Hyderabad: గచ్చిబౌలిలో కుప్పకూలిన 7 అంతస్తుల భవనం.. బిల్డర్ పరార్.. ఇద్దరు కార్మికులు మృతి..
Hyderabad: Seven-Storey Building Collapses in Gachibowli, Two Workers Killed
Hyderabad: జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా ఈ భవనాన్ని నిర్మించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, తక్కువ సమయంలోనే 7 అంతస్తులు నిర్మించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Hyderabad: నగరంలోని ఐటీ కారిడార్ గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్‌లో తీవ్ర ఘోరం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు టైల్స్ కార్మికులు ఉమేష్ కారే (34), మోపత్ (42) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ బ్రిగేడ్, ఎస్డీఆర్ఎఫ్ (SDRF) మరియు జీహెచ్ఎంసీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. ఇంకా ఎవరైనా శిథిలాల కింద చిక్కుకున్నారేమోనన్న అనుమానంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
నాలా పక్కనే కేవలం 50 గజాల చిన్న స్థలంలో ఈ భవనాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తి చేసుకొని అద్దెకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం, మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఒక్కసారిగా పక్కకు వాలిపోయి కుప్పకూలింది. కూలిన భవనం శిథిలాలు పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్‌పై పడటంతో ఆ భవనం పాక్షికంగా దెబ్బతింది. ఆ అపార్ట్మెంట్లో ఉన్న ఇద్దరు వృద్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. గోడలు ధ్వంసం కావడంతో భయంతో నివాసితులు బయటకు పరుగులు తీశారు. పక్కనే ఉన్న ఓ హాస్టల్ భవనంలో ఉండే విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణాలు గుప్పెట పట్టుకుని బయటకు వచ్చారు. సాయంత్రం వేళల్లో ఈ ప్రమాదం జరిగి ఉంటే ప్రాణనష్టం ఊహించని రీతిలో ఉండేదని స్థానికులు చెబుతున్నారు.

అనుమతులు లేకుండా నిర్మాణం.. బిల్డర్ పరార్:
జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా ఈ భవనాన్ని నిర్మించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, తక్కువ సమయంలోనే 7 అంతస్తులు నిర్మించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే భవన యజమాని/బిల్డర్ సాజిద్ పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
సంఘటనా స్థలాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, హైడ్రా (HYDRA) కమిషనర్ రంగనాథ్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.