బిల్కిస్ బానోకు దక్కని న్యాయం.. మానని గాయం
Law
ఎండి. ఉస్మాన్ ఖాన్
ఎన్నో ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత నిర్మించుకున్న జీవితంలోకి పాత భయాలు మళ్లీ ప్రవేశిస్తే ఎలా ఉంటుంది? సొంత గడ్డపై ధైర్యంగా బతకడానికి రెండు దశాబ్దాలకు పైగా న్యాయపోరాటం చేసిన ఒక మహిళ, చివరికి తన కుటుంబంతో కలిసి ఆ రాష్ట్రాన్నే విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటం కంటే విషాదం ఏముంటుంది? గుజరాత్ అల్లర్ల బాధితురాలు బిల్కిస్ బానో ఉదంతంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు దేశ న్యాయవ్యవస్థ ముందు, ప్రజాస్వామ్య సమాజం ముందు కొన్ని మౌలిక ప్రశ్నలను ఉంచుతున్నాయి. ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం, ఆ ఉత్తర్వుల తర్వాత బిల్కిస్ బానో కుటుంబం గుజరాత్‌ను వీడటం కేవలం ఒక సాధారణ వార్త కాదు. ఇది బాధితుల భద్రత, గౌరవం, రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కుకు సంబంధించిన అత్యంత గంభీరమైన అంశం.
బెయిల్ ఉత్తర్వులు వెలువడిన తర్వాత బిల్కిస్ బానో వ్యక్తం చేసిన ఆవేదన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా, తన వాదన వినకుండా దోషులకు బెయిల్ మంజూరు చేయడంపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీడియా కథనాల ద్వారానే ఈ విషయం తెలిసిందని, మళ్లీ తనకు, తన పిల్లలకు భయం మొదలైందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. నవంబరు మొదటి వారంలోనే ఆమె కుటుంబం గుజరాత్ విడిచి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒకప్పుడు తనపై జరిగిన అన్యాయాన్ని ఎదిరించి నిలబడిన మహిళ, నేడు ప్రాణభయంతో సొంత ఊరు వదిలి వెళ్లాల్సి రావడం వ్యవస్థ వైఫల్యమా లేక విధానపరమైన లోపమా అన్నది ఆలోచించాలి.
ఘటన నుంచి సుప్రీంకోర్టు తీర్పు వరకూ
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై మతోన్మాద రాక్షస మూక సామూహిక అత్యాచారానికి పాల్పడింది. ఆమె మూడేళ్ల కుమార్తె సలేహా సహా కుటుంబంలోని ఏడుగురిని అత్యంత కిరాతకం గా హతమార్చింది. ప్రాణాలతో బయటపడిన ఆమె న్యాయం కోసం సాగించిన ప్రయాణం ముళ్లబాటగా సాగింది. స్థానిక పోలీసుల నిర్లక్ష్యం, దర్యాప్తులో లోపాలు, బెదిరింపులను తట్టుకుని ఆమె నిలబడ్డారు. సుప్రీంకోర్టు జోక్యంతో కేసు సిబిఐకి బదిలీ కావడం, విచారణను మహారాష్ట్రకు మార్చడం కీలక మలుపులుగా నిలిచాయి. 2008లో ముంబై ప్రత్యేక న్యాయస్థానం 11 మందికి యావజ్జీవ శిక్ష విధించగా, 2017లో బాంబే హైకోర్టు ఆ తీర్పును సమర్థించింది.
అయితే 2022 ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం సత్ప్రవర్తన పేరిట ఆ 11 మందిని క్షమాభిక్షపై విడుదల చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. విడుదలైన వారికి పూలమాలలతో స్వాగతం పలకడం సమాజంలోని నైతిక విలువలను ప్రశ్నార్థకం చేసింది.
బిల్కిస్ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో 2024 జనవరి 8న జస్టిస్ బివి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం గుజరాత్ ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసింది. విచారణ మహారాష్ట్రలో జరిగినందున క్షమాభిక్షపై నిర్ణయిం చే అధికారం గుజరాత్‌కు లేదని స్పష్టం చేస్తూ దోషులను తిరిగి జైలుకు పంపింది.
తాజా పరిణామం, చట్టపరమైన కోణం
ఆ చారిత్రక తీర్పు వెలువడి రెండేళ్లు గడవకముందే మరో మలుపు చోటుచేసుకుంది. దోషుల్లో ఇద్దరైన విపిన్ చంద్ర కనయ్యలాల్ జోషి, ప్రదీప్ రమణ్‌లాల్ మోథియాలు తమ శిక్షల ను సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీళ్ల నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించామని, ఒకరు తీవ్రమైన వైకల్యంతో బాధపడుతున్నారని వారు పేర్కొన్నారు. జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలే ధర్మాసనం ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని, అప్పీళ్ల విచారణ పెండింగ్‌లో ఉన్నందున యావజ్జీవ శిక్షల అమలును నిలిపివేస్తూ బెయిల్ మంజూరు చేసింది.
శిక్ష అమలు నిలిపివేత అంటే దోషులను నిర్దోషులుగా ప్రకటించడం కాదు; తుది తీర్పు వెలువడే వరకు ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. సుదీర్ఘకాలం జైలులో ఉండటం, అప్పీళ్ల విచారణలో జాప్యం, అనారోగ్య కారణాల దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకునే అధికారం న్యాయస్థానానికి ఉంది. అయితే చట్టంలో ఉన్న వెసులుబాటును వినియోగించుకున్నప్పటికీ, ఈ కేసు ప్రత్యేకతను విస్మరించకుండా ఉండాల్సింది.
ఎందుకంటే, ఇది సాధారణ నేరం కాదు; ఒక మహిళ జీవితాన్ని, కుటుంబాన్ని చిదిమేసిన అత్యంత హేయమైన సామూహిక అత్యాచారం, హత్యల కేసు.
న్యాయప్రక్రియలో బాధితురాలి గొంతు ఎక్కడ?
నేరం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ గడప తొక్కడం దగ్గరి నుంచి, సాక్ష్యం చెప్పడం, దోషుల విడుదలను అడ్డుకోవడాని కి కోర్టుల చుట్టూ తిరగడం వరకు బాధితురాలే పోరాడారు. మరి దోషులకు బెయిల్ వంటి కీలక ఉపశమనం కల్పించేటప్పుడు బాధితురాలికి కనీస సమాచారం ఎందుకు ఇవ్వలేదు? తన భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే ఆమె ఆందోళనను ఎవరు పరిగణనలోకి తీసుకోవాలి? అత్యాచారానికి గురైన వ్యక్తి న్యాయవ్యవస్థలో కేవలం సాక్షిగా మాత్రమే మిగిలిపోకూడదు. తమ జీవితాలను ప్రభావితం చేసే ఉత్తర్వుల విషయంలో వాదన వినిపించే హక్కు బాధితులకు కల్పించాలి. అదే సమయంలో అప్పీళ్ల విచారణలో జాప్యాన్ని తగ్గించి, మహిళలపై తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేసే వ్యవస్థను బలోపేతం చేయాలి.
న్యాయప్రక్రియలో వేగం, పారదర్శకత ఎంత ముఖ్య మో, బాధితురాలి పట్ల సమాజం చూపే దృక్పథం కూడా అంతే ముఖ్యం. బిల్కిస్ బానో ఉదంతాన్ని ఏదో ఒక మతానికి పరిమితం చేసి చూడటం సమస్య విస్తృతిని తగ్గించినట్లవుతుంది. హింసకు, అత్యాచారానికి మతం ఉండదు; బాధితురాలి గౌరవానికి మతపరమైన కొలమానాలు ఆపాదించకూడదు. నేరస్థులు ఏ వర్గానికి చెందినవారైనా చట్టం ముందు సమానం గా శిక్ష అనుభవించాలి.
చట్టం దోషుల హక్కులను కాపాడినట్లే బాధితుల భద్రతకు, గౌరవానికి రక్షణ కల్పించినప్పుడే న్యాయం పరిపూర్ణమవుతుంది. 24 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న బిల్కిస్ బానోకు మళ్లీ భయమే మిగిలితే, అది ప్రజాస్వామ్య వ్యవస్థ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సందర్భం. న్యాయం అనేది కాగితాలపై ఉత్తర్వులుగా కాకుండా, బాధితురాలి జీవితంలో భరోసాగా నిలిచినప్పుడే వ్యవస్థపై ప్రజల విశ్వాసం
పదిలంగా ఉంటుంది.