Skip to content
జాతీయం వార్తలు

CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ జేపీ నడ్డాతో సీజేపీ నేతల అత్యవసర భేటీ.. మూడు ప్రధాన డిమాండ్లతో లేఖ!

Prajapaksham 20 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ జేపీ నడ్డాతో సీజేపీ నేతల అత్యవసర భేటీ.. మూడు ప్రధాన డిమాండ్లతో లేఖ!

CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ జేపీ నడ్డాతో సీజేపీ నేతల అత్యవసర భేటీ.. మూడు ప్రధాన డిమాండ్లతో లేఖ!

CJP Protest: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ-సీజేపీ చేపట్టిన చలో సంసద్ మార్చ్ తీవ్ర హింసాత్మకంగా మారిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీజేపీ ప్రతినిధులు ఇద్దరు సోమవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ తన ‘X’ (ట్విట్టర్) ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించారు.

మరో సీజేపీ నేత అశుతోష్ రాంక్కాతో కలిసి తాను కేంద్ర మంత్రి జేపీ నడ్డాను ఆయన నివాసంలో దాదాపు పది నిమిషాల పాటు కలిశామని.. నీట్-యూజీ పేపర్ లీకేజీ వివాదం, ఢిల్లీలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తమ డిమాండ్లతో కూడిన రాతపూర్వక లేఖను మంత్రికి సమర్పించామని సౌరవ్ దాస్ పేర్కొన్నారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తమకు హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు సీజేపీ ప్రతినిధులు సమర్పించిన లేఖలో ప్రధానంగా మూడు అంశాలను డిమాండ్ చేశారు. నిరసనల నేపథ్యంలో అరెస్ట్ అయిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను, అలాగే ఆసుపత్రి ఆంక్షల్లో ఉన్న పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరారు. దాంతో పాటు నీట్ అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నీట్ పరీక్షల గందరగోళం, మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఒకవైపు పార్లమెంట్ పరిసరాల్లో సీజేపీ కార్యకర్తలపై టియర్ గ్యాస్ ప్రయోగం.. లాఠీఛార్జ్ జరిగి పలువురు గాయపడటం, మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ కావడం, వీటన్నింటి మధ్య జేపీ నడ్డాతో సీజేపీ నేతల చర్చలు జరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.