మూడో రోజుకు చేరిన సీజేపీ పోరాటం: జంతర్ మంతర్ వద్దే నిరసనకారుల బస.. రైతు సంఘాలు కదిలిరావాలని దీప్కే పిలుపు..
CJP Protest Over NEET Paper Leak Enters Third Day at Delhi’s Jantar Mantar
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET) పరీక్ష అవకతవకలు, మే 3న జరిగిన పేపర్ లీకేజీ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బొద్దింక జనతా పార్టీ (క్రాక్‌రోచ్ జనతా పార్టీ – సీజేపీ) చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. ఢిల్లీలోని చారిత్రక జంతర్ మంతర్ వద్ద ఈ నిరసన ప్రదర్శన వరుసగా మూడో రోజైన సోమవారం కూడా కొనసాగింది. శనివారం మధ్యాహ్నం భారీ ఎత్తున ప్రారంభమైన ఈ ఆందోళనలో.. పోలీసులు భారీగా మోహరించినప్పటికీ నిరసనకారులు ఎవరూ వెనక్కి తగ్గలేదు. శని, ఆదివారాల్లో రాత్రంతా నిరసనకారులు జంతర్ మంతర్ వద్దే రోడ్డుపై బస చేసి తమ పట్టుదలను చాటారు. ఈ సుదీర్ఘ పోరాటంలో పాల్గొంటున్న విద్యార్థులు, యువతకు పలువురు స్వచ్ఛంద సేవకులు (Volunteers) ముందుకు వచ్చి నిరంతరాయంగా ఆహారం, తాగునీరు పంపిణీ చేస్తూ అండగా నిలిచారు.
నిరసన వేదిక వద్ద ఆదివారం నాడు సరికొత్త ఉత్సాహం కనిపించింది. ఉదయం నుండి రాత్రి వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, విద్యావ్యవస్థ లోపాలపై వక్తల ప్రసంగాలు, వినూత్న సాంస్కృతిక ప్రదర్శనలతో ఆ ప్రాంతం హోరెత్తింది. సీజేపీ మద్దతుదారులు చప్పట్లు కొడుతూ, డఫ్లీలు వాయిస్తూ ఆవేశపూరిత దేశభక్తి గీతాలను ఆలపించారు. ఆదివారం సాయంత్రానికల్లా ఈ నిరసన ప్రదేశంలో దాదాపు 200 మందికి పైగా ఆందోళనకారులు గుమిగూడారని నిర్వాహక వర్గాలు వెల్లడించాయి.
ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే వ్యూహంలో భాగంగా, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆదివారం నాడు ఒక కీలక ప్రకటన చేశారు. ఈ న్యాయమైన పోరాటం ఇలాగే నిరంతరాయంగా కొనసాగుతుందని స్పష్టం చేస్తూ, దేశంలోని వివిధ రైతు సంఘాలు, అభ్యుదయ శక్తులు ,సాధారణ ప్రజలు కూడా ఈ ఆందోళనలో భాగస్వాములు కావాలని ఆయన బహిరంగ విజ్ఞప్తి చేశారు.
ఈ నిరసన సభలో అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న నీట్ వివాదంపై కేంద్ర ప్రభుత్వంలో జవాబుదారీతనం పూర్తిగా కొరవడిందని ఆరోపించారు. ఈ దేశవ్యాప్త విద్యా సంక్షోభానికి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. పేపర్ లీక్ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడిన అభాగ్యులైన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం భారీగా నష్టపరిహారం చెల్లించాలని, అలాగే అవకతవకలు జరిగిన ప్రస్తుత నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేసి, పారదర్శకంగా తిరిగి నిర్వహించాలని డిమాండ్ల పత్రాన్ని ఉంచారు.
ఇదిలా ఉండగా, జంతర్ మంతర్ నిరసన ప్రదేశంలో ప్రభుత్వం కల్పించాల్సిన ప్రాథమిక సౌకర్యాల విషయంలో నిరసనకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనను భగ్నం చేసే కుట్రలో భాగంగానే అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక బహిరంగ మరుగుదొడ్లకు నీటి సరఫరాను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని వారు ఆరోపించారు. అయితే నిరసనకారుల పట్టుదల ,ఒత్తిడి కారణంగా ఆ తర్వాత తాగునీటి సరఫరాను అధికారులు పునరుద్ధరించినట్లు వారు తెలిపారు.
ఈ పరీక్షల లీకేజీ ఆరోపణలపై జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిర్వహించిన రెండవ అతిపెద్ద నిరసన ఇది. ప్రస్తుతం నిరసన ప్రాంతం చుట్టూ పోలీసులు బలమైన బారికేడ్లను ఏర్పాటు చేసి అహోరాత్రులు నిఘా ఉంచినప్పటికీ, తమ ప్రధాన డిమాండ్లు నెరవేరే వరకు ఇక్కడి నుండి కదిలేదే లేదని సీజేపీ స్పష్టం చేసింది. రానున్న గంటల్లో ఈ ప్రదర్శనలోకి ప్రధాన రైతు సంఘాలు కూడా అధికారికంగా ప్రవేశించనుండటంతో దేశ రాజధానిలో రాజకీయ వేడి మరింత రాజుకుంది.