New Bulk Drug Rules: మందుల ముడిసరుకు విక్రయాలపై నియంత్రణ.. ప్రత్యేక లైసెన్సులు తీసుకురానున్న కేంద్రం..
US Pharma Tariff
New Bulk Drug Rules: దేశీయ ఔషధ సరఫరా వ్యవస్థలో పారదర్శకతను పెంచడంతోపాటు ముడి ఔషధ పదార్థాల (బల్క్ డ్రగ్స్) పంపిణీపై నిఘాను మరింత కట్టుదిట్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బల్క్ డ్రగ్స్ హోల్‌సేల్ (టోకు) వ్యాపారానికి ప్రత్యేక లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంకల్పించింది.
ఇప్పటివరకు ట్యాబ్లెట్లు, సిరప్‌ల వంటి ఔషధ ఫార్ములేషన్లు, బల్క్ డ్రగ్స్ రెండింటి హోల్‌సేల్ విక్రయాలకు ఒకే ఉమ్మడి లైసెన్స్ విధానం అమల్లో ఉంది. అయితే, ఈ ఉమ్మడి విధానంలో ముడి ఔషధ పదార్థాల వినియోగాన్ని ప్రత్యేకంగా ట్రాక్ చేయడంలో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనాపరమైన ఇబ్బందులను అధిగమించేందుకు ‘ఔషధ నియమావళి–1945’ (Drugs Rules, 1945)కు సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్రం ముసాయిదా గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ప్రతిపాదిత కొత్త నిబంధనల ప్రకారం, భవిష్యత్తులో బల్క్ డ్రగ్స్ హోల్‌సేల్ వ్యాపారం నిర్వహించాలనుకునే సంస్థలు ప్రత్యేకంగా ‘ఫారమ్ 19-బీసీ’ (Form 19-BC) ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత నియంత్రణ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ‘ఫారమ్ 20-బీసీ’ (Form 20-BC) కింద ప్రత్యేక లైసెన్స్‌ను జారీ చేస్తారు. ఔషధాల తయారీలో అత్యంత కీలకమైన క్రియాశీల (యాక్టివ్), నిష్క్రియాత్మక బల్క్ పదార్థాల నిల్వ, రవాణా , విక్రయాలపై పూర్తిస్థాయి నియంత్రణ సాధించేందుకు ఈ మార్పు దోహదపడుతుందని కేంద్రం భావిస్తోంది. అంతేకాకుండా, బల్క్ డ్రగ్స్ విక్రయ లావాదేవీలన్నీ కేవలం అర్హత కలిగిన వ్యక్తి ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరగాలని నిబంధనల్లో స్పష్టం చేశారు. దీనివల్ల నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించడంతోపాటు సరఫరా గొలుసులో జవాబుదారీతనం పెరుగుతుంది.
కొత్త లైసెన్సింగ్ విధానంలో విక్రయించే ప్రతి బల్క్ డ్రగ్ వివరాలను లైసెన్స్‌లో స్పష్టంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ‘నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్’ (NDPS) చట్టం–1985 పరిధిలోకి వచ్చే ఔషధ పదార్థాలను ప్రత్యేకంగా గుర్తిస్తారు. తద్వారా మత్తుపదార్థాలు , మానసిక ప్రభావిత రసాయనాలు అక్రమ మార్గాల్లోకి మళ్లకుండా అడ్డుకట్ట వేయడం నియంత్రణ సంస్థలకు మరింత సులభతరం కానుంది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యానికి పెను సవాలుగా మారిన ‘యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్’ (AMR – యాంటీబయాటిక్ నిరోధకత) సమస్యను కట్టడి చేయడంలోనూ ఈ నిర్ణయం కీలక పాత్ర పోషించనుంది. యాంటీబయాటిక్ ముడి పదార్థాల అనధికారిక విక్రయాలను అరికట్టడం ద్వారా వాటి దుర్వినియోగాన్ని నియంత్రించవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.