Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఒంగోలు కూటమిలో తీవ్ర విభేదాలు.. బాలినేని – దామచర్ల మధ్య భగ్గుమన్న మంటలు

Prajapaksham 10 Aug 2026 0 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
ఒంగోలు కూటమిలో తీవ్ర విభేదాలు.. బాలినేని – దామచర్ల మధ్య భగ్గుమన్న మంటలు

Balineni Vs Damacharla

ప్రకాశం జిల్లా ఒంగోలు వేదికగా కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పొలిటికల్ వార్ నడుస్తోంది. జనసేన నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మధ్య చోటుచేసుకుంటున్న పరస్పర తీవ్ర విమర్శలపై ఇరు పార్టీల అధిష్ఠానాలు తీవ్రంగా స్పందించాయి. ఈ వివాదం కూటమి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉండటంతో అగ్రనేతలు రంగంలోకి దిగి నేతలిద్దరూ సంయమనం పాటించాలని.. బహిరంగ ప్రకటనలకు దూరంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఒంగోలు నియోజకవర్గంలో భూములు, ఇసుక అక్రమ రవాణా, రేషన్ పంపిణీ వ్యవహారాల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌కు భాగస్వామ్యం ఉందని, వీటిపై తక్షణమే విచారణ జరిపించాలని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దామచర్ల జనార్ధన్ ధీటుగా బదులిచ్చారు. బాలినేని నియోజకవర్గానికి ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తారని.. గతంలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. ఇప్పటికీ ఆయన కూటమి ప్రయోజనాలకు వ్యతిరేకంగా, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఈ అంతర్గత పోరు కూటమికి రాజకీయంగా తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉండటంతో కూటమి సమన్వయ కమిటీ అత్యవసరంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించింది. ఈ సమావేశంలో టీడీపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలుంటే పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలి తప్ప.. ఇలా రోడ్డెక్కి విమర్శలు చేసుకోవడం తగదని స్పష్టం చేశారు.

అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు నేరుగా ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌తో ఫోన్లో మాట్లాడి హెచ్చరించగా.. జనసేన ముఖ్య నేతలు బాలినేనితో మాట్లాడి నచ్చజెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఇరు పార్టీల నాయకత్వాలు కఠినమైన ఆదేశాలు ఇచ్చాయి.

బాలినేని ఆరోపణలు:
ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతున్న భూ ఆక్రమణలు, ఇసుక అక్రమ రవాణా, రేషన్ పంపిణీ అక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌కు నేరుగా భాగస్వామ్యం ఉందని బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఆక్రమాలు, అక్రమాలపై ప్రభుత్వం చేత తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

దామచర్ల కౌంటర్:
బాలినేని వ్యాఖ్యలపై ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ అంతే ధీటుగా బదులిచ్చారు. బాలినేనికి నియోజకవర్గంతో సంబంధం లేదని, అప్పుడప్పుడు వచ్చి రాజకీయాలు మాట్లాడుతుంటారని ఎద్దేవా చేశారు. గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించిన చరిత్ర ఆయనదని, ఇప్పటికీ బాలినేని కూటమి ప్రయోజనాలకు వ్యతిరేకంగా, వైసీపీకి అనుకూలంగానే పని చేస్తున్నారని ఆరోపించారు.