Skip to content
జాతీయం వార్తలు

Sonam Wangchuk: ‘ఇది ప్రజాస్వామ్య విజయం’: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సోనమ్ వాంగ్‌చుక్ స్పందన

Prajapaksham 25 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Sonam Wangchuk: ‘ఇది ప్రజాస్వామ్య విజయం’: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సోనమ్ వాంగ్‌చుక్ స్పందన

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ స్పందించారు. ఈ పరిణామం ప్రజాస్వామ్యానికి పెద్ద విజయంగా అభివర్ణించారు. తన ‘ఎక్స్’ సోషల్ మీడియా వేదికలో చేసిన పోస్టులో, ఈ నిర్ణయం శాంతియుత ప్రజా ఉద్యమానికి, అలాగే దేశ యువత చూపిన సహనం, పట్టుదలకు దక్కిన ఫలితమని ఆయన పేర్కొన్నారు. వాంగ్‌చుక్ ఇలా రాశారు.. “ఇది ప్రజాస్వామ్య విజయం. ఇది వీధుల నుంచే వచ్చిన ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం. ఇది శాంతి, సహనం, నిరంతర పోరాటానికి లభించిన విజయమూ.” ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకే అత్యంత ముఖ్యమని, వారు తమ అభిప్రాయాలను శాంతియుతంగా వ్యక్తం చేసినప్పుడు దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న సీజేపీ (బొద్దింక జనతా పార్టీ) కార్యకర్తలు, జెన్-జెడ్ విద్యార్థులను అభినందించిన వాంగ్‌చుక్.. తమ హక్కుల కోసం, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని వారు చేసిన పోరాటాన్ని ప్రశంసించారు. ఈ ఉద్యమానికి ధైర్యంగా మద్దతు తెలిపి, తమ గొంతును వినిపించిన దేశవ్యాప్తంగా ఉన్న పౌరులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

“ఇప్పుడు జవాబుదారీతనం నుంచి సంస్కరణల వైపు వెళ్లాల్సిన సమయం వచ్చింది” అని పేర్కొంటూ ఆయన తన సందేశాన్ని ముగించారు. మంత్రి రాజీనామా చేయడం కేవలం మొదటి అడుగు మాత్రమేనని, పరీక్షల వ్యవస్థలో పారదర్శకత పెరగాలంటే, ప్రశ్నపత్రాల లీకేజీని అడ్డుకోవాలంటే, విద్యార్థుల్లో మళ్లీ నమ్మకం పెంచాలంటే ప్రభుత్వం పటిష్టమైన సంస్కరణలు తీసుకురావాలని ఆయన అన్నారు.

నీట్-యూజీ వివాదం, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ పరిస్థితుల్లో వాంగ్‌చుక్ చేసిన వ్యాఖ్యలు ఉద్యమానికి మద్దతు ఇస్తున్న వారికి మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎందుకంటే, వారు మొదటి నుంచే విద్యా వ్యవస్థలో జవాబుదారీతనంతో పాటు సమగ్ర సంస్కరణలు కూడా తీసుకురావాలని నిరంతరం డిమాండ్ చేస్తున్నారు.