రెండు నోబెల్ బహుమతుల ధీరవనిత క్యూరీ
Curie
సుధాకర్ ఏవి.
ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగాల చరిత్రలో తనదైన ముద్ర వేసి, మానవాళి ఆరోగ్య రక్షణకు సరికొత్త ద్వారాలు తెరిచిన మహోన్నత శాస్త్రవేత్త మేడం క్యూరీ (మారి క్యూరీ). ప్రతి సంవత్సరం నవంబర్ 7న ఆమె జయంతిని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా సైన్స్ రంగంలో ఆమె చేసిన సేవలను స్మరించుకుంటారు. పేదరికం, లింగ వివక్ష, రాజకీయ సంక్షోభాలను అధిగమించి రెండు వేర్వేరు శాస్త్ర రంగాలలో (భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం) నోబెల్ బహుమతి పొందిన ఏకైక మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఆమె జీవితం కేవలం ఆవిష్కరణలకే పరిమితం కాక, నిరంతర సాధనకు, ఆదర్శవంతమైన వ్యక్తిత్వానికి
ప్రతిరూపంగా నిలిచింది.
ఆధునిక శాస్త్ర రంగంలో విప్లవాత్మక మార్పు లు తెచ్చిన నోబెల్ బహుమతి గ్రహీత మేడం క్యూరీ (మారే స్క్రిడోవ్స్కా) 1867 నవంబర్ 7న పోలాండ్లోని వార్సా నగరంలో జన్మించారు. ఆమె బాల్యం అత్యంత పేదరికంలోను, అనేక కష్టనష్టాల మధ్య గడిచింది; అప్పట్లో పోలాండ్ రష్యా పాలనలో ఉండటం వల్ల అక్కడి పిల్లలకు, ముఖ్యంగా మహిళలకు ఉన్నత విద్యనభ్యసించే అవకాశం ఉండేది కాదు. అయినప్పటికీ ఆమె తండ్రి ఒక ఉపాధ్యాయుడు కావడం వల్ల చిన్నతనం నుంచే మేడం క్యూరీకి చదువుపై, సైన్స్ పట్ల అమితమైన ఆసక్తి కలిగింది. రష్యా నిబంధనలను ధిక్కరిస్తూ రహస్యంగా నడిచే ‘ఫ్లయింగ్ యూనివర్సిటీ’లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె, ఉన్నత చదువుల కోసం పారిస్‌లోని ప్రఖ్యాత ‘సార్బోన్ యూనివర్సిటీ’కి వెళ్లాలని కలలు కన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొద్దికాలం గృహకార్మికురాలిగా పనిచేసి డబ్బు కూడబెట్టుకుని, ఆ తర్వాత ఫ్రాన్స్‌కు చేరుకుని తన తెలివితేటలతో భౌతిక, గణిత శాస్త్రాలలో అత్యుత్తమ డిగ్రీలను సాధించి ప్రపంచ శాస్త్ర చరిత్ర లో చిరస్థాయిగా నిలిచారు.
మేడం క్యూరీ తన భర్త పియర్ క్యూరీతో కలిసి చేసిన పరిశోధనలు అణు భౌతిక శాస్త్రంలో కొత్త శకానికి నాంది పలికాయి. టన్నుల కొద్దీ
‘పిచ్‌బ్లెండ్ అనే ఖనిజాన్ని రాత్రింబవళ్లు సంస్కరించి, ’పోలోనియం’, ‘రేడియం’ అనే రెండు కొత్త మూలకాల ను కనుగొన్నారు. కంటికి కనిపించని వికిరణం పరమాణువు లోపలి నిర్మా ణం నుంచే వస్తుందని ఆమె నిరూపించారు. ఈ పరిశోధనలకు గాను 1903లో భౌతికశాస్త్రం లో, 1911లో రేడియంను వర్గీకరించినందుకు రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతులు సాధించారు.
మేడం క్యూరీ ఆవిష్కరణలు కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాలేదు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో తీవ్రంగా గాయపడిన సైనికులకు త్వరితగతిన వైద్యం అందించడానికి మొబైల్ ఎక్స్-రే యూనిట్లను (‘లిటిల్ క్యూరీస్’) తయారు చేసి స్వయంగా యుద్ధ రంగానికి వెళ్లి సేవ లు అందించారు. రేడియోథెరపీ ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేసే చికిత్సా విధానానికి ఆమె పరిశోధనలే పునాది వేసాయి. తాను కనుగొన్న రేడియం ఆవిష్కరణ కు పేటెంట్ హక్కులు తీసుకోకుండా, ప్రపంచ సంక్షేమం కోసం ఉచితంగా అందించ డం ఆమె త్యాగానికి, మానవ తా దృక్పథానికి నిదర్శనం.
మేడం క్యూరీ జీవితం కేవలం అద్భుతమైన శాస్త్రీయ ఆవిష్కరణలకే పరిమితం కాదు; ఆమె అనుసరించిన నైతిక విలువలు, శాస్త్ర విజ్ఞానాన్ని మానవాళి అభ్యున్నతికే ఉపయోగించాలనే దృక్పథం నేటికీ అత్యంత ఆదర్శనీయం. రేడియం మూలకాన్ని కనుగొన్న తర్వాత దానికి పేటెంట్ హక్కులు తీసుకుని ఉంటే ఆమె ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలిగా నిలిచేవారు. కానీ, శాస్త్ర విజ్ఞానం ఎవరి ఒక్కరి సొత్తు కాకూడదని, అది సామాన్య మానవుడి వైద్య అవసరాలకు ఉచితంగా అందాలనే ఉదాత్తమైన ఉద్దేశంతో ఆమె తన పరిశోధన ఫలితాలను లోకానికి నిస్వార్థంగా అంకితం చేశారు. స్వార్థం నిండిన నేటి ఆధునిక ప్రపంచంలో ఆమె ప్రదర్శించిన ఈ విశాల దృక్పథం, నిజమైన శాస్త్రవేత్తకు ఉండాల్సిన సామాజిక బాధ్యత ఏమిటో చాటిచెబుతుంది.
పురుషాధిక్యత రాజ్యమేలుతున్న నాటి శాస్త్ర సమాజంలో మేడం క్యూరీ ఎదుర్కొన్న అడ్డంకులు అన్నీఇన్నీ కావు. ఫ్రాన్స్‌లో అడుగుపెట్టిన తొలినాళ్ల లో అడుగడుగునా వివక్షను ఎదుర్కొన్నప్పటికీ, తన అసాధారణ మేథస్సుతో, కృషితో ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మన్ననలను పొందడంలో ఆమె విజయం సాధించారు. అయితే, మహిళ అయ్యుండి రెండు నోబెల్ బహుమతులు సాధించి నా, నాటి సంప్రదాయవాద సమాజం, పత్రికలు ఆమెను ఒక శాస్త్రవేత్తగా గౌరవించడంలో ఎన్నోసార్లు సంకోచించాయి. ఈ ప్రతికూలతలను ఆమె ఎప్పుడూ మాటలతో ఎదుర్కోలేదు; తన అచంచలమైన పరిశోధనా ఫలితాలతో విమర్శకుల నోళ్లు మూయించారు. నేడు విజ్ఞాన శాస్త్ర రంగంలో మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మేడం క్యూరీ వేసిన ఆనాటి బాటలే బలమైన
పునాదిగా నిలిచాయి.
మేడం క్యూరీ పరిశోధనల సమయంలో వెలువడిన తీవ్ర రేడియోధార్మికత కారణంగానే
అప్లాస్టిక్ అనీమియాతో కన్నుమూశారు. విజ్ఞానం కోసం, మానవాళి శ్రేయస్సు కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఆమె జీవితం ప్రతి ఒక్కరికీ ప్రేరణదాయకం. నేటి సైన్స్ సాంకేతిక యుగంలో శాస్త్ర పరిశోధనల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి, ప్రతికూల పరిస్థితులను అధిగమించి లక్ష్యాలను సాధించడానికి మేడం క్యూరీ ఆదర్శం ఎల్లప్పుడూ వెలుగుదివిటీగా నిలుస్తుంది.