Revanth Reddy: 2034 వరకు నేనే ముఖ్యమంత్రి.. మీ ప్రయోజనాలను కాపాడే బాధ్యత నాది.. ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి..
Revanth Reddy Review
Revanth Reddy: విద్యాశాఖలో ప్రభుత్వం సంస్కరణలు చేపట్టిన ప్రతిసారీ కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తనపై విమర్శలు చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే బాధ్యత పూర్తిగా తనదేనని ఆయన స్పష్టం చేశారు. ఇకపై ఉపాధ్యాయ సంఘాలు తమ స్వయంగా వ్యక్తిగత సమస్యల కోసం కాకుండా విద్యార్థుల భవిష్యత్తు, విద్యా వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఫిన్లాండ్, జర్మనీ దేశాల పర్యటన ముగించుకుని వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఎంసీఆర్హెచ్ఆర్డీ (MCRHRD)లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉపాధ్యాయ సంఘాల నాయకులను ఉద్దేశించి మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మీ సమస్యలను నాకు వదిలేయండి, అడగకముందే వాటిని పరిష్కరిస్తాను. ఇప్పటికే ప్రమోషన్లు, బదిలీలను మీ ఇంటి వద్దకే పంపాం. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, ఆ లోపు ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడే బాధ్యత నాది” అని వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం కేవలం 55 రోజుల్లోనే 11 వేల మంది ఉపాధ్యాయులను నియమించిందని గుర్తు చేశారు.
ప్రపంచ దేశాలకు తెలంగాణ విద్యారంగమే ఆదర్శం కావాలి:
రాబోయే ఐదేళ్లలో తెలంగాణ విద్యాశాఖను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకునే స్థాయికి తీసుకెళ్లాలని సీఎం ఆకాంక్షించారు. పంచవర్ష ప్రణాళిక తరహాలో ఉపాధ్యాయ సంఘాలు ఒక ప్రతిజ్ఞలా పని చేయాలని, అప్పుడే విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పేర్కొన్నారు. దేశానికే విద్య, వైద్య రంగాల్లో తెలంగాణ నాయకత్వం వహించాలని కోరారు.
ఆరు నెలలకోసారి భేటీ – ఒకటో తేదీనే జీతాలు:
ఉపాధ్యాయ సంఘాల నాయకులతో నేరుగా చర్చించేందుకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. గతంలో ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు పడేవికావని, కానీ తమ పాలనలో అడగకుండానే ప్రతి నెల 1వ తారీఖున ఉద్యోగులతో పాటు ఔట్సోర్సింగ్ సిబ్బందికి కూడా వేతనాలు జమ చేస్తున్నామని వెల్లడించారు.