రైల్లో మంటల పుకారు.. భయంతో బయటకు దూకిన నలుగురు ప్రయాణికులు.. వేగంగా వస్తున్న మరో రైలు కిందపడి మృతి..
Four Jump Off Train After Fire Rumour, Killed by Another Train in MP's Morena (Photo-AI Generated Image)
మధ్యప్రదేశ్‌లో కేవలం ఒక చిన్న పుకారు నలుగురి ప్రాణాలను బలిగొంది. ఖజరహో-ఉదయ్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం మధ్యాహ్నం ప్రయాణిస్తున్న సమయంలో, ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ పేలి రైలుకు మంటలు అంటుకున్నాయనే పుకారు వేగంగా వ్యాపించింది. దీంతో రైలు తగలబడిపోతుందేమో అన్న భయంతో ప్రయాణికులు తీవ్రంగా భయపడిపోయారు. ఈ క్రమంలోనే ఒక ప్రయాణికుడు అలారం చైన్ లాగడంతో, మురైనా జిల్లాలోని హేతంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నిలిచిపోయింది.
భయాందోళనలతో ఉన్న ప్రయాణికులు రైలు ఆగగానే ఏమాత్రం ఆలోచించకుండా ప్రాణాలు కాపాడుకోవాలనే ఆత్రుతతో బయటకు దూకి పక్కనే ఉన్న ట్రాక్‌పైకి పరుగులు తీశారు. అయితే దురదృష్టవశాత్తూ అదే సమయంలో పక్క ట్రాక్‌పై ఆగ్రా వైపు నుంచి ఫిరోజ్‌పూర్-సీవని పాతాళ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకొచ్చింది. ఎదురుగా వస్తున్న రైలును గమనించే లోపే అది ప్రయాణికులను బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఆఫ్రీన్ అనే మహిళ, ఆమె నాలుగేళ్ల కుమారుడు అసద్ ఖాన్ తో పాటు శకుంతల, వీర్మాదేవి అనే వృద్ధురాళ్లు అక్కడికక్కడే మరణించారు.
విషయం తెలిసిన వెంటనే రైల్వే భద్రతా దళాలు (RPF), పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. ఈ హృదయవిదారక ఘటనపై రైల్వే శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అసలు ఆ మొబైల్ పేలుడు పుకారు ఎలా పుట్టింది, చైన్ లాగింది ఎవరు అనే విషయాలపై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. కేవలం ఒక అపోహ నలుగురి నిండు ప్రాణాలను బలి తీసుకోవడం అందరినీ కలిచివేస్తోంది.