Skip to content
తెలంగాణ వార్తలు

కార్మిక ఉద్యమాల అజరామర యోధుడు కామ్రేడ్‌ మాదిరెడ్డి భాస్కర్‌ రావు

Prajapaksham 29 Jun 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
కార్మిక ఉద్యమాల అజరామర యోధుడు కామ్రేడ్‌ మాదిరెడ్డి భాస్కర్‌ రావు

కామ్రేడ్‌ మాదిరెడ్డి భాస్కర్‌ రావు (AI Image)

‘నాయకుడు అంటే పదవులు అనుభవించేవాడు కాదు… ప్రజల కష్టాల్లో ముందుండి పోరాడేవాడు’ ఈ నిర్వచనానికి సజీవ రూపం కామ్రేడ్‌ మాదిరెడ్డి భాస్కర్‌ రావు. సింగరేణి కార్మిక ఉద్యమ చరిత్రలో, తెలంగాణ కమ్యూనిస్టు ఉద్యమంలో, ఎఐటియుసి కార్మిక సంఘ నిర్మాణంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. 1930 డిసెంబర్‌ 6న జన్మించిన మాదిరెడ్డి భాస్కర్‌ రావు, 1991 జూన్‌ 30న కన్నుమూశారు. ఆయన మరణించి 35 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంగా ఆయన జీవితాన్ని, ఉద్యమాలను, ఆశయాలను స్మరించుకోవడం ప్రతి కార్మికుడి బాధ్యత.

1960లో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, సిపిఐ సీనియర్‌ నేత కామ్రేడ్‌ టి.బి. విఠల్‌ రావు గారి ప్రోత్సాహంతో మాదిరెడ్డి భాస్కర్‌ రావు గోదావరిఖనికి వచ్చారు. అప్పటికే సింగరేణి బొగ్గు గనులు వేగంగా విస్తరిస్తున్నప్పటికీ కార్మికుల జీవన పరిస్థితులు దుర్భరంగా ఉండేవి. తక్కువ వేతనాలు, అసురక్షిత పని వాతావరణం, నివాస సమస్యలు, వైద్య సదుపాయాల కొరత కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితులను చూసిన భాస్కర్‌ రావు తన జీవితాన్ని కార్మికుల విముక్తి పోరాటానికి అంకితం చేశారు. ఎఐటియుసి పతాకం కింద కార్మికులను సంఘటితం చేసి ఉద్యమాలకు నాయకత్వం వహించారు. కొద్ది కాలంలోనే ఆయన సింగరేణి కార్మికుల్లో విశ్వసనీయ నాయకుడిగా ఎదిగారు.

సింగరేణిలో ఎఐటియుసిని బలోపేతం చేయడంలో మాదిరెడ్డి భాస్కర్‌ రావు పాత్ర అపారమైనది. కార్మిక సంఘం అంటే కేవలం వేతనాల కోసం పోరాడే వేదిక కాదని, అది కార్మికుల గౌరవం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే శక్తిగా ఆయన తీర్చిదిద్దారు. వేతన సవరణలు, బోనస్‌, గని కార్మికుల భద్రత, ప్రమాద బీమా, నివాస గృహాలు, తాగునీరు, విద్య, వైద్య సేవలు, పదవీ విరమణ ప్రయోజనాలు వంటి అనేక సమస్యలపై ఆయన రాజీలేని పోరాటం చేశారు. అవసరమైతే సమ్మెలు, ధర్నాలు, చర్చలు నిర్వహిస్తూ యాజమాన్యాన్ని పరిష్కారాల వైపు నడిపించారు.

మాదిరెడ్డి భాస్కర్‌ రావు నాయకత్వం సభలకే పరిమితం కాలేదు. గనుల కాలనీల్లో, కార్మికుల ఇళ్లలో, వారి కష్టసుఖాల్లో ఆయన ఎప్పుడూ ఉండేవారు. ప్రతి కార్మికుడి సమస్యను తన సమస్యగా భావించి పరిష్కరించేందుకు కృషి చేసేవారు. అందుకే కార్మికులు ఆయనను నాయకుడిగా మాత్రమే కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా భావించేవారు. పదవుల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆయన రాజకీయాలు చేయలేదు. నిరాడంబర జీవితం, నిజాయితీ, సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకలు.

భాస్కర్‌ రావు దృష్టిలో కార్మిక ఉద్యమం కేవలం ఆర్థిక డిమాండ్ల కోసం కాదు. సమాజంలో అసమానతలను తొలగించడం, దోపిడీని ఎదుర్కోవడం, ప్రజాస్వామ్య హక్కులను కాపాడడం, సామాజిక న్యాయం సాధించడం కూడా కార్మిక ఉద్యమం లక్ష్యాలేనని ఆయన విశ్వసించారు. రైతులు, వ్యవసాయ కూలీలు, పేద ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై కూడా ఆయన స్పందించారు. ప్రజా ఉద్యమాలకు కార్మిక ఉద్యమాన్ని అనుసంధానం చేస్తూ విస్తృత ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు కృషి చేశారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, కాంట్రాక్టు విధానం విస్తరణ, కార్మిక చట్టాల మార్పులు, ఉద్యోగ భద్రతపై పెరుగుతున్న అనిశ్చితి వంటి పరిస్థితుల్లో మాదిరెడ్డి భాస్కర్‌ రావు ఆలోచనలు మరింత ప్రాసంగికంగా మారాయి.

సంఘటిత కార్మిక ఉద్యమమే కార్మిక హక్కులను కాపాడగలదని ఆయన చెప్పిన మాటలు నేటి తరానికి మార్గదర్శకంగా ఉన్నాయి. ఐక్యత, క్రమశిక్షణ, ఉద్యమస్ఫూర్తి ఉంటేనే కార్మికులు తమ హక్కులను సాధించగలరని ఆయన జీవితం చెబుతోంది. నేటి యువ కార్మిక నాయకులు మాదిరెడ్డి భాస్కర్‌ రావు జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సిద్ధాంతాల కోసం త్యాగం చేయడం, ప్రజల కోసం నిరంతరం శ్రమించడం, అధికారానికి కాదు బాధ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం, వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమాజ ప్రయోజనాన్ని ముందుంచడం ఆయన జీవితంలోని గొప్ప పాఠాలు.

1991 జూన్‌ 30న కామ్రేడ్‌ మాదిరెడ్డి భాస్కర్‌ రావు భౌతికంగా దూరమైనా, ఆయన ఆలోచనలు, ఆశయాలు, పోరాటాలు నేటికీ సజీవంగా ఉన్నాయి. సింగరేణి గనుల్లో ప్రతి కార్మికుడి చెమటలో, ప్రతి కార్మిక ఉద్యమ నినాదంలో, ప్రతి హక్కుల పోరాటంలో ఆయన స్ఫూర్తి ప్రతిధ్వనిస్తోంది. ఆయనకు నిజమైన నివాళి పూలమాలలు వేయడం కాదు; కార్మికుల హక్కులను కాపాడుతూ, ఎఐటియుసి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడం.

– ఆళవందార్‌ వేణు మాధవ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *