AI in Education: ఏఐని నిషేధిస్తే రహస్యంగా వాడతారు.. స్పష్టమైన మార్గదర్శకాలు అవసరం.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు
Surya Kant
AI in Education: న్యాయ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం ఆచరణ సాధ్యం కాదని, అది వివేకవంతమైన చర్య కూడా కాదని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. శంషాబాద్‌లోని నోవోటెల్ హోటల్లో కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (సీఎల్ఈఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ న్యాయ విద్యా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సాంకేతికతను అడ్డుకోవడానికి బదులుగా, స్పష్టమైన నిబంధనలతో నియంత్రించడం , బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించడమే సరైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.
కృత్రిమ మేధ వాడకంపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తే అది చాటుమాటుగా పెరిగిపోతుందని, దానిని పర్యవేక్షించడం మరింత కష్టమవుతుందని జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు. ముఖ్యంగా ఏఐ వినియోగాన్ని గుర్తించే డిటెక్షన్ సాఫ్ట్వేర్లను గుడ్డిగా నమ్మవద్దని ఆయన విద్యాసంస్థలకు సూచించారు. ఇంగ్లిష్ మాతృభాష కాని విద్యార్థులు సొంతంగా రాసిన వ్యాసాలను కూడా ఏఐ సృష్టించినట్లుగా ఈ సాఫ్ట్వేర్ టూల్స్ తప్పుగా గుర్తిస్తున్నాయని ఓ అధ్యయనాన్ని ఉటంకిస్తూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి లోపభూయిష్టమైన సాఫ్ట్వేర్ల వల్ల నిజాయతీపరులైన విద్యార్థులపై అన్యాయంగా మోసగాళ్లనే ముద్ర పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అలాగే, న్యాయ పరిశోధనల్లో ఏఐ టూల్స్ ఉపయోగించేటప్పుడు అవి అందించే సమాచారాన్ని యథాతథంగా స్వీకరించకుండా, ప్రతి ఆధారాన్ని క్షుణ్ణంగా సరిచూసుకోవాలని న్యాయ నిపుణులకు, విద్యార్థులకు హితవు పలికారు.
మరోవైపు, దేశంలో న్యాయ విద్యను మరింత ప్రజానుకూలంగా మార్చేందుకు జస్టిస్ సూర్యకాంత్ ఒక కీలక ప్రతిపాదన చేశారు. ప్రతి న్యాయ విద్యార్థి తన పట్టా పొందాలంటే, విద్యాభ్యాసంలో భాగంగా కనీస కాలం పాటు ఉచిత న్యాయ సహాయ సేవల్లో (లీగల్ ఎయిడ్) పాల్గొనడాన్ని తప్పనిసరి చేయాలని సూచించారు. తరగతి గదుల్లో నేర్చుకున్న న్యాయ సిద్ధాంతాలను, కోర్టు హాలులోని వాస్తవ పరిస్థితులతో అనుసంధానించడానికి ఈ అనుభవం ఎంతో దోహదపడుతుందని ఆయన వివరించారు. పేద, బడుగు వర్గాలకు న్యాయ సేవలు చేరువ చేయడంలో న్యాయ విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని గుర్తుచేశారు. ఈ అంతర్జాతీయ సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అమానుల్లా, తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ పి. సామ్ కోషి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.