Skip to content
క్రైమ్ › వార్తలు

Udaipur Tragedy: కూతురు పెళ్లి సంబరాల్లో డ్యాన్స్ చేస్తూ తండ్రి మృతి.. మరణాన్ని దాచి వివాహం జరిపించిన కుటుంబం.. ఉదయ్‌పూర్‌లో హృదయవిదారక ఘటన..

jagan 26 Nov 2026 1 నిమిషాల పఠనం క్రైమ్
Udaipur Tragedy: కూతురు పెళ్లి సంబరాల్లో డ్యాన్స్ చేస్తూ తండ్రి మృతి.. మరణాన్ని దాచి వివాహం జరిపించిన కుటుంబం.. ఉదయ్‌పూర్‌లో హృదయవిదారక ఘటన..

Udaipur Tragedy

Udaipur Tragedy: ఒక తండ్రి తన కూతురి పెళ్లి వేడుకలో ఆనందంతో పాదాలు కదుపుతూనే, ఆ క్షణంలోనే శాశ్వతంగా కనుమూశాడు. ఆనందం పలకరిస్తున్న వేళ, విషాదం కత్తిలా గుండెను చీల్చిన ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో జరిగింది. కూతురు కొత్త జీవితంలోకి అడుగుపెట్టే వేళ ఆ తండ్రి పడిన సంతోషం, ఆ తర్వాత ఆ కుటుంబం మింగిన కన్నీళ్లు ఏ కఠిన హృదయాన్నైనా కదిలిస్తాయి.

ఉదయ్‌పూర్ జిల్లా రిషభ్‌దేవ్ సబ్ డివిజన్‌లోని పటియార్ గ్రామానికి చెందిన శంకర్‌లాల్ మేఘ్వాల్ (51) అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తూ, కష్టపడి తన కూతురు ప్రియాంక (26) పెళ్లి కోసం కలలు కన్నారు. నవంబర్ 21న జరగాల్సిన వివాహానికి ముందు, నవంబర్ 20 రాత్రి ‘బిందోలి’ ఊరేగింపులో శంకర్‌లాల్ బంధువులతో కలిసి ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేశారు. కూతురు పెళ్లి కళ్లారా చూసి మురిసిపోవాలన్న ఆ తండ్రి ఆశ తీరకుండానే, ఛాతీలో నొప్పితో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

కుమారులు దిలీప్, ఉమేష్ ఆయన్ను హుటాహుటిన రిషభ్‌దేవ్ ఆసుపత్రికి, తర్వాత ఉదయ్‌పూర్‌లోని ఎంబీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే శంకర్‌లాల్ ప్రాణాలు విడిచారని వైద్యులు చెప్పడంతో ఆ సోదరుల లోకం కూలిపోయింది. మార్చురీలో నిశ్శబ్దంగా పడి ఉన్న తండ్రిని చూసి గుండెలవిసేలా ఏడ్చినా, మరుసటి రోజే చెల్లి పెళ్లి ఉండటంతో వారు తమ దుఃఖాన్ని లోపలే దాచుకున్నారు. తండ్రి మరణవార్త తెలిస్తే తల్లి, చెల్లి కుప్పకూలిపోతారని, పెళ్లి ఆగిపోతుందని భావించి, తండ్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని అబద్ధం చెప్పారు.

వరుడి కుటుంబానికి పరిస్థితి వివరించి, సుమారు 25 కిలోమీటర్ల దూరం నుంచి అదే రాత్రి రప్పించారు. నవంబర్ 21 తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రియాంక పెళ్లి తంతును హడావుడిగా పూర్తి చేశారు. కూతురిని అప్పగించిన తర్వాత, అదే రోజు తండ్రి శంకర్‌లాల్ అంత్యక్రియలను నిర్వహించారు. అత్తారింటికి వెళ్లిన ప్రియాంకకు తర్వాత సోదరుడు ఫోన్ చేసి అసలు నిజం చెప్పాడు. కన్నతండ్రిని కడసారి చూపు కూడా చూసుకోలేకపోయానని ప్రియాంక తీవ్ర ఆవేదన, ఆగ్రహంతో తల్లడిల్లిపోయింది. భర్త ఇక లేరన్న చేదు నిజం తెలిసి తల్లి కూడా అనారోగ్యానికి గురయ్యారు. కూతురి సంతోషం కోసం ఆ ఇద్దరు కొడుకులు పడిన వేదన, కన్నకూతురు తన తండ్రిని చివరిసారి చూడలేకపోయిన బాధ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.