Skip to content
ప్రపంచం వార్తలు

భారత్‌- అమెరికా డీల్‌

Prajapaksham 27 May 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
భారత్‌- అమెరికా డీల్‌

న్యూఢిల్లీ : ప్రపంచ సాంకేతిక సరఫరా గొలుసులకు కీలకమైన అరుదైన భూమూలకాలు, వ్యూహాత్మక లోహాలపై చైనా విధించిన ఎగుమతి నియంత్రణలపై పెరుగుతున్న ఆందోళనల మధ్య, కీలక ఖనిజాల స్థిరమైన సరఫరాలను నిర్ధారించే విషయమై సహకారం కోసం భారతదేశం, యునైటెడ్‌ స్ట్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యుఎస్‌ఏ) ఒక కీలకమైన చట్రాన్ని ఖరారు చేశాయి. మంగళవారం ఇక్కడ జరిగి ‘క్వాడ్‌’ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా కీలక ఖనిజాల తవ్వకం, శుద్ధి సరఫరాలను సురక్షితం చేసే చట్రంపై సంతకాలు జరిగాయి. ‘ఇది చాలా సమయోచితమైన, కీలకమైన విషయం’ అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సమక్షంలో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు. ‘మైనింగ్‌, ప్రాసెసింగ్‌, రీసైక్లింగ్‌,సంబంధిత పెట్టుబడులతో సహా కీలకమైన ఖనిజాలు, అరుదైన భూలోహాల సరఫరా గొలుసు అంతటా మన సహకారాన్ని మరింత పెంచడమే ఈ చట్రం లక్ష్యం’ అని జైశంకర్‌ చెప్పారు. ఈ ఫ్రేమ్‌ వర్క్‌ పటిష్ఠమైన, వైవిధ్యభరితమైన సరఫరా గొలుసులను బలోపేతం చేస్తుందని, ప్రాజెక్ట్‌లకు ఆర్థిక సహాయం అందిస్తుందని, అలాగే కీలక ఖనిజాలు, అరుదైన మూలకాల సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ వెల్లడించారు. ‘ఎన్నో సవాళ్లు, అదే సమయంలో ఎన్నో అవకాశాలు ఉన్న ఈ ప్రపంచంలో మన సహకారం ఎంత సన్నిహితంగా ఉందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం’ అని అన్నారు. తన ప్రసంగంలో మార్కో రూబియో అమెరికా భారతదేశం మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇరుదేశాల జాతీయ ప్రయోజనాల దృష్ట్యా దాని ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించారు. ‘ఇది దానికి ఒక స్పష్టమైన ఉదాహరణ’ అని ఒప్పందంపై సంతకాలు చేయడాన్ని ప్రస్తావిస్తూ రూబియో చెప్పారు. ‘మన ఆవిష్కరణ ఆర్థికవ్యవస్థకు ముఖ్యమైన కీలక ఖనిజాలు, సరఫరా గొలుసులకు విశ్వసనీయమైన దీర్ఘకాలిక ప్రాప్యతను నిర్ధారించడంలో వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్న రెండు దేశాలం మనం’ అని ఆయన అన్నారు. ‘ఈ ఒప్పందం ఒక మైలురాయి’ అని అమెరికా ఒక ప్రకటనలో తెలిపింది.ఈ పెట్టుబడులు పాక్స్‌ సిలికా, మేం పునరుజ్జీవింపజేస్తున్న దౌత్య వాణిజ్య సంబంధాలతో కలిసి ప్రభుత్వ వ్యయాలకంటే అనేక రెట్లు అధికంగా ప్రైవేట్‌ మూలధనాన్ని సమీకరిస్తూ గుణకార ప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మార్కో రూబియో అమెరికా మద్దతు ఉన్న పాక్స్‌ సిలికా కార్యక్రమాన్ని కూడా ప్రస్తావించారు. ‘ఫిబ్రవరి 4న వాషింగ్టన్‌ డి.సి.లో మేం నిర్వహించిన క్రిటికల్‌ మినరల్స్‌ ఫోరంలో మీరు మాతో చేరినప్పుడు దీనికి పునాది పడింది’ అని రూబియో గుర్తు చేశారు. పాక్స్‌ సిలికాపై భారత్‌ సంతకం చేసిన తర్వాత ఇది మరీ ఊపందుకుందన్నారు. కీలక ఖనిజాలు, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) కోసం సురక్షితమైన, స్థితిస్థాపకమైన, ఆవిష్కరణలు ఆధారిత సరఫరా గొలుసును నిర్మించడానికి గత ఏడాది డిసెంబర్‌లో పాక్స్‌ సిలికా కార్యక్రమాన్ని నిర్వహించారు.