సామాన్యుడి వంటగదిలో ఆర్థిక సంక్షోభం !
Rythu Bazar Vegetable Prices Today: రైతు బజార్లలో పడిపోయిన కూరగాయల ధరలు.. టమాటా కేజీ ఎంతంటే?
రచయిత: కాలగిరి శ్రీనివాస్ రెడ్డి
ఒకప్పుడు కుటుంబ బడ్జెట్లో కూరగాయల ధరలు పెరిగితే కొంత సర్దుబాటు చేసుకునేవారు. ఇప్పుడు బియ్యం, పప్పులు, నూనె, పాలు, కూరగాయలు, గ్యాస్, విద్యుత్.. ఏది కొనాలన్నా జేబు బరువు తగ్గిపోతోంది. నెల జీతం చేతికొచ్చిన కొద్ది రోజుల్లోనే ఖర్చుల ఖాతాలో కరిగిపోతోంది. పేద కుటుంబానికి పూట గడవడం భారమవుతుంటే, మధ్యతరగతి కుటుంబానికి పొదుపు ఒక కలగా మారుతోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2026లో దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి చేరడం, ఆహార ద్రవ్యోల్బణం 8.94 శాతంగా నమోదవడం ఆర్థిక వ్యవస్థలోని తీవ్రమైన అసమతుల్యతను బయటపెడుతోంది. ధరల పెరుగుదల అనేది కేవలం గణాంకాల సమస్య కాదు.. కోట్లాది కుటుంబాల రోజువారీ జీవన పోరాటం. ఆర్థిక వృద్ధి ఎంత గొప్పగా ఉన్నా, సామాన్యుడి కంచంలో అన్నం ఖరీదైపోతే ఆ అభివృద్ధి ఎవరి కోసం?
కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నవంబర్ 12న విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచీ గణాంకాల ప్రకారం, అక్టోబర్ 2026లో దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతంగా నమోదైంది. సెప్టెంబర్లో ఇది 5.54 శాతం. అంటే ఒక్క నెలలోనే 0.55 శాతం పాయింట్లు పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 7.74 శాతం ఉండగా, అక్టోబర్లో 8.94 శాతానికి చేరింది. ఇది 1.20 శాతం పాయింట్ల పెరుగుదల. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణ లక్ష్యం 4 శాతం; దీనికి రెండు శాతం పాయింట్ల దిగువ, ఎగువ సహన పరిమితులు ఉన్నాయి. అంటే 2 నుంచి 6 శాతం పరిధి. అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి చేరడంతో రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన గరిష్ఠ సహన పరిమితిని దాటింది. కొత్త ఆధార సంవత్సరం 2024తో రూపొందించిన ధరల సూచీ విధానంలో నమోదైన అత్యధిక స్థాయిగా ఈ గణాంకం నిలిచింది. ఈ పరిణామం ఆర్థిక విధాన నిర్ణయకర్తలకు హెచ్చరిక. ద్రవ్యోల్బణం అదుపులో ఉందని చెప్పడానికి ఒక నెలలో ధరలు తగ్గకపోయినా, ద్రవ్యోల్బణ శాతం తగ్గిందని చెప్పడం సరిపోదు. ధరల పెరుగుదల వేగం తగ్గవచ్చు.. కానీ ఇప్పటికే పెరిగిన ధరలు ప్రజల జీవితాల్లో కొనసాగుతూనే ఉంటాయి. ఈ తేడాను పాలకులు, ప్రజలు గుర్తించాలి.
ఉల్లిపాయ ధరల్లో ఉరిమే పెరుగుదల!
అక్టోబర్ నెలలో ఆహార ధరల పెరుగుదలలో కొన్ని వస్తువులు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అధికారిక గణాంకాల ప్రకారం ఉల్లిపాయల ద్రవ్యోల్బణం 116.22 శాతానికి చేరింది. సెప్టెంబర్లో ఇది 108.13 శాతం. వెల్లుల్లి ధరల ద్రవ్యోల్బణం 60.74 శాతం, అల్లం 48.32 శాతం, నిమ్మకాయలు 47.30 శాతంగా నమోదయ్యాయి. వెండి ఆభరణాల ద్రవ్యోల్బణం 52.39 శాతంగా ఉంది.
మరోవైపు బంగాళాదుంపల ధరలు 14.24 శాతం, కాలీఫ్లవర్ 10.57 శాతం, కొబ్బరి 5.60 శాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే ప్రతి ఆహార పదార్థం ధర పెరగలేదు. అయితే కొన్ని కీలక వస్తువుల ధరల్లో భారీ పెరుగుదల కుటుంబాల ఖర్చులపై అసమాన ప్రభావాన్ని చూపుతుంది. ఒక కుటుంబం రోజువారీ కొనుగోళ్లలో ఉల్లిపాయలు, వెల్లుల్లి, నిమ్మకాయలు వంటి పదార్థాలను వాడుతుంది. వాటి ధరలు రెట్టింపుకు పైగా పెరిగితే కుటుంబ బడ్జెట్లో సర్దుబాటు తప్పదు. పేద కుటుంబాలు పోషకాహారాన్ని తగ్గించుకోవాల్సి రావచ్చు. పిల్లల ఆహారం, పాలు, పండ్లు, కూరగాయల కొనుగోళ్లలో కోత పడవచ్చు. ద్రవ్యోల్బణం చివరకు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
గ్రామీణ భారతంపై అధిక ధరల భారం!
అక్టోబర్లో గ్రామీణ ద్రవ్యోల్బణం 6.63 శాతం కాగా, పట్టణ ద్రవ్యోల్బణం 5.41 శాతంగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం 9.09 శాతం, పట్టణ ప్రాంతాల్లో 8.68 శాతం. గ్రామీణ కుటుంబాలు పట్టణ కుటుంబాల కంటే అధిక ధరల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. రైతు పంట పండించినా, వ్యవసాయ కూలీ పని చేసినా, గ్రామీణ ఉపాధి పొందినా.. ఆదాయం ధరల పెరుగుదలకు అనుగుణంగా పెరుగుతుందనే హామీ లేదు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగితే రైతుకు లాభం కలుగుతుందా? వినియోగదారుడికి భారం పెరుగుతుందా? అన్నది సరఫరా గొలుసు, మధ్యవర్తులు, మార్కెట్ ధరలు, పంట దిగుబడులపై ఆధారపడి ఉంటుంది. రైతు నుంచి వినియోగదారుడి వరకు ధరల వ్యత్యాసాన్ని తగ్గించే వ్యవస్థ లేకపోతే, రైతుకు తగిన ధర దక్కకపోయినా వినియోగదారుడు అధిక ధర చెల్లించే పరిస్థితి కొనసాగుతుంది.
తెలంగాణలోనూ ధరల ఒత్తిడి తీవ్రం!
అక్టోబర్ 2026లో తెలంగాణలో మొత్తం ద్రవ్యోల్బణం 7.26 శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం 11.66 శాతం. దేశంలోని అధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ద్రవ్యోల్బణం 7.25 శాతం కాగా, ఆహార ద్రవ్యోల్బణం 13.23 శాతంగా నమోదైంది. తెలంగాణలో పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. హైదరాబాద్ వంటి నగరాల్లో అద్దెలు, రవాణా, విద్య, వైద్య ఖర్చులు కుటుంబాలపై భారంగా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత ఆదాయాలు, రోజువారీ కూలీ పనులు ధరల పెరుగుదలకు తగినట్లు పెరగకపోతే ఆర్థిక ఒత్తిడి మరింత పెరుగుతుంది. జగిత్యాల వంటి వ్యవసాయ జిల్లాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు ఈ ధరల ప్రభావాన్ని తమ కుటుంబ బడ్జెట్లో అనుభవించే అవకాశం ఉంది.
ద్రవ్యోల్బణం.. ఆదాయాల సంక్షోభం!
ద్రవ్యోల్బణాన్ని అర్థం చేసుకోవాలంటే ధరలు ఎంత పెరిగాయి అన్నదే కాకుండా, ప్రజల ఆదాయాలు ఎంత పెరిగాయి అన్నదీ చూడాలి. ఒక ఉద్యోగి జీతం ఏడాదికి 3 శాతం పెరిగి, అతను కొనుగోలు చేసే వస్తువుల ధరలు 8 శాతం పెరిగితే అతని వాస్తవ కొనుగోలు శక్తి తగ్గుతుంది. పెన్షనర్లు, స్థిర ఆదాయం ఉన్న కుటుంబాలు, అసంఘటిత రంగ కార్మికులు ఈ ఒత్తిడిని మరింత తీవ్రంగా ఎదుర్కొంటారు.
ద్రవ్యోల్బణం వల్ల పొదుపులు క్షీణిస్తాయి. చిన్న మొత్తాల పొదుపు చేసే కుటుంబాలు భవిష్యత్తు అవసరాల కోసం పెట్టే డబ్బు విలువ తగ్గుతుంది. అప్పులు తీసుకునే అవసరం పెరుగుతుంది. వడ్డీ రేట్లు పెరిగితే గృహ రుణాలు, వ్యాపార రుణాల భారం కూడా పెరగవచ్చు. ఆర్థిక వ్యవస్థలో వినియోగం తగ్గి, చిన్న వ్యాపారాల అమ్మకాలు మందగించే ప్రమాదం ఉంటుంది. ఆహార ద్రవ్యోల్బణానికి ఒక్క కారణం మాత్రమే ఉండదు. పంట దిగుబడులు తగ్గడం, వాతావరణ మార్పులు, అసమయ వర్షాలు, కరువు పరిస్థితులు, పంటలపై తెగుళ్లు, నిల్వ సదుపాయాల లోపం, రవాణా ఖర్చులు, మార్కెట్ మధ్యవర్తుల ఆధిపత్యం, సరఫరా గొలుసులో అంతరాయాలు.. ఇవన్నీ ధరలపై ప్రభావం చూపుతాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ధరల మార్పులు కూడా దేశీయ ధరలపై ప్రభావం చూపవచ్చు.
అయితే కారణాలు చెప్పడం మాత్రమే ప్రభుత్వ బాధ్యత కాదు. వాటిని ముందుగానే గుర్తించి నియంత్రించే విధానాలు అమలు చేయాలి. ఉల్లిపాయలు, పప్పులు, నూనెగింజలు వంటి కీలక వస్తువులకు తగిన నిల్వలు, సరఫరా నిర్వహణ, మార్కెట్ పర్యవేక్షణ ఉండాలి. రైతులకు పంటల వైవిధ్యం, సాగునీరు, నిల్వ సదుపాయాలు, సరైన మార్కెట్ మద్దతు కల్పించాలి. మధ్యవర్తుల అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత సృష్టించే చర్యలను నిరోధించాలి.
రిజర్వ్ బ్యాంక్ వడ్డీ విధానం మాత్రమే సరిపోతుందా?
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడం లేదా తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటుంది. కానీ ఆహార ధరల పెరుగుదల ప్రధాన కారణమైనప్పుడు వడ్డీ రేట్ల మార్పులు మాత్రమే తక్షణ పరిష్కారం కావు. రైతు పంట దిగుబడి, సరఫరా, నిల్వలు, రవాణా, మార్కెట్ వ్యవస్థలలో సమస్యలను పరిష్కరించాలి. వడ్డీ రేట్లు పెరిగితే రుణాలు ఖరీదవుతాయి. చిన్న వ్యాపారాలు, గృహ రుణగ్రహీతలు, పెట్టుబడిదారులపై ఒత్తిడి పెరుగుతుంది. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. అందువల్ల ద్రవ్య విధానం, వ్యవసాయ విధానం, ఆహార సరఫరా విధానం సమన్వయంతో పనిచేయాలి.
పాలకులకు ప్రజల వంటగదే అసలైన ఆర్థిక సూచీ!
ఆర్థిక వృద్ధి, స్థూల దేశీయోత్పత్తి, పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి గణాంకాలు దేశ పురోగతిని సూచిస్తాయి. కానీ ప్రజల జీవన ప్రమాణాలను అంచనా వేయడానికి వారి రోజువారీ ఖర్చులు, ఆదాయాలు, ఆహార భద్రత, పొదుపులు కూడా కీలకం. అభివృద్ధి ఫలితాలు ప్రజల కంచంలో కనిపించాలి. ధరల పెరుగుదల వల్ల కుటుంబాలు ఆహారం, వైద్యం, విద్యలో కోతలు విధించుకోవాల్సి వస్తే అది సమగ్ర అభివృద్ధి కాదు.
ప్రభుత్వాలు తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక పరిష్కారాలను అమలు చేయాలి. అవసరమైన వస్తువుల ధరలపై పారదర్శక సమాచారాన్ని అందించాలి. పేదలకు ఆహార భద్రతను బలోపేతం చేయాలి. రైతు ఉత్పత్తులకు సముచిత ధర, వినియోగదారులకు అందుబాటు ధర కల్పించే సమతుల్య వ్యవస్థను నిర్మించాలి. ప్రజల ఆదాయాలు పెరిగే ఉపాధి అవకాశాలను విస్తరించాలి. ద్రవ్యోల్బణం 6.09 శాతం అనేది ఒక గణాంకం మాత్రమే కాదు.. సామాన్యుడి జీవితంలో పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడికి హెచ్చరిక. ఆహార ద్రవ్యోల్బణం 8.94 శాతం అంటే వంటగదిలో ధరల మంటలు మరింత తీవ్రం అవుతున్నాయన్న సంకేతం. ప్రభుత్వాలు ధరల పెరుగుదలపై గణాంకాలు విడుదల చేయడానికే పరిమితం కాకూడదు. వాటి ప్రభావాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆదాయాలు, కొనుగోలు శక్తి, ఆహార భద్రతను కాపాడాలి. రైతు పంటకు గిట్టుబాటు ధర, వినియోగదారుడికి న్యాయమైన ధర.. ఈ రెండింటి మధ్య సమతుల్యతను ఏర్పరచాలి. ధరల పెరుగుదల ప్రజలపై దండయాత్రగా మారితే, అభివృద్ధి గణాంకాల మెరుపులు సామాన్యుడి ఆకలిని తీర్చలేవు. పాలకుల పనితీరుకు అసలైన కొలమానం స్థూల దేశీయోత్పత్తి మాత్రమే కాదు.. సామాన్యుడి ఇంటి వంటగదిలో వెలిగే పొయ్యి కూడా!