Skip to content
తెలంగాణ వార్తలు

Bhadrachalam Flood Alert: భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. పెరుగుతున్న నీటిమట్టం, కలెక్టర్ అంకిత్ కీలక ఆదేశాలు..

Prajapaksham 30 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Bhadrachalam Flood Alert: భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. పెరుగుతున్న నీటిమట్టం, కలెక్టర్ అంకిత్ కీలక ఆదేశాలు..

Bhadrachalam Flood Alert:

Bhadrachalam Flood Alert: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా పడుతున్న వానల ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నీటిమట్టం వేగంగా పెరుగుతూ ఇప్పటికే 28 అడుగులకు చేరుకుంది. ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్‌, పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి ఉపనది అయిన తాల్పేరు ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తాల్పేరు ప్రాజెక్టుకు చింతవాగు, రీతెంతవాగు, పగిడివాగుల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు హెడ్ వర్క్స్ సమీపంలోని గేట్లను దాదాపు 3 అడుగుల మేర పైకి ఎత్తి వేలాది క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. తాల్పేరు నుంచి వస్తున్న వరద తోడవడంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. నది ఉధృతి కారణంగా భద్రాచలంలోని ప్రముఖ స్నానఘట్టాల వద్ద మెట్ల వరకు వరద నీరు చేరుకోగా.. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల వద్ద సీతావాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.

ఎగువన కాళేశ్వరం, పేరూరు, తాల్పేరు ప్రాజెక్టుల నుంచి నిరంతరం ప్రవాహం వస్తుండటంతో ఈరోజు రాత్రి సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 32 అడుగులకు పెరిగే అవకాశం ఉన్నట్లు కేంద్ర జలసంఘం (CWC), నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న 36 గంటల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నది నీటిమట్టం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

గోదావరి వరద ఉధృతిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులతో అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది, అధికారులు తమ తమ ప్రధాన కార్యాలయాల్లోనే అందుబాటులో ఉండాలని, ముందస్తు అనుమతి లేకుండా సెలవుల్లో వెళ్లకూడదని ఆదేశించారు.

ముఖ్యంగా గోదావరి దిగువన ఉన్న గ్రామాల ప్రజలను, ఏజెన్సీ ప్రాంత నివాసులను తక్షణమే అప్రమత్తం చేయాలని సూచించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని, గోదావరి నది సమీపానికి గానీ, స్నానఘట్టాల వద్దకు గానీ ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు మరియు రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.