Skip to content
ప్రపంచం › వార్తలు

US-Iran Escalation: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు..

jagan 19 Nov 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
US-Iran Escalation: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు..

US-Iran Tensions Rise: మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ దాడులకు అమెరికా ప్రతీకార దాడులు.. ఒక్కసారిగా పెరిగిన చమురు ధరలు..

US-Iran Escalation: పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో ఆ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్ బుధవారం తన దాడులను పొరుగు గల్ఫ్ దేశాలకు విస్తరించింది. కువైట్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై కాల్పులు జరిపిన ఇరాన్ సైన్యం, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక కేంద్రాలపైనా పలుమార్లు దాడులకు తెగబడింది. అయితే ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ దాడులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని కువైట్ సైన్యం ప్రకటించింది. తమ దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు, స్థిరత్వానికి ముప్పుగా మారిన ఇరాన్ దాడులను ‘నేరపూరితమైనవి’గా కువైట్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.

కువైట్‌లోని ‘అలీ అల్ సలేం’ (Ali Al Salem) వైమానిక స్థావరంపై బుధవారం తెల్లవారుజామున ఇరాన్ మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో అమెరికాకు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్ , క్షిపణి ప్రయోగ వేదికలను తమ సైన్యం లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ వెల్లడించింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత, ఇటీవల కొద్ది రోజులుగా బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలనే ఇరాన్ పదేపదే లక్ష్యంగా చేసుకుంటోంది. పర్షియన్ గల్ఫ్‌లోని చిన్న ద్వీప రాజ్యమైన బహ్రెయిన్‌లో అమెరికాకు చెందిన అత్యంత కీలకమైన 5వ నౌకాదళం (5th Fleet) ప్రధాన కార్యాలయం ఉంది.

మంగళవారం నాడు హొర్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో ఉన్న ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ క్షిపణి ప్రయోగ కేంద్రంపై అమెరికా యుద్ధ విమానం దాడి చేసిన తర్వాతే ఇరాన్ ఈ ప్రతీకార దాడులకు దిగింది. అంతకుముందు బహ్రెయిన్‌లోని అమెరికా రాడార్ కేంద్రంపై ఇరాన్ దాడి చేయడంతో, దానికి బదులుగానే అమెరికా ఖేష్మ్ ద్వీపంపై దాడి చేసినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో అమెరికా సైనికులెవరూ గాయపడలేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసినప్పటికీ, బహ్రెయిన్‌లోని అమెరికన్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అక్కడి యూఎస్ రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది.

మరోవైపు, ఇరాన్‌తో సాగుతున్న ఈ యుద్ధంలో అమెరికా ఆయుధ నిల్వల కొరతపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్‌పై దాడుల్లో గడువు ముగిసిన (ఎక్స్‌పైర్ అయిన) ‘తొమహాక్’ (Tomahawk) క్రూయిజ్ క్షిపణులు సహా వినియోగానికి పనికిరానివిగా గుర్తించిన మందుగుండు సామగ్రిని అమెరికా నావికా దళం వాడినట్లు ఆ విభాగం తాత్కాలిక కార్యదర్శి హంగ్ కావో (Hung Cao) వెల్లడించారు. తన నియామక ఆమోద విచారణ కోసం మంగళవారం (నవంబర్ 17న) అమెరికా సెనేట్ సాయుధ సేవల కమిటీ ఎదుట హాజరైన కావో ఈ వివరాలను ధృవీకరించారు. సాధారణంగా ‘కోడ్ ఎకో’, ‘కోడ్ ఫాక్స్‌ట్రాట్’ కింద వినియోగానికి పనికిరానివిగా వర్గీకరించిన పాత మందుగుండు సామగ్రిని నావికా దళం తీసుకుని, వాటి ఆపరేషన్ కోడ్‌లను మార్చి (రీకోడ్ చేసి) మళ్లీ ప్రయోగించిందని ఆయన తెలిపారు. ఎండిపోయిన రొట్టెపై కొద్దిగా నీళ్లు చిలకరించి మైక్రోవేవ్‌లో పెట్టి వేడి చేసి వాడుకున్నట్లుగానే, ఈ పాత క్షిపణులను పునరుద్ధరించి వాడామని ఆయన పోల్చడం గమనార్హం.

ఈ ఏడాది ప్రారంభమైన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury)లో ఈ కాలం చెల్లిన క్షిపణులను పెద్ద ఎత్తున వినియోగించినట్లు కావో పేర్కొన్నారు. ఇరాన్‌తో యుద్ధం మొదలైన మొదటి నాలుగు వారాల్లోనే అమెరికా సైన్యం 850కు పైగా తొమహాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. యుద్ధ చర్యలకు తాత్కాలిక విరామం ఇచ్చిన నాటికి వెయ్యికి పైగా తొమహాక్ క్షిపణులు ఖర్చయ్యాయని ఏప్రిల్ 21న ‘సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’ (CSIS) అంచనా వేసింది. ఒక్కో తొమహాక్ క్షిపణి ధర సుమారు 3.6 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.30 కోట్లు) వరకు ఉండటం, వాటి తయారీకి రెండేళ్ల వరకు సుదీర్ఘ సమయం పట్టడం వల్ల ఈ స్థాయిలో ఆయుధాలను వినియోగించడంపై రక్షణ రంగ పరిశీలకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత క్షిపణులపై ఆధారపడాల్సి రావడం అమెరికా వద్ద కచ్చితమైన దాడులకు ఉపయోగించే ఆధునిక ఆయుధ నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయనడానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.