Parliament March: సీజేపీ పార్లమెంట్ మార్చ్‌కు ముందు కీలక పరిణామం.. నిరసనలు ప్రారంభమైన తర్వాత తొలిసారి స్పందించిన కేంద్రం..ఏమన్నదంటే..
Parliament March: సీజేపీ పార్లమెంట్ మార్చ్‌కు ముందు కీలక పరిణామం.. నిరసనలు ప్రారంభమైన తర్వాత తొలిసారి స్పందించిన కేంద్రం..ఏమన్నదంటే..
Parliament March: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత నెల రోజులుగా సాగుతున్న బొద్దింక జనతా పార్టీ- సీజేపీ నిరసన ప్రదర్శనలు సోమవారం తీవ్రరూపం దాల్చాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. పేపర్ లీక్‌లపై ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేస్తూ సీజేపీ నేడు పార్లమెంట్ వైపు పాదయాత్రకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు నిరసనకు అనుమతి నిరాకరించినప్పటికీ, వందలాది మంది సీజేపీ మద్దతుదారులు రాజధానిలో గుమిగూడారు.
సీజేపీ పార్లమెంట్ మార్చ్‌ను అడ్డుకునేందుకు న్యూఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ పరిధిలోని పలు ప్రాంతాలను పోలీసులు అత్యంత భద్రతా వలయాలుగా మార్చారు. బహుళ అంచెల బారికేడ్లు, పటిష్టమైన నిఘా, విధ్వంస నిరోధక తనిఖీలతో పోలీసులు గస్తీ కాస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రాంతంలోని కనీసం ఐదు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఈ నిరసనను చట్టవిరుద్ధంగా పేర్కొన్న పోలీసులు.. నిరసనకారులు పార్లమెంటు వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పార్లమెంట్ మార్చ్‌కు ముందు కేంద్రం-సీజేపీ మధ్య చర్చలకు సంకేతాలు
జంతర్ మంతర్ వద్ద ధర్నా ప్రారంభమైన నెల రోజుల తర్వాత ప్రభుత్వం మొదటిసారిగా తమను సంప్రదించిందని సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ధృవీకరించారు. అయితే ప్రభుత్వం చాలా ఆలస్యంగా స్పందించిందని.. తాము మనసు విప్పి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ వారి వైపు నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని ఆయన వెల్లడించారు.ఇప్పుడు బంతి ప్రభుత్వ కోర్టులోనే ఉందని దాస్ స్పష్టం చేస్తూ, తమ ప్రదర్శన పూర్తిగా శాంతియుతంగానే సాగుతుందని పేర్కొన్నారు.
విద్యా వ్యవస్థలో వైఫల్యాలకు నిరసనగా జూన్ 20న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఈ ధర్నాను ప్రారంభించగా, జూన్ 28న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అయితే, శనివారం (జూలై 18) వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి వాంగ్‌చుక్ పంపిన చేతివ్రాత లేఖలో.. పేపర్ లీక్‌లపై ప్రభుత్వం జవాబుదారీగా ఉంటే లేదా సీజేపీ నిరసనకారుల సమస్యలను పార్లమెంట్‌లో చర్చిస్తామని చట్టసభ సభ్యులు హామీ ఇస్తే తాను దీక్ష విరమిస్తానని ప్రకటించారు. కాగా, వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలించిన తర్వాత సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కూడా నిరవధిక నిరాహార దీక్షకు దిగడంతో నిరసన మరింత ఉధృతమైంది. ఆన్‌లైన్‌లో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా 22 మిలియన్ల మంది ఫాలోవర్ల మద్దతుతో ప్రారంభమైన ఈ యువ నిరసన ఉద్యమానికి ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడా లభిస్తోంది.