Skip to content
జాతీయం › వార్తలు

తుఫానుల బీభత్సం.. హెచ్చరికలే రక్షణ కవచం

Krishna Rao 19 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
తుఫానుల బీభత్సం.. హెచ్చరికలే రక్షణ కవచం

Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను ముప్పు.. అక్టోబర్ 27 నుంచి ఏపీలో భారీ వర్షాలు...

రచయిత: గిలకత్తుల వెంకటరమణ గౌడ్‌

ఉష్ణమండల తుఫానులు సముద్ర ప్రాంతాల్లో ఏర్పడే అత్యంత శక్తివంతమైన వాతావరణ వ్యవస్థలు. ఇవి కేవలం మేఘాల సమూహాలు మాత్రమే కావు, సముద్రపు ఉష్ణశక్తి, వాతావరణ పీడనం, తేమ, గాలుల ప్రసరణ, భూమి భ్రమణం వంటి అంశాల పరస్పర ప్రభావంతో ఏర్పడే సంక్లిష్ట ప్రక్రియలు. సాధారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 26.5 డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకంటే ఎక్కువగా ఉండటం, వాతావరణంలో అధిక తేమ, తక్కువ నిలువు గాలికోత వంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు తుఫాను అభివృద్ధి చెందుతుంది. సముద్రపు నీరు ఆవిరై పైకి చేరినప్పుడు చల్లబడి సూక్ష్మ నీటి బిందువులుగా మారుతుంది. ఈ ప్రక్రియను ఘనీభవనం అంటారు. ఘనీభవన సమయంలో విడుదలయ్యే గుప్తోష్ణం పైకి ఎగసే గాలికి శక్తినిచ్చి అల్పపీడన వ్యవస్థను బలపరుస్తుంది. అధిక పీడన ప్రాంతాల నుంచి అల్పపీడన కేంద్రంవైపు గాలి ప్రవహిస్తుంది. భూమి భ్రమణం వల్ల ఏర్పడే కొరియోలిస్‌ ప్రభావంతో ఉత్తరార్ధ గోళంలో తుఫానులు అపసవ్య దిశలో, దక్షిణార్ధ గోళంలో సవ్యదిశలో తిరుగుతాయి. భూమధ్యరేఖ వద్ద ఈ ప్రభావం దాదాపు శూన్యం కావడంతో అక్కడ సాధారణంగా తుఫానులు ఏర్పడవు. అయితే వెచ్చని సముద్రం ఒక్కటే తుఫాను ఏర్పాటుకు సరిపోదు, అనేక వాతావరణ పరిస్థితులు అనుకూలించాలి.

తుఫాను నిర్మాణం తీరాలపై ప్రభావం:

తుఫాను నిర్మాణంలో ప్రధానంగా మూడు భాగాలుంటాయి. కన్ను, కన్నుగోడ, వర్షపు పట్టీలు. మధ్యలో ఉండే కన్నులో గాలి సాధారణంగా ప్రశాంతంగా ఉంటుంది. దాని చుట్టూ ఉండే కన్నుగోడలో అత్యంత బలమైన గాలులు, ఉరుములతో కూడిన మేఘాలు, భారీ వర్షాలు ఉంటాయి. బయటివైపు విస్తరించే వర్షపు పట్టీల వల్ల కేంద్రానికి వందల కిలోమీటర్ల దూరంలో కూడా వర్షాలు కురవవచ్చు. తుఫాను తీవ్రతను కన్ను పరిమాణం ఆధారంగా కాకుండా గరిష్ఠమైన స్థిర గాలి వేగం, కేంద్ర పీడనం, వర్షపాతం, గాలుల విస్తీర్ణం వంటి అంశాలతో అంచనా వేస్తారు. తుఫాను ప్రయాణ దిశను దాని చుట్టూ ఉన్న పెద్ద వాతావరణ గాలులు, అధిక పీడన వ్యవస్థలు నిర్ణయిస్తాయి. భారతదేశానికి తుఫానులు ప్రధానంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి వస్తాయి. ఏప్రిల్‌, మే, అక్టోబర్‌ నెలల్లో వీటి కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి. తీరాన్ని దాటిన తర్వాత సముద్రం నుంచి తేమ, ఉష్ణశక్తి సరఫరా తగ్గడం, భూమిపై ఘర్షణ పెరగడం వల్ల తుఫాను బలహీనపడుతుంది. అయినప్పటికీ దానిలో మిగిలిన తేమ, వర్షపు పట్టీల కారణంగా సుదూర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయి. 2023 మిచౌంగ్‌ తుఫాను బాపట్ల సమీపంలో తీరం దాటిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ వర్షాలు కురవడం ఇందుకు ఉదాహరణ.

చరిత్రలో తుఫానుల బీభత్సం

భారతదేశ చరిత్రలో అనేక మహా తుఫానులు తీరని విషాదాన్ని మిగిల్చాయి. 1977 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని దివిసీమను తాకిన మహా తుఫాను (ఉప్పెన) దేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన ప్రకృతి విపత్తుల్లో ఒకటి. భారీ గాలులు, సముద్రపు నీటి ఉద్ధృతి కారణంగా అనేక గ్రామాలు నీట మునిగాయి. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. 2014 అక్టోబర్‌ 12న విశాఖపట్నాన్ని తాకిన ‘హుద్‌హుద్‌’ తుఫాను గంటకు సుమారు 170 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో ఉత్తరాంధ్రను తీవ్రంగా దెబ్బతీసింది. వేలాది చెట్లు నేలకొరిగాయి. విద్యుత్‌, రవాణా వ్యవస్థలు, ఇళ్లు, వ్యవసాయ పంటలు నష్టపోయాయి. తమిళనాడులో 2016 డిసెంబర్‌లో వచ్చిన ‘వర్దా’ తుఫాను చెన్నై పరిసర ప్రాంతాల్లో చెట్లను కూల్చి విద్యుత్‌ సరఫరాను దెబ్బతీసింది. 2018 నవంబర్‌లో వచ్చిన ‘గజ’ తుఫాను నాగపట్నం, తంజావూరు, తిరువాయూర్‌ జిల్లాల్లో కొబ్బరి తోటలు, వ్యవసాయ భూములను తీవ్రంగా నాశనం చేసింది. 2015లో చెన్నైలో సంభవించిన భారీ వరదలు కూడా మరో విషాద అధ్యాయం. అవి ఒకే తుఫాను వల్ల కాకుండా ఈశాన్య రుతుపవనాల అసాధారణ వర్షాలు, జలాశయాల నీటి నిర్వహణ, పట్టణాల్లో వర్షపు నీటి పారుదల లోపాలు వంటి అనేక కారణాల సమ్మిళిత ఫలితం. ఈ సంఘటనలు ప్రకృతి విపత్తులతో పాటు పట్టణ ప్రణాళిక, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తున్నాయి.

తుఫానులు సముద్రపు నీటిని బలమైన గాలులచే తీరానికి నెట్టడం వల్ల సముద్రమట్టం తాత్కాలికంగా పెరిగి తీర ప్రాంతాల్లోకి నీరు చొచ్చుకొని రావడాన్ని స్టార్మ్‌ సర్జ్‌ అంటారు. దీనివలన తీర ప్రాంత గ్రామాలు, వ్యవసాయ భూములు, నివాస ప్రాంతాలకు తీవ్ర ముప్పు కలిగిస్తుంది. నదులు, వాగులు పొంగిపొర్లడం, కొండచరియలు విరిగిపడటం, తోటలు, చేతికి అందివస్తున్న పంటలు నాశనం కావడం, ప్రజలు నిరాశ్రయులు కావడం వంటివి సంభవిస్తాయి. భారత వాతావరణ శాఖ ఉపగ్రహాలు, రాడార్లు, సముద్రపు బాయ్‌లు, కంప్యూటర్‌ ఆధారిత నమూనాల సహాయంతో తుఫానుల వేగం, దిశ, తీవ్రత, వర్షపాతాన్ని అంచనావేసి హెచ్చరికలు జారీచేస్తుంది. ప్రజలు అధికారిక హెచ్చరికలను ఖచ్చితంగా పాటించాలి. అవసరమైనప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి. పునరావాస కార్యక్రమాలు, పంట బీమా పథకాల ద్వారా బాధితులను ఆదుకోవాలి. ముఖ్యంగా తుఫాను కన్నులో తాత్కాలిక ప్రశాంతత కనిపించినా ప్రమాదం ముగిసిందని భావించకూడదు. కన్నుగోడ మరోవైపు నుంచి మళ్లీ తీవ్రమైన గాలులు వీచవచ్చు. ప్రకృతిని పూర్తిగా నియంత్రించడం మానవుడి చేతిలో లేకపోయినా శాస్త్రీయ అవగాహన, ముందస్తు హెచ్చరికలు, సమర్థవంతమైన విపత్తు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను, మానవ విషాదాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. అదే ఆధునిక సమాజం సాధించాల్సిన నిజమైన విజయం.