AI in Banking: ఏఐ తప్పిదాలతో ఆర్థిక సంస్థలకు భారీ ముప్పు.. అప్రమత్తత అవసరమని బ్యాంకులకు ఎస్బీఐ చీఫ్ హెచ్చరిక..
SBI Chairman Challa Sreenivasulu Sett
AI in Banking: కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత పొరపాట్ల వల్ల ఆర్థిక సంస్థలకు ముప్పు పొంచి ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి హెచ్చరించారు. బ్యాంకింగ్ వ్యవస్థలన్నీ అంతర్గతంగా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నందున, ఏదైనా ఒక చోట తప్పు జరిగితే దాని ప్రభావం మిగతా వ్యవస్థలపైనా తీవ్రంగా పడుతుందని ఆయన పేర్కొన్నారు.
ముంబయిలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన శెట్టి, ఏఐ వినియోగం వల్ల ఉత్పాదకత విషయంలో భారీ ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొత్త తరహా పాలనా పరమైన ప్రమాదాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల ఆర్థిక సంస్థలు ఏఐ విషయంలో కఠిన నిబంధనలు నిర్దేశించుకోవాలని సూచించారు. ఏఐకి ఎంతవరకు అనుమతులు ఇవ్వాలి, అది ఎలాంటి సమాచారాన్ని యాక్సెస్ చేయాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి , ఏ పరిస్థితుల్లో మానవ జోక్యం తప్పనిసరి అనే విషయాలపై బ్యాంకులకు స్పష్టత ఉండాలన్నారు. స్పష్టమైన అనుమతులు, లావాదేవీ పరిమితులు, ఆడిట్ విచారణలు, మానవ పర్యవేక్షణతో పాటు స్వయంప్రతిపత్తి గల వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ నష్టభయాలను నివారించుకోవచ్చని వివరించారు.
అంతేకాకుండా, ఎటువంటి రుణ చరిత్ర (క్రెడిట్ హిస్టరీ) లేని గ్రామీణ రుణగ్రహీతలు, చిన్న వ్యాపారులను ఏఐ వ్యవస్థలు పక్కన పెట్టకుండా జాగ్రత్త వహించాలని ఆయన స్పష్టం చేశారు. నేడు ఏఐ వినియోగం వ్యక్తుల స్థాయి నుంచి కంపెనీల స్థాయికి విస్తరిస్తున్నందున పెద్ద సంస్థలకు ‘ఏఐ గవర్నెన్స్’ అత్యంత ముఖ్యమని అభిప్రాయపడ్డారు. బాధ్యతాయుతమైన ఏఐ విధానాన్ని అందిపుచ్చుకున్న తొలి బ్యాంక్ ఎస్బీఐ అని చల్లా శ్రీనివాసులు శెట్టి ఈ సందర్భంగా వెల్లడించారు.