Skip to content
జాతీయం వార్తలు

ఎన్నికల్లో పోటీ చేయం.. విద్యార్థుల హక్కుల కోసం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదన్న సీజేపీ

Prajapaksham 17 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ఎన్నికల్లో పోటీ చేయం.. విద్యార్థుల హక్కుల కోసం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదన్న సీజేపీ

Are ‘Cockroaches’ Revolutionaries? Remark Sparks Political Debate

దేశ ఎన్నికల్లో పోటీ చేయడం తమ ఉద్దేశం కాదని, ప్రజల హక్కుల కోసం పోరాడటమే తమ లక్ష్యమని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. నీట్-యూజీ (NEET-UG) పరీక్షల వివాదం, విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నాగ్‌పూర్‌లో సీజేపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై అభిజీత్ దీప్కే స్పందిస్తూ, దేశంలో ప్రతి ఒక్కరూ తమ హక్కులను డిమాండ్ చేయడం కోసం ఎన్నికల్లోనే పోటీ చేయాల్సి వస్తే అది సాధ్యమయ్యే పని కాదని పేర్కొన్నారు. నీట్-యూజీ పరీక్ష గందరగోళం కారణంగా తీవ్ర మనోవేదనకు గురై బలవన్మరణాలకు పాల్పడిన ఐదు, ఆరుగురు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధాని మోదీ మొదట క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా సామాజిక మాధ్యమాల్లో ట్వీట్ల ద్వారా స్పందించే ప్రధానమంత్రి, దేశంలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే కనీసం ఒక సంతాప సందేశం కూడా ప్రకటించకపోవడం దారుణమన్నారు.

ప్రధాని మోదీ కేవలం తన ‘మన్ కీ బాత్’, ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమాలతో సరిపెట్టుకోకుండా, దేశంలోని విద్యార్థుల ‘మన్ కీ బాత్’ (మనసులోని మాట) ఏంటో తెలుసుకోవాలని దీప్కే హితవు పలికారు. ప్రధానమంత్రి స్వయంగా విద్యార్థులతో మాట్లాడితేనే వారి సమస్యలు అర్థమవుతాయని, అప్పుడే సరైన పరిష్కారాలు కనుగొనడం సాధ్యమవుతుందని సూచించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసేంత వరకు కాక్రోచ్ జనతా పార్టీ తరఫున దేశవ్యాప్త ఆందోళనలు ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇటీవల తనపై జరిగిన దాడి వెనుక కొందరు ఆరెస్సెస్ (RSS) వ్యక్తుల హస్తం ఉందంటూ అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *