Heartwarming Gesture: వీడియో ఇదిగో.. దివంగత సైనికుడి కుమార్తె పెళ్లికి సైన్యమే కుటుంబమై వచ్చింది.. రాజస్థాన్‌లో హృదయాన్ని తాకిన ఘటన..
Army Brothers Support Soldier Daughter
Heartwarming Gesture: కుమార్తె వివాహ వేడుకలో తండ్రి పక్కన లేని లోటు ఎవరికైనా తీరనిదే. అయితే విధి నిర్వహణలో అమరుడైన ఒక సైనికుడి కుమార్తె పెళ్లిలో ఆయన సహచర సైనికులే కుటుంబ సభ్యులుగా నిలిచి, తండ్రి లోటు తెలియకుండా అండగా నిలిచారు. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా హర్సోలి గ్రామంలో జరిగిన ఈ హృదయాన్ని హత్తుకునే స్ఫూర్తిదాయక ఘటన భారత సైన్యంలోని సోదరభావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
హవిల్దార్ పప్పల్ సింగ్ కుమార్తె ప్రీతి వివాహం శనివారం (నవంబర్ 21న) ఘనంగా జరిగింది. ఆయన భౌతికంగా లేకపోవడంతో ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు, పప్పల్ సింగ్ పనిచేసిన 16వ జాట్ రెజిమెంట్ అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు (JCOలు), సైనికులు ప్రత్యేకంగా హర్సోలి గ్రామానికి విచ్చేశారు. సుబేదార్ వీరేంద్ర కుమార్ ధావల్, నాయబ్ సుబేదార్ సుబే సింగ్, హవల్దార్లు సతీష్ కుమార్, సునీల్ కుమార్, నాయక్‌లు లోకేష్, సోహన్ సింగ్, అగ్నివీర్ దివాకర్ తదితరులు కేవలం మాజీ సహోద్యోగులుగా కాకుండా, సొంత కుటుంబ సభ్యుల్లా పెళ్లి పనుల్లో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా రెజిమెంట్ తరపున వివాహ ఖర్చుల నిమిత్తం రూ. 1.61 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. అంతేకాకుండా, గౌరవ, ఆప్యాయతలకు చిహ్నంగా యూనిట్ తరపున రోష్ని ధావల్, అక్కడున్న వారందరి సమక్షంలో ప్రీతి తల్లి అనితా దేవికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
సైనికుల ఈ ఆత్మీయ చర్య ప్రీతి కుటుంబాన్ని మాత్రమే కాకుండా, అక్కడికి విచ్చేసిన గ్రామస్తులు, బంధువులు, వరుడి కుటుంబ సభ్యులను సైతం తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. కష్టకాలంలో, ఇంటికి దూరంగా ఉండే సైనికుల మధ్య ఏర్పడే బంధం యుద్ధభూమికే పరిమితం కాదని, సహచరుడు దూరమైన తర్వాత కూడా ఆయన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడంలోనే నిజమైన ‘సేవా పరమో ధర్మ’ స్ఫూర్తి ఉందని 16వ జాట్ రెజిమెంట్ మరోసారి నిరూపించింది.