సమావేశాలు పెట్టి మరీ తనను వ్యక్తిగతంగా దూషించే స్థాయికి దిగజారారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలపైనా పవన్ కల్యాణ్ అంతే తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో తాను ఒక చెరువును కబ్జా చేశానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారికి తానే స్వయంగా విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. సదరు భూమిని ప్రభుత్వం వెంటనే పరిశీలించాలని, ఒకవేళ తాను కబ్జా చేశానని నిరూపణ అయితే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోవచ్చని, తనపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చని బహిరంగ సవాల్ విసిరారు. తనకు పదవులు, అధికారం మీద ఆశ లేదని, ఏపీలోనే తాను ముఖ్యమంత్రి పదవిని ఆశించలేదని, అలాంటిది తెలంగాణలో అధికారం కోసం ఎందుకు ఆరాటపడతానని ప్రశ్నించారు. సమాజంలో, వ్యవస్థలో మార్పు తీసుకురావడమే జనసేన ఏకైక లక్ష్యమని పునరుద్ఘాటించారు.
తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని, ఇక్కడి ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు ఎప్పటినుంచో కోరుతున్నారని పవన్ తెలిపారు. ఇన్నాళ్లూ ఇతర రాజకీయ సమీకరణాల వల్ల ఓపిక పట్టామని, కానీ ఇకపై ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తానే స్వయంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని, రాబోయే ప్రతి ఎన్నికల్లో జనసేన పార్టీ కచ్చితంగా బరిలోకి దిగుతుందని ప్రకటించారు. తనను విమర్శిస్తున్న నాయకులు కనీసం ఆదిలాబాద్ అడవుల్లో కూడా పర్యటించి ఉండరని, కానీ తనకు తెలంగాణలోని ప్రతి అంగుళం, ప్రతి మూల తెలుసని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ చేసిన ఈ సంచలన ప్రకటనతో రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయ సమీకరణాలపై విశ్లేషకులు ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నారు.