Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రాజమండ్రి వైద్య విద్యార్థిని మెడికో ప్రియాంక కన్నుమూత..నిర్దారించిన వైద్యులు..కేసు పూర్తి వివరాలు ఇవే..

Prajapaksham 09 Aug 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి వైద్య విద్యార్థిని మెడికో ప్రియాంక కన్నుమూత..నిర్దారించిన వైద్యులు..కేసు పూర్తి వివరాలు ఇవే..

రాజమండ్రిలో జరిగిన ‘హిట్-అండ్-రన్’ ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక, సికింద్రాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం 3:25 గంటలకు ఆమె మరణించినట్లు కిమ్స్ (KIMS) వైద్యులు ధృవీకరించారు. ప్రియాంక జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందినవారు. ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేసిన తర్వాత, ఆమె రాజమండ్రిలోని జీఎస్‌ఎల్ (GSL) మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగంలో పీజీ (PG) మొదటి సంవత్సరం చదువుతున్నారు.

కేసు పూర్వాపరాల్లోకి వెళితే…జోగులాంబ గద్వాల జిల్లా ఎక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన ప్రియాంక, రాజమహేంద్రవరంలో మెడిసిన్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. ఆగస్టు 3న రాత్రి రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్య మాల్‌లో సినిమా చూసిన తర్వాత ప్రియాంక తన స్నేహితురాలితో కలిసి స్కూటీపై బయలుదేరారు. మాల్ వెలుపల రహదారిపై తీవ్రమైన ట్రాఫిక్ ఉండటంతో వారు స్కూటీని కొద్దిసేపు నిలిపివేశారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు వారి స్కూటీని బలంగా ఢీకొట్టడంతో ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో నామవరానికి చెందిన సురవరపు దుష్యంత్, లాలాచెరువుకు చెందిన ఆండ్రూ విలియం జోసెఫ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తొలుత ప్రియాంకను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరంలోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కిమ్స్ ఆస్పత్రిలో ప్రియాంక బ్రెయిన్ డెత్ అయ్యే పరిస్థితి ఏర్పడటంతో వైద్యులు పూర్తి స్థాయిలో ఆమెను కాపాడేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నించారు, ఆరోగ్యం సహకరించక కొన్ని పరీక్షల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి.

మృత్యువుతో పోరాడిన ప్రియాంక పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో వైద్యులు బ్రెయిన్ డెత్‌గా నిర్ధారించి, ఆదివారం మధ్యాహ్నం ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ ప్రమాదానికి కారణమైన ఇద్దరు నిందితులకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మొదట ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో వెలుగుచూసిన వివరాల ఆధారంగా కేసు సెక్షన్లను మార్చారు.

ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఆధారాలు లభిస్తే, ప్రస్తుతం ఉన్న హత్యాయత్నం కేసును ‘హత్య’ కేసుగా మారుస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ తెలిపారు. నిందితులను కస్టడీకి తీసుకొని విచారిస్తామని, ఈ ఘటనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. కుమార్తెను కోల్పోయిన ప్రియాంక తండ్రి వెంకటేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి మంచి వైద్యురాలిగా స్థిరపడాల్సిన ప్రియాంక అకాల మరణంతో ఆమె కుటుంబంలో, స్నేహితులలో తీవ్ర విషాదం నిండింది.

ట్యాగ్‌లు: andhra pradesh