Hyderabad Weather Update: హైదరాబాద్‌లో రాబోయే 5 రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే.. IMD హెచ్చరికలు..
Hyderabad Weather Update: హైదరాబాద్‌లో రాబోయే 5 రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే.. IMD హెచ్చరికలు..
హైదరాబాద్ నగరం దాని పరిసర ప్రాంతాల ప్రజలకు భారత వాతావరణ శాఖ, IMD బేగంపేట వాతావరణ కేంద్రం, రాబోయే 5 రోజుల (జూలై 23 నుండి జూలై 27 వరకు) వాతావరణ అంచనా వివరాలను వివరించింది. ఐఎమ్‌డీ విడుదల చేసిన జోన్ల వారీ నివేదిక ప్రకారం, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పెద్దగా వర్షాల ముప్పు ఏమీ లేదని, తీవ్రమైన ఇంపాక్ట్ లేదా ప్రమాద హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. ఈరోజు (జూలై 24) సహా జూలై 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని జోన్లలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే, నగరం అంతటా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉప్పల్, ఎల్బీ నగర్, ఖైరతాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్, చార్మినార్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్, మల్కాజిగిరి, శంషాబాద్ మరియు కుత్బుల్లాపూర్ వంటి అన్ని ప్రధాన జోన్లలో ఈ గాలుల ప్రభావం ఉంటుందని నివేదికలో స్పష్టం చేశారు. ప్రస్తుత అంచనాల ప్రకారం భాగ్యనగరంలో ఎలాంటి ఆటంకాలు లేదా తీవ్ర ప్రభావం ఉండే అవకాశం లేదని, ప్రజలు సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని అధికారులు తెలిపారు. భారీ వర్షాల ముప్పు లేనప్పటికీ, బలమైన ఈదురుగాలులు వీచే క్రమంలో ప్రయాణికులు మరియు వాహనదారులు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించారు.