Skip to content
తెలంగాణ వార్తలు

తెలంగాణ ప్రజల గుండెల్లో కమ్యూనిస్ట్ పార్టీ బంధం విడదీయరానిది : MLA కూనంనేని సాంబశివరావు

Prajapaksham 02 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
తెలంగాణ ప్రజల గుండెల్లో కమ్యూనిస్ట్ పార్టీ బంధం విడదీయరానిది : MLA కూనంనేని సాంబశివరావు

Telangana Formation Day Celebrated with Grandeur at CPI State Headquarters

తెలంగాణ సాధనలో, ఇక్కడి ప్రజల హక్కుల పోరాటాల్లోనూ కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర అనిర్వచనీయమని, తెలంగాణకు, సిపిఐకు మధ్య ఉన్న అనుబంధం ’పేగు బంధం’ లాంటిదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు తెలిపారు.

తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. MLA కూనంనేని సాంబశివరావు అమరవీరులకు నివాళులర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా MLA కూనంనేని మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రను, కమ్యూనిస్టు పార్టీ త్యాగాలను వేరు చేసి చూడలేమన్నారు. సాయుధ పోరాటం నుండి రాష్ట్ర సాధన వరకు సిపిఐ అనేక పోరాటాలు, త్యాగాలను చేసిందని పేర్కొన్నారు. 1945 నుండి సాగిన సాయుధ పోరాటంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మఖ్దూం మోహియుద్దీన్, రావి నారాయణ రెడ్డి, బద్ధం ఎల్లారెడ్డి వంటి మహామహుల పిలుపుతో సాగిన పోరాటంలో దాదాపు 5వేల మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేశారని స్మరించుకున్నారు.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో సోనియా గాంధీ అన్ని పార్టీల మద్దతు కోరినప్పుడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంక్షిస్తూ మొట్టమొదటి సంతకం పెట్టిన జాతీయ పార్టీ సిపిఐ పార్టీయేనని.. ఆనాడు సిపిఐ జాతీయ, ప్రాంతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని కొనియాడారు. అయితే రాష్ట్రం సిద్ధించి ఇన్నేళ్లవుతున్నా ప్రజలు ఆశించిన ‘ప్రజా తెలంగాణ‘ ఇంకా సిద్ధించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సంపన్నులు మరింత దోపిడికి తెగబడుతుంటే , నిరుపేదలు, కార్మికుల జీవితాలు ఇంకా ‘ఎక్కడి వేసిన గొంగళి అక్కడే‘ అన్న చందంగా మారాయని, ఆర్థిక సమానత్వం ఇంకా రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సాధించుకున్న తెలంగాణను నిజమైన ’ప్రజల తెలంగాణ’ గా మార్చే వరకు, ప్రజల హక్కుల కోసం సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు, భవిష్యత్తు కార్యాచరణలు రూపొందించుకుని ముందుకు సాగుతామన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటి నరసింహా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్యపద్మ, కలవేన శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, ఎన్.జ్యోతి, ఎస్.ఛాయాదేవి, విజయలక్ష్మి పండిత్, ప్రజాపక్షం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ బొమ్మగాని కిరణ్‌కుమార్, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి బి.స్టాలిన్, సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి.వెంకటేశం, సబ్బు రాజమౌలి, జె.లక్ష్మి, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహా, నాయకులు లక్ష్మి నారాయణ, ఉప్పలయ్య, డిహెచ్‌పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్,ఎఐఎసఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, ఎస్‌టియు నాయకులు కర్నాకర్‌రెడ్డి తెలంగాణ గీతపనివారల సంఘం నాయకులు బొమ్మగాని నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *