AI vs Human Jobs: ఏఐతో ప్రపంచవ్యాప్తంగా 2.4 కోట్ల ఉద్యోగాలకు ముప్పు.. వచ్చే ఐదేళ్లలో నిరుద్యోగులతో అల్లాడిపోనున్న భారత్..జేపీ మోర్గాన్ సంచలన నివేదిక..
AI
AI vs Human Jobs: వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ (ఏఐ) రానున్న ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.4 కోట్ల ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపనుందని జేపీ మోర్గాన్ వెల్త్ మేనేజ్మెంట్ తన తాజా నివేదికలో వెల్లడించింది. శారీరక శ్రమతో కూడిన పనుల కంటే, ఎక్కువగా సమాచార విశ్లేషణ, ప్రణాళిక, డేటా ఆధారిత నిర్ణయాలతో కూడిన ‘నాలెడ్జి వర్కర్’ కొలువులపైనే ఈ ప్రభావం అధికంగా ఉండబోతోందని పేర్కొంది.
రాబోయే ఐదేళ్లలో ప్రపంచ కార్మిక రంగంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. వివిధ వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాల్లో ఏఐ వినియోగాన్ని వేగంగా పెంచుతూ, సంప్రదాయ పద్ధతుల్లో ఆ పనులు చేస్తున్న సిబ్బందిని క్రమంగా తగ్గించే అవకాశం ఉంది. ఈ ధోరణి కారణంగా ఐదేళ్ల పాటు ప్రతి ఏటా ప్రపంచంలోని నాలెడ్జి వర్కర్లలో 1.3 శాతం మందిపై ప్రతికూల ప్రభావం పడుతుందని నివేదిక అంచనా వేసింది.
సంస్థలు కేటాయిస్తున్న ఏఐ బడ్జెట్లో సగం వాటాను నాలెడ్జి వర్కర్ల స్థానాల్లో ఆటోమేషన్, ఏఐ వ్యవస్థలను ప్రవేశపెట్టడానికే ఖర్చు చేస్తాయని జేపీ మోర్గాన్ విశ్లేషించింది. 2000వ సంవత్సరం ప్రారంభంలో తయారీ రంగంలో జరిగిన ఉపాధి నష్టాలతో పోలిస్తే, రానున్న కాలంలో నష్టపోయే ఉద్యోగాల సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువగా ఉండవచ్చని హెచ్చరించింది.
ఏఐ విస్తరణతో ఉద్యోగాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయన్న ఆందోళన అనవసరమని నివేదిక స్పష్టం చేసింది. ప్రతి ఉద్యోగి తమ రోజువారీ విధుల్లో భాగంగా అనేక రకాల నిర్దిష్ట పనులను చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అభివృద్ధి చెందిన ఏఐ వ్యవస్థలు ఆ పనుల్లోని కొన్నింటిని మాత్రమే సమర్థవంతంగా చేయగలుగుతున్నాయి. సంక్లిష్టమైన నిర్ణయాలు, సందర్భానుసార విశ్లేషణ, మానవ సంబంధాల నిర్వహణ వంటి అంశాల్లో మనుషుల అవసరం కొనసాగుతుందని నివేదిక అభిప్రాయపడింది.
ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల్లో ఏఐ పూర్తిస్థాయిలో చొచ్చుకుపోవడానికి కొంత సమయం పడుతుందని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. కేవలం ఐటీ లేదా టెక్నాలజీ రంగాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీయేతర రంగాల్లోనూ ఏఐని సమర్థంగా వినియోగించుకున్నప్పుడే సంస్థలు పెట్టిన పెట్టుబడులకు తగిన రాబడులు లభిస్తాయని నివేదిక వివరించింది.
మొత్తంగా చూసినట్లయితే.. ఏఐ రాకతో పని విధానాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో, నైపుణ్యాలను ఎప్పటికప్పుడు నవీకరించుకోవడం ఉద్యోగులకు అత్యవసరంగా మారుతోందని ఈ నివేదిక సూచిస్తోంది.