Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

AP SIR Deadline Extended: ఏపీలో SIR ప్రక్రియకు మరోసారి గడువు పెంపు.. తుది ఓటర్ల జాబితా ఎప్పుడంటే..

jagan 01 Oct 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
AP SIR Deadline Extended: ఏపీలో SIR ప్రక్రియకు మరోసారి గడువు పెంపు.. తుది ఓటర్ల జాబితా ఎప్పుడంటే..

SIR Controversy

AP SIR Deadline Extended: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గడువు పొడిగించింది. తాజా షెడ్యూల్ ప్రకారం తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 16, 2026న ప్రచురించనున్నారు. అంతకుముందు తుది జాబితా అక్టోబర్ 9న విడుదల చేయాల్సి ఉండగా.. తాజాగా మరో వారం రోజుల పాటు గడువు పెంచారు. ఈ నిర్ణయం పెండింగ్‌లో ఉన్న విచారణలు, క్లెయిమ్స్, అభ్యంతరాలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

తాజా షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితాపై వచ్చిన క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 10 వరకు సమయం ఇచ్చారు. ఈ గడువులోపు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఈసీఐ ఆదేశించింది. ముఖ్యంగా నో-మ్యాపింగ్, లాజికల్ డిస్క్రెపెన్సీ కేసులకు సంబంధించిన పెండింగ్ హియరింగ్‌లతో పాటు ఫారం 6, ఫారం 7, ఫారం 8 ద్వారా అందిన దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించేందుకు అదనపు సమయం అవసరమైన నేపథ్యంలో ఈ పొడిగింపు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో SIR ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను జులై 31న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచురించారు. అనంతరం క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరించి వాటిని పరిశీలించే ప్రక్రియ కొనసాగింది. తాజా పొడిగింపుతో ఈ పరిశీలనకు అక్టోబర్ 10 వరకు సమయం లభించనుంది. ఆ తర్వాత తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 16న ప్రచురించనున్నారు.

ఇది ఏపీలో SIR షెడ్యూల్‌కు ఇచ్చిన రెండో పొడిగింపు. మొదట క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రక్రియ ఆగస్టు 30తో ముగియాల్సి ఉండగా.. ఆ తర్వాత గడువు పెంచారు. గతంలో తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 9న ప్రచురించాలని నిర్ణయించారు. తాజాగా దానిని అక్టోబర్ 16కు మార్చారు.

SIR ప్రక్రియలో భాగంగా నో-మ్యాపింగ్, లాజికల్ డిస్క్రెపెన్సీ వంటి అంశాలపై కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అదేవిధంగా ఓటర్ల నమోదు, తొలగింపు, వివరాల మార్పులకు సంబంధించిన ఫారం 6, 7, 8 దరఖాస్తుల పరిష్కారం కూడా పూర్తికావాల్సి ఉంది. ఈ కేసులన్నింటినీ పరిశీలించి అర్హులైన ఏ ఓటరు కూడా తుది జాబితాలో నమోదు కాకుండా మిగిలిపోకుండా చూడాలనే ఉద్దేశంతో గడువు పొడిగించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

తాజా మార్పులను గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని, అలాగే మీడియా ద్వారా ప్రజలకు విస్తృతంగా సమాచారం అందించాలని ఎన్నికల అధికారులు సూచించారు. దీంతో ఓటర్లు తమ పేర్లు, వివరాలు తుది జాబితాలో సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు మేఘాలయలోనూ SIR షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం సవరించింది. మేఘాలయలో తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 26న ప్రచురించనున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ పెండింగ్ ప్రక్రియలను పూర్తి చేసి, ఓటర్ల జాబితాలను మరింత సమగ్రంగా రూపొందించేందుకు ఈ పొడిగింపులు ఇచ్చినట్లు ఈసీఐ తెలిపింది.