Skip to content
జాతీయం › వార్తలు

Vande Mataram: రెండు గీతాలు.. జాతీయవాదం… ఒక పరిశీలన

Prajapaksham 04 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Vande Mataram: రెండు గీతాలు.. జాతీయవాదం… ఒక పరిశీలన

Vande Mataram Bill

Vande Mataram: వందేమాతరం, వైష్ణవ జనతో గీతాల వెనుక ఉన్న జాతీయవాద భావనలు, గాంధీజీ ఆలోచనలు, రాజ్యాంగ విలువలపై ప్రత్యేక విశ్లేషణ. ఏ భారతీయుడైనా తన దేశం గురించి ఈ చరణాలను పాడగలరు.

రచయిత: సంజయ్ హెగ్డే, సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్

Vande Mataram: గాంధీజీ పుట్టినరోజున ఆయనకు పూలమాల వేయడం ఆనవాయితీ అయినప్పటికీ, ఈ సంవత్సరం మనం ఆయన మాటలను, ఆయన జీవించిన గీతాన్ని విందాం. గణతంత్ర రాజ్యం మరో గీతం గురించి చట్టం చేసి 10 నెలలు గడిపిన తరుణంలో, జాతీయవాదం అంటే ఏమిటి, ఏదీ జాతీయవాదం కాదు అనే వైరుధ్యం ఒక పాఠంగా నిలుస్తుంది.

గణతంత్ర రాజ్యం చట్టం చేసిన గీతం వందేమాతరం. జనవరి 2026లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, అధికారిక కార్యక్రమాలలో జాతీయ గీతంలోని ఆరు చరణాలన్నింటినీ అందరూ సావధానంగా (అటెన్షన్‌) నిలబడి ఆలపించాలని ఆదేశించింది. జులైలో రెండవ ఉత్తర్వు ఆరు చరణాల పూర్తి పాఠాన్ని ‘అధికారిక గీతం’గా ప్రకటించి, ఆ గీతాన్ని జాతీయ గేయం కంటే ముందు ఉంచింది.

‘జాతీయ గౌరవానికి అవమానాల నివారణ చట్టం’ పార్లమెంటు సవరించి, జాతీయ గీతాన్ని మొదటిసారిగా క్రిమినల్‌ చట్ట పరిధిలోకి తీసుకువచ్చింది. ఉద్దేశపూర్వకంగా దానిని ఆలాపించకుండా అడ్డుకున్నా, లేదా దానిని ఆలపిస్తున్న సభకు అంతరాయం కలిగించినా తాజాగా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.

సుప్రీంకోర్టు కర్ణాటక సంగీత విద్వాంసుడు, రచయిత టి.ఎం. కృష్ణ ఈ చట్టాన్ని, ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సెప్టెంబర్‌ 22న సుప్రీంకోర్టు చేపట్టింది. అయితే, కోర్టు వెంటనే ఆ కేసును తేల్చలేదు. సమాధానం చెప్పమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

అయితే, గీతానికి రెండు చరణాలు ఉండాలా లేక ఆరు ఉండాలా అని ప్రభుత్వం నిర్ణయించవచ్చు కానీ, బిజో ఇమ్మాన్యుయేల్‌ (మత స్వేచ్ఛ, రాజ్యాంగ సహనం, నిశ్శబ్ద అభ్యంతరం వంటి హక్కులను సమర్థించే సుప్రీంకోర్టు తీర్పు) తీర్పు ఇప్పటికీ వర్తిస్తుందని జస్టిస్‌ జయమాల్య బాగ్చి అన్నారు.

ఒక చరణానికి గానీ, అన్ని చరణాలకు గానీ మనస్సాక్షి ప్రకారం అభ్యంతరం తెలిపే వ్యక్తి, ఆ కార్యక్రమం సందర్భంలో గౌరవంగా నిలబడి, పాడకుండా ఉన్నా, వారు ఎలాంటి క్రిమినల్‌ పరిణామాలను ఎదుర్కోరు అని జస్టిస్‌ బాగ్చి అభిప్రాయపడ్డారు. అయితే ఆయన అభిప్రాయం ఇంకా తీర్పుగా వెలువడలేదు కానీ అది వెలువడాలని ఆశిస్తున్నాము.

అదే రోజు ఉదయం జాతీయ ఏకాభిప్రాయం కోసం చేసిన విజ్ఞప్తికి సొలిసిటర్‌ జనరల్‌ సమాధానమిస్తూ నక్సలైట్‌ భావాలను చట్టం తయారీ ప్రక్రియ అనుసరించదన్నారు. మరో విషయం నిమిత్తం కోర్టుకు హాజరైన ఈ రచయిత, ఆలోచించడం అంటే నక్సలైట్‌ కావడం కాదని చెప్పారు.

ఇక్కడ చర్చించిన రెండు జాతీయవాదాలను ఇది క్రోడీకరిస్తుంది కాబట్టే ఈ సంఘటనకు ప్రాముఖ్యత ఉంది. ఒకటి వాదనకు సమాధానమిస్తుంది, మరొకటి వాదించే వ్యక్తికి కొత్త పేరు పెడుతుంది.

వందేమాతరం

ఈ గీతంలోని ఆరు చరణాలను మనం నిశితంగా పరిశీలిద్దాం. బంకిమ్‌ చంద్ర చటర్జీ మొదటి రెండు చరణాలను సుమారు 1875 ప్రాంతంలో, తన పత్రికలో ఖాళీని పూరించడానికి రాశారని చెబుతారు. అవి పుష్కలంగా నీరు, సమృద్ధితో, దక్షిణపు గాలులతో చల్లగా ఉండే ఒక భౌగోళిక ప్రదేశం ప్రకృతి సౌందర్యాన్ని కీర్తిస్తాయి. ఏ మతానికి చెందిన ఏ భారతీయుడైనా తన దేశం గురించి ఈ చరణాలను పాడగలరు.

తరువాత చరణాలు ఆయన రాసిన ‘ఆనందమఠ్‌’ నవలతో పాటు వచ్చాయి. అవి కొన్ని పేర్లను ప్రస్తావిస్తాయి. మాతృభూమి తన పది ఆయుధాలతో దుర్గగా, లక్ష్మిగా, సరస్వతిగా మారుతుంది. ఇది రెండు పాటలను కలిపి కుట్టినట్లు ఉంటుంది. 1905లో బెంగాల్‌ విభజన ‘స్వదేశీ’ అనే రణ నినాదాన్ని ప్రారంభించినప్పటి నుండి ఈ విభజన మన రాజకీయాల్లో కొనసాగుతూనే ఉంది.

స్వాతంత్య్ర ఉద్యమం ఈ సమస్యను నిక్కచ్చిగా పరిష్కరించింది. 1937 అక్టోబర్‌లో రాజేంద్ర ప్రసాద్‌ ప్రవేశపెట్టి, వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ బలపరిచిన ఒక తీర్మానంపై, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తరువాత చరణాలపై ముస్లింలు, ఇతరుల అభ్యంతరాల ప్రామాణికతను అంగీకరించి, జాతీయ సభల కోసం మొదటి రెండు చరణాలను మాత్రమే స్వీకరించింది.

ఈ గీతానికి మొదట సంగీతం సమకూర్చిన రవీంద్రనాథ్‌ ఠాగోర్‌, ఈ మార్పును ఆశీర్వదించారు. ఆయన ప్రారంభ చరణాలను ప్రేమించి, ఆ తర్వాత వచ్చే మత సిద్ధాంతాన్ని తిరస్కరించారు.

భారతదేశపు మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌ 1950 జనవరి 24న జనగణమన జాతీయ గేయంగా ఉంటుందని, వందేమాతరం కూడా ‘సమానంగా గౌరవించబడుతుందని’ ప్రకటించారు. గౌరవం అనేది ఒక బాధ్యత కాదు. 55 సంవత్సరాల పాటు చట్టం జాతీయ జెండాను, రాజ్యాంగాన్ని, జాతీయ గీతాన్ని రక్షించి, ఉద్దేశపూర్వకంగా గీతాన్ని శిక్షా వలయం వెలుపల ఉంచింది. గీతంపై ప్రేమను ఆహ్వానించారు కానీ విధేయతను ఎన్నడూ కోరలేదు.

అంతేకాకుండా, రెండు చరణాలతో కూడిన ఈ పరిష్కారం బంకింకు ఏమాత్రం అవమానం కాదు. లక్ష శ్లోకాలున్న మహాభారతంలో ఏడు వందల శ్లోకాలే భగవద్గీత. ఠాగోర్‌ రచించిన ఐదు చరణాలలో మొదటిది మన జాతీయ గీతం. ఒక రచనను ప్రజా ప్రయోజనానికి అనుగుణంగా మలచడం అనేది గౌరవించడమే కానీ అవమానించడం కాదు.

ఈ పరిష్కారం ఫలించింది. హిందువుగా జన్మించి ఇస్లాంను స్వీకరించిన ఎ.ఆర్‌. రెహమాన్‌ 1997లో ‘వందేమాతరం’ గీతాన్ని ‘మా తుఝే సలామ్‌’గా కొత్తగా ఆవిష్కరించారు. 40 ఏళ్ల లోపు వయసున్న ఎవరినైనా ‘వందేమాతరం’ పాడమని అడిగితే, మీరు రెహమాన్‌ శైలిలోనే దాన్ని వింటారు.

1937, 1950, 1997 నాటి ఆ పరిష్కారాలనే ప్రస్తుత ఉత్తర్వులు, చట్టాలు తిరిగి తెరపైకి తెచ్చాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు వాటిని సముచితంగానే తిరిగి దేశానికి, మనకు అప్పగించింది.

మరో గీతం

బంకిమ్‌కు ఐదు శతాబ్దాల ముందు, జునాగఢ్‌కు చెందిన నరసింహ మెహతా ‘అంటరానివారి’ మధ్య పాటలు పాడినందుకు తన సొంత కులం చేతనే బహిష్కరించబడ్డాడు.

ఆయన ‘వైష్ణవ జన తో తేనే కహియే, జే పీడ్‌ పరై జానే రే’ (ఎవడైతే ఇతరుల బాధను తనదిగా భావిస్తాడో, అతన్నే దైవపురుషుడు అని పిలవాలి) అనే గీతాన్ని రచించాడు.

ఆ గీతానికి ఎల్లలు లేవు, శత్రువు లేడు, సింహాసనం లేదు. అది ఒక మనిషిని సమీక్షిస్తుంది. ఆ మనిషి గర్వం లేకుండా సేవ చేసేవాడు, అందరికీ తలవంచి ఎవరినీ కించపరచనివాడు, మాట, చేత, ఆలోచన అనేవాటిని ఒకే దారిలో ఉంచేవాడు, అందరినీ సమాన దృష్టితో చూసేవాడు, అబద్ధం చెప్పనివాడు, తనది కాని సంపదను ముట్టుకోనివాడు, ప్రతి మహిళను గౌరవించేవాడు, మోసం, కామం, కోపం వంటివాటిని విడిచిపెట్టినవాడు.

దీనిని రాజ్యాంగం ఎదురుగా చదివితే, నరసింహ మెహతా రాజ్యాంగ పీఠిక రూపాన్ని ముందుగానే రచించి, దానికి సంగీతం సమకూర్చాడని మీకు అర్థమవుతుంది.

ఇతరుల బాధను అనుభూతి చెందడమే వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టే సౌభ్రాతృత్వం. అందరికీ తలవంచడమే 14వ అధికరణ. అందరినీ సమానంగా చూడటమే మన లౌకికవాదం, ఇతరుల సంపదను తిరస్కరించే హస్తమే సత్యసంధత సూత్రం. అబద్ధం చెప్పని నాలుకే 51ఎ అధికరణలోని విజ్ఞానవంతుడైన పౌరుడు.

గాంధీ గారు ఖురాన్‌, క్రైస్తవ కీర్తనలతో పాటు దీనిని సబర్మతి నుంచి తన చివరి ప్రార్థనా సభ వరకు తీసుకువెళ్లారు. వంద సంవత్సరాలలో దీని కారణంగా ఎవరూ తాము మినహాయించబడినట్లు భావించలేదు.

వందేమాతరం మీ నిలకడను పరీక్షిస్తుంది; వైష్ణవ జనతో మీ ప్రవర్తనను పరీక్షిస్తుంది. అయితే, ఇక్కడ రెండు గీతాలు, రెండు జాతీయవాదాలు ఉన్నాయి. ఒకటి మట్టిని పూజిస్తూ పౌరుడిని దానికి తలవంచమని కోరుతుంది. మరొకటి ఆత్మను నాగరికంగా తీర్చిదిద్దుతూ పౌరులను యోగ్యులుగా ఉండమని కోరుతుంది. ఒకటి ఇప్పుడు ఒక సబ్‌-ఇన్‌స్పెక్టర్‌తో వస్తుంది. మరొకదానికి ఎన్నడూ అతని అవసరం రాలేదు.

ఒక వినయపూర్వకమైన ప్రతిపాదన

కాబట్టి, గాంధీ జయంతి సందర్భంగా ఇదొక ప్రతిపాదన. మనకు చట్టబద్ధ రక్షణ కలిగిన జాతీయ గీతం, వాడుకలో గౌరవించబడే జాతీయ గేయం ఉన్నాయి. 2026 నాటి బలప్రయోగ పద్ధతిలో కాకుండా, 1950లో అనుసరించిన సౌమ్యమైన పద్ధతి ద్వారా వైష్ణవ జనతోను మన జాతీయ ప్రార్థనగా గణతంత్ర రాజ్యం గుర్తించాలి.

ఎటువంటి ఉత్తర్వులు, జరిమానాలు, నిర్బంధ హోదా ఉండకూడదు. కేవలం గుర్తింపు మాత్రమే, తప్పనిసరి నిబంధన ఏదీ ఉండకూడదు. జాతీయ గేయం పాడే చోట, కోరుకున్నవారు దీనిని కూడా పాడనీయండి.

పాఠశాల విద్యార్థులు ప్రతి భాషలోనూ దీని అర్థాన్ని నేర్చుకోవాలి. బలవంతంగా చేయించిన ప్రార్థన అసలు ప్రార్థనే కాదు. అసలు విషయం అదే.

బంకిమ్‌ తన మూడవ చరణంలో ‘సప్త కోటి కంఠ’ అని లెక్కించారు. అంటే, అవిభక్త బెంగాల్‌ అయిన తన మాతృభూమిలోని ఏడు కోట్ల గొంతులు అని. 1905లో సరళా దేవి దానిని ముప్పై కోట్లుగా పాడారు, అప్పుడు ఆ మాతృభూమి భారతదేశంగా మారింది. నేడు మనం 140 కోట్ల మందిమి, ప్రతి కోటి కూడా చేర్పు ద్వారానే ఏర్పడింది; ఏదీ బలవంతంగా కాదు.

140 కోట్లమందితో కూడిన గాయక బృందాన్ని లాఠీతో నడిపించలేరు. అంతటి పెద్ద కచ్చేరిలో, ఆ పాట తమదేనన్న భావనను ప్రతి ఒక్కరిలోనూ కలిగించడం ద్వారా గాయకుల సంసిద్ధతను గెలుచుకోవడమే నిర్వాహకుడి (కండక్టర్‌) చేతిలో ఉన్న ఏకైక వాయిద్యం.

అందరినీ కలుపుకోవడం అనేది అతి జాగ్రత్తపడేవారికి ఇచ్చే రాయితీ కాదు. అది మెరుగైన బాణీ. మనమందరం ఒకే విధంగా పూజలు చేయాలని రాజ్యాంగం కోరదు. మనం 140 కోట్ల మందిమి సమాన పౌరులుగా ఉండాలని అది కోరుతుంది.

ప్రతి ఒక్కరూ మన పాటనే పాడాలని పట్టుబట్టకుండా, ప్రతి ఒక్కరూ పౌరసత్వంలో వైష్ణవ జనుడిగా మారాలని ప్రార్థించడం మనకు మేలు. సావధానంగా (అటెన్షన్‌) నిలబడేందుకు 90 సెకన్లు పడుతుంది. ఇతరుల బాధను అనుభవించడానికి జీవితకాలం పడుతుంది. దేశాన్ని నిర్మించేది అదేగాని సావధానంగా నిలబడటం కాదు.

(ది హిందూ సౌజన్యంతో 2.10.26)

ట్యాగ్‌లు: Vande Mataram