Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

టీడీపీ మహానాడుకు విరాళాల వెల్లువ.. రెండు రోజుల్లో రూ.25.61 కోట్లు సేకరణ!

Prajapaksham 30 May 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
టీడీపీ మహానాడుకు విరాళాల వెల్లువ.. రెండు రోజుల్లో రూ.25.61 కోట్లు సేకరణ!

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వార్షిక పండుగ ‘మహానాడు’ వేడుకల్లో విరాళాలు వెల్లువెత్తాయి. రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భారీగా ఆర్థిక చేయూతను అందించారు. ఈ రెండు రోజుల్లో మొత్తం రూ. 25.61 కోట్ల విరాళాలు అందినట్లు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. విరాళాలు అందించిన ప్రతి ఒక్కరి పేరును ఆయనే స్వయంగా వేదికపై నుంచి చదివి వినిపించి, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలిపారు.

మహానాడు వేడుకల్లో భాగంగా తొలిరోజు రూ. 12.44 కోట్లు రాగా, రెండో రోజు రూ. 13.17 కోట్ల చొప్పున విరాళాలు అందాయని చంద్రబాబు వివరించారు. ఈ విరాళాల ప్రవాహంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు అత్యధికంగా రూ. 5 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి అగ్రస్థానంలో నిలిచారు. పార్టీ కోసం వివిధ వర్గాల వారు వివిధ రూపాల్లో సేవలందిస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. కొందరు సోషల్ మీడియాలో, మరికొందరు క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమిస్తుంటే, ఇంకొందరు ఆర్థికంగా అండగా నిలుస్తూ పార్టీ బలాన్ని పెంచుతున్నారని ఆయన అన్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) హయాం నుంచే మహానాడులో విరాళాలు స్వీకరించే సాంప్రదాయం ఉందని, గతంలో ఇందుకోసం ప్రత్యేకంగా హుండీలను ఏర్పాటు చేసేవారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.

రెండో రోజు అందిన విరాళాల్లో ప్రముఖ సంస్థలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున భాగస్వామ్యమయ్యారు. ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా తరఫున రాజగోపాల్ రూ. 1.50 కోట్లు అందించగా.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు, అలాగే నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం తలో రూ. కోటి చొప్పున భారీ విరాళాలను అందజేశారు. తిరుపతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్‌ రూ. 50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

వీరితో పాటు ఏపీ టెక్నలాజికల్‌ సర్వీసెస్‌ ఛైర్మన్‌ మన్నవ మోహన్‌కృష్ణ రూ. 27 లక్షలు, టీడీపీ నేత శంకర్ రెడ్డి రూ. 25 లక్షలు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని రూ. 19 లక్షలు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి రూ. 15 లక్షలు అందజేశారు. మరికొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తమ స్తోమతను బట్టి రూ. 10 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు విరాళాలు ఇచ్చారు. ఇందులో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, గురజాల జగన్మోహన్, కురుగొండ్ల రామకృష్ణ, మామిడి గోవిందరావు, నరేంద్ర వర్మ వంటి వారు రూ. 10 లక్షల చొప్పున పార్టీకి అందించారు. అలాగే మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, పరిటాల సునీత, శ్రీరాం రాజగోపాల్ తదితరులు రూ. 5 లక్షలు చొప్పున అందజేసి పార్టీ పట్ల తమకున్న విధేయతను, నిబద్ధతను చాటుకున్నారు.