Skip to content
ఎడిట్ పేజి వార్తలు

ఉచిత యుపిఐకి ధర కట్టే ప్రయత్నం!

Prajapaksham 08 Aug 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
ఉచిత యుపిఐకి ధర కట్టే ప్రయత్నం!

UPI

ప్రపంచవ్యాప్తంగా అత్యంత విజయవంతమైన ఈ డిజిటల్‌ చెల్లింపు వ్యవస్థ యుపిఐను కూడా కేంద్ర ప్రభుత్వం తన ఆదాయ మార్గంగా మార్చేందు కు పావులు కదుపుతున్నది. సామాన్యుడి నడ్డి విరిచేందుకు మరోసారి సిద్ధమవుతున్నది. ‘పన్నులు, ఇతర చట్టాల (సవరణ)బిల్లు ఈ పరిస్థితిని మార్చే దిశగా అడుగు వేసింది. ఇప్పటి వరకు యుపిఐ వంటి డిజిటల్‌ చెల్లింపులపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండిఆర్‌) లేదా ఇతర సేవా రుసుములు విధించకుండా అడ్డుకుంటున్న చట్టపరమైన నిబంధనను తొలగించింది. ఈ అవరోధం తొలగిపోవడంతో, ఏ క్షణమైనా ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయవచ్చు. బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, డిజిటల్‌ చెల్లింపు సంస్థలు యుపిఐ లావాదేవీలపై రుసుములు వసూలు చేయవచ్చు. ‘ప్రభుత్వం ఇప్పుడే ఛార్జీలు విధించడం లేదు’ అనే ప్రభుత్వ ప్రకటన కేవలం ఊరటనిచ్చే వాదన మాత్రమే. ఎందుకంటే చట్టం మారింది. ఇప్పటి వరకు ప్రజలకు ఉన్న హక్కు ఇప్పుడు ప్రభుత్వ అనుమతిపై ఆధారపడే సౌకర్యంగా రూపాంతరం చెందింది. ఈ మార్పే ఆందోళన కలిగించే అంశం.

యుపిఐ ప్రభావం నగరాలకు పరిమితం కాదు. గ్రామాల్లో కూడా చిన్న దుకాణాలు, పండ్ల బండ్లు, పాలు అమ్మేవారు, పూల వ్యాపారులు, కూలీలు, స్వయం ఉపాధి పొందుతున్న లక్షలాది మంది తమ ఆదాయంలో పెద్ద భాగాన్ని ఇప్పుడు యుపిఐ ద్వారానే స్వీకరిస్తున్నారు. నగదు చిల్లర సమస్య నుంచి బయటపడ్డారు. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం తగ్గింది. లావాదేవీలకు రికార్డు ఏర్పడింది. ఈ సౌకర్యం వారికి ఎలాంటి అదనపు వ్యయం లేకుండా లభించింది. ఇప్పుడు ఒక్కో లావాదేవీపై చిన్న మొత్తంలోనైనా రుసుము చెల్లించాల్సి వచ్చినా, ఆ ప్రభావం మొదటగా ఈ వర్గంపైనే పడుతుంది.

పెద్ద వ్యాపార సంస్థలు ఆ ఖర్చును తమ వ్యాపార వ్యయంగా చూపించగలవు. అవసరమైతే వస్తువుల ధరల్లో కలిపి వినియోగదారులపైకి నెట్టగలవు. కానీ చిన్న వ్యాపారికి ఆ అవకాశం ఉండదు. అతను తన లాభం లో నుంచి చెల్లించాలి. లేకపోతే వినియోగదారుడి నుంచి అదనంగా వసూలు చేయాలి. రెండు పరిస్థితుల్లోనూ నష్టపోయేది చివరకు సామాన్యుడే.

సాధారణ వినియోగదారుడికి ప్రభుత్వ నిర్ణయం అనుకూలించదు. ఇప్పటి వరకు పది రూపాయలైనా, పది వేల రూపాయలైనా యుపిఐ ద్వారా ఎలాంటి భయం లేకుండా చెల్లించాడు. రేపు ఛార్జీలు చెల్లించాల్సివస్తే చిన్న మొత్తాల చెల్లింపుల కే ప్రజలు నగదును ఆశ్రయించే అవకాశం ఉంది. డిజిటల్‌ చెల్లింపుల విస్తరణ కు ఇది ఎదురుదెబ్బే. ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా ‘డిజిటల్‌ ఇండియా’ అని ప్రచారం చేసింది. ఇప్పుడు అదే ప్రభుత్వ విధానం ఆ లక్ష్యానికే విరుద్ధం గా కనిపిస్తోంది.

బ్యాంకులు, పేమెంట్‌ సంస్థలు తమ వాదనగా నిర్వహణ వ్యయం పెరుగుతోందని చెబుతున్నాయి. అది కొంతవరకు నిజమే. సర్వర్లు, సైబర్‌ భద్రత, సాంకేతిక మౌలిక వసతులు, మోసాల నివారణకు ఖర్చు పెరుగుతోంది. కానీ ఈ ఖర్చును వసూలు చేయడానికి సామాన్యుడి జేబుపైనే చేయి వేయడం ఒక్కటే మార్గమా? అనే ప్రశ్నకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.

యుపిఐ ఒక ప్రైవేటు ఉత్పత్తి కాదు. ఇది దేశ ఆర్థిక మౌలిక వసతుల్లో భాగం. ప్రభుత్వం పన్నుల వసూళ్లు పెంచుకోవడానికి, సంక్షేమ పథకాల డబ్బును నేరుగా పంపించడానికి, ఆర్థిక వ్యవస్థను పారదర్శకంగా మార్చడానికి యుపిఐ విస్తరణే పెద్ద బలం. ఇంత లాభం ప్రభుత్వానికే దక్కుతున్నప్పుడు, దాని నిర్వహణ ఖర్చు మొత్తం ప్రజలపై వేయడం న్యాయబద్ధం కాదు. యుపిఐపై ప్రజలు విశ్వాసం పెంచుకున్నది అది ఉచిత సేవ కావడం వల్ల. ఇప్పుడు ఛార్జీలకు పచ్చజెండా ఊపితే, భవిష్యత్తులో ఎప్పుడు ఎంత రుసుము విధిస్తారో తెలియని అనిశ్చితి.

డిజిటల్‌ వ్యవస్థల విజయానికి విశ్వాసమే మూలధనం. ఆ విశ్వాసాన్ని దెబ్బతీసే నిర్ణయాలను ప్రజలు ప్రశ్నించాల్సిందే. ఒక కోటీశ్వరుడు చేసే లావాదేవీలపై పడే రుసుము అతనికి పెద్ద సమస్య కాదు. కానీ, సగటున రోజుకు వెయ్యి రూపాయల వ్యాపారం చేసే చిన్న వ్యాపారికి అదే రుసుము గణనీయమైన భారం. ఒకే విధానం అందరికీ సమానంగా కనిపించినా, దాని ప్రభావం అసమానంగా ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం సామాజిక న్యాయ సూత్రానికీ విరుద్ధంగా మారుతుంది.

వ్యాపారులపై కొత్త వ్యయం పడినప్పుడు అది చివరకు వస్తువుల ధరల్లో ప్రతిబింబిస్తుంది. అంటే ప్రభుత్వం ప్రత్యక్షంగా పన్ను వేయకపోయినా, డిజిటల్‌ లావాదేవీల ఖర్చు ధరల పెరుగుదల ద్వారా ప్రజలపైనే ప్రభావం చూపుతుంది. ఎన్నో సంవత్సరాలుగా డిజిటల్‌ చెల్లింపుల ను ప్రోత్సహిస్తూ ప్రజలను నగదు నుంచి యుపిఐ వైపు మళ్లించారు. ఇప్పుడు అదే వ్యవస్థపై ఛార్జీలకు అవకాశం కల్పించడం వ్యూహాత్మక దోపిడీకి చిహ్నం. విధానపరమైన అస్థిరతకు సంకేతం. ప్రభుత్వ ప్రోత్సాహకాలను నమ్మి డిజిటల్‌ వ్యవస్థలోకి వచ్చిన చిన్న వ్యాపారులు ఇప్పుడు మళ్లీ అనిశ్చితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.

భారీ విలువ కలిగిన వాణిజ్య లావాదేవీలపై మాత్రమే పరిమిత రుసుములు పరిశీలించవచ్చు. చిన్న వ్యాపారులు, సూక్ష్మ వ్యాపారులు, సాధారణ వినియోగదారులను పూర్తిగా మినహాయించవచ్చు. డిజిటల్‌ చెల్లింపుల వల్ల లాభపడుతున్న పెద్ద బ్యాంకులు, పెద్ద ఫిన్‌టెక్‌ సంస్థలు, భారీ వాణిజ్య సంస్థలు నిర్వహణ వ్యయంలో ఎక్కువ వాటా భరించే విధానాన్ని రూపొందించవచ్చు.

లోక్‌సభ ఈ బిల్లును చర్చ లేకుండానే ఆమోదించడం కూడా మరో ఆందోళన కలిగించే అంశం. కోట్లాదిమంది ప్రజల రోజువారీ ఆర్థిక జీవితాన్ని ప్రభావితం చేసే మార్పుపై విస్తృత చర్చ జరగాలి. వినియోగదారుల సంఘాలు, చిన్న వ్యాపారుల ప్రతినిధులు, బ్యాంకింగ్‌ నిపుణుల అభిప్రాయాలు తెలుసుకోవాల్సింది. అలాంటి ప్రజా చర్చ లేకుండా తీసుకున్న నిర్ణయాలు తరువాత పెద్ద సామాజిక వ్యతిరేకతకు దారితీస్తుంది.

ప్రజలకు ఉచితంగా, అందరికీ సమానంగా అందుబాటులో ఉన్న యుపిఐని ఆదాయ వనరుగా మార్చే ప్రతి ప్రయత్నాన్ని ప్రజలు అప్రమత్తంగా గమనించాలి. ఈ రోజు చిన్న రుసుముతో ప్రారంభమయ్యే మార్పు, రేపు ప్రతి డిజిటల్‌ లావాదేవీపై కొత్త భారంగా మారే ప్రమాదం ఉందని గ్రహించాలి. సాంకేతిక పురోగతి పేరుతో ప్రజలపై కొత్త ఆర్థిక భారం మోపడం అభివృద్ధి కాదు.

డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ ప్రజలకు సేవ చేయాలి. ప్రజలు ఆ వ్యవస్థను పోషించడానికి అదనపు మూల్యం చెల్లించే పరిస్థితి రాకూడదు. అందుకే యుపిఐపై రుసుములు విధించే అవకాశాన్ని కల్పించిన ఈ చట్ట సవరణను ప్రభుత్వం పునఃపరిశీలించాలి. డిజిటల్‌ భారత్‌ విజయగాథను ఖర్చుతో కూడిన సేవగా మార్చకుండా కాపాడుకోవడం ఇప్పుడు ప్రజాస్వామ్య బాధ్యతగా మారింది.

ట్యాగ్‌లు: editorial UPI payments