ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాలపై ఎల్ నినో తీవ్ర ప్రభావం..హెచ్చరించిన కేంద్ర వ్యవసాయ శాఖ
El Niño Threat Looms Over India’s Farm Sector Ahead of 2026
భారతదేశంలో బలహీనమైన రుతుపవనాలకు కారణమయ్యే ఎల్ నినో ప్రభావం ఈ ఖరీఫ్ సీజన్‌లో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని 12 రాష్ట్రాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ హెచ్చరించింది. వీటితో పాటు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, రాజస్తాన్, బిహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్రలపైనా దీని ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది. ఈ ముప్పు తీవ్రతను తగ్గించడానికి అన్ని విభాగాలు సమన్వయంతో కూడిన ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్రం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
ఖరీఫ్–2026 సాగు ఏర్పాట్లపై అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడారు. ఎల్ నినో ప్రభావం సాపేక్షంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రాలు (KVK) మరియు ఇతర ప్రభుత్వ విభాగాలతో తక్షణమే సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఆయన సూచించారు. వర్షపాతం తక్కువగా నమోదయ్యే జిల్లాలను ముందుగానే గుర్తించి, అక్కడ అత్యవసర ప్రణాళికలను అమలు చేయాలన్నారు.
ఈ ఏడాది వర్షపాత లోటును తట్టుకునేలా, తక్కువ నీటితో పండే పత్తి మరియు పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. ఈ ఎల్ నినో ముప్పును ఎదుర్కొనేందుకు గాను ప్రభావిత 12 రాష్ట్రాల్లోని మొత్తం 326 జిల్లాలకు సంబంధించి ప్రత్యేక ముందస్తు అత్యవసర ప్రణాళికలను (Contingency Plans) సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి.