Skip to content
ప్రపంచం వార్తలు

Strait of Hormuz Attack: హార్ముజ్ జలసంధిలో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ దాడి.. భారత నావికుడు మృతి.. మరో ఆరుమందికి గాయాలు..

Prajapaksham 14 Jul 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Strait of Hormuz Attack: హార్ముజ్ జలసంధిలో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ దాడి.. భారత నావికుడు మృతి.. మరో ఆరుమందికి గాయాలు..

Strait of Hormuz Attack: హార్ముజ్ జలసంధిలో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ దాడి.. భారత నావికుడు మృతి..మరో ఆరుగురికి గాయాలు..

Strait of Hormuz Attack:పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ యుద్ధం ముదిరింది. ఈ వార్ పర్యవసానాలు ఇప్పుడు ఇతర దేశాలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఒమన్ ప్రాదేశిక జలాల్లోని హార్ముజ్ జలసంధి వేదికగా జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఈ జలసంధి దక్షిణ మార్గంలో ప్రయాణిస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) జెండా కలిగిన ‘మొంబాసా’, ‘బహియా’ అనే రెండు వాణిజ్య చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దళాలు రెండు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించాయి.

ఈ ఘోర దాడిలో మొంబాసా నౌకలో పనిచేస్తున్న ఒక భారతీయ నావికుడు అక్కడికక్కడే మరణించగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రెయిన్ జాతీయులు ఉన్నారని.. వారిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం తెల్లవారుజామున అధికారికంగా ప్రకటించింది.

ఈ క్షిపణి దాడుల కారణంగా రెండు ట్యాంకర్లలోనూ భారీగా మంటలు చెలరేగి ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ.. తదుపరి రెస్క్యూ ఆపరేషన్ ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఉదంతాన్ని అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని యూఏఈ మండిపడింది. తమ భూభాగం, ప్రజలు, నివాసితులు, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని రకాల ప్రతిస్పందన చర్యలు తీసుకునే పూర్తి హక్కు తమకు ఉందని యూఏఈ హెచ్చరించింది. అలాగే దేశవ్యాప్తంగా రక్షణ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని పేర్కొంటూ.. ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారంపైనే ఆధారపడాలని కోరింది.

మరోవైపు హార్ముజ్ జలసంధిలో సముద్ర నిబంధనలను ఉల్లంఘించిన పలు నౌకలను తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ పాక్షిక అధికారిక తస్నిమ్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఐఆర్‌ఐబి (IRIB) సైనిక వర్గాల సమాచారం ప్రకారం.. ఇరాన్ నౌకాదళం అమెరికా శత్రువుకు చెందిన ఒక విరోధ నౌకపైనే ఈ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు పేర్కొంది. అమెరికా దళాలు ఇరాన్‌పై వరుస దాడులకు తెగబడుతుండటంతో.. దానికి ప్రతికారంగానే ఇరాన్ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. జలమార్గంలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకునే టెహ్రాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) సోమవారం ఇరాన్‌పై కొత్త విడత దాడులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో ఇరాన్ నౌకా రవాణాపై వాషింగ్టన్ దిగ్బంధనాన్ని పునరుద్ధరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము ప్రపంచంలోనే అత్యంత సంపన్న భాగాన్ని రక్షిస్తున్నామని.. అందుకు భారీగా డబ్బు ఖర్చు అవుతున్నందున, భద్రతా ఖర్చులకు పరిహారంగా ఈ జలసంధి గుండా వెళ్లే సరుకులపై 20 శాతం రుసుము విధిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం నుంచే ఈ కొత్త ఆంక్షలు, దిగ్బంధనం పునఃప్రారంభం అవుతాయని.. ఇరాన్ ఓడరేవులకు రాకపోకలు సాగించే నౌకలకు ఇది వర్తిస్తుందని అమెరికా సైన్యం స్పష్టం చేసింది. అయితే ఆంక్షల పరిధిలోకి రాని సాధారణ నౌకల రాకపోకలను అనుమతిస్తామని తెలిపింది.