Bird Flu Vaccine: పౌల్ట్రీ రంగానికి శుభవార్త.. దేశంలోనే మొదటిసారిగా బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్.. ICAR-NIHSAD శాస్త్రవేత్తల ఘనత..
Bird Flu
Bird Flu Vaccine: కోళ్ల పరిశ్రమను నిత్యం భయపెట్టే ప్రాణాంతక బర్డ్‌ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుయెంజా) వైరస్‌ను సమర్థవంతంగా అడ్డుకునేందుకు భారతదేశం చారిత్రక విజయాన్ని సాధించింది. దేశంలోనే మొట్టమొదటి పూర్తి స్వదేశీ హెచ్5ఎన్1 (క్లేడ్ 2.3.2.1ఎ) బర్డ్‌ఫ్లూ టీకాను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నవంబర్ 20వ తేదీన జాతికి అంకితం చేయనున్నారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ‘ఐసీఏఆర్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్’ (ICAR-NIHSAD) శాస్త్రవేత్తలు ఈ ఇన్‌యాక్టివేటెడ్ (Inactivated) టీకాను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం మన దేశంలో పౌల్ట్రీ రంగాన్ని కుదిపేస్తున్న క్లేడ్ 2.3.2.1ఎ (Clade 2.3.2.1a) రకం హెచ్5ఎన్1 వైరస్‌పై కచ్చితత్వంతో పనిచేసే తొలి స్వదేశీ వాణిజ్య టీకా ఇదే కావడం విశేషం. ఒక్క డోసు వేస్తే కోళ్లకు సుమారు ఆరు నెలల పాటు రోగనిరోధక శక్తిని అందించే ఈ వ్యాక్సిన్ ముఖ్యంగా లేయర్, బ్రీడర్ కోళ్లకు ఎంతో ప్రయోజనకరంగా నిలవనుంది.
కోళ్ల పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (HPAI) బారిన పడ్డ పక్షుల్లో దాదాపు 100 శాతం మరణాలు సంభవిస్తాయి. వ్యాధి ఇతర ఫారాలకు విస్తరించకుండా అడ్డుకునేందుకు లక్షలాది కోళ్లను చంపాల్సి (కల్లింగ్) రావడంతో పౌల్ట్రీ రైతులు ఆర్థికంగా కోలుకోలేని విధంగా నష్టపోతున్నారు. 2006లో భారత్‌లో ఈ వ్యాధి తొలిసారి వెలుగుచూసిన నాటి నుంచి ఇప్పటివరకు హెచ్5ఎన్1, హెచ్5ఎన్8 రకాలకు సంబంధించి 500 కంటే ఎక్కువ వ్యాప్తి ఘటనలు నమోదయ్యాయి. ఒక్క 2006 నాటి వ్యాప్తి వల్లే దేశంలో రూ.2,200 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల మేర ప్రత్యక్ష, పరోక్ష ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోనూ బర్డ్‌ఫ్లూ కేసులు కలకలం రేపాయి. ఈ మహమ్మారి అదుపు తప్పితే దేశ జీడీపీ వృద్ధి రేటు 1.5 శాతం వరకు పడిపోయే ప్రమాదంతో పాటు, దేశంలోని 20 శాతానికి పైగా పౌల్ట్రీ జనాభా పెను ప్రమాదంలో పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బర్డ్‌ఫ్లూ కేవలం కోళ్లకే పరిమితం కాకుండా మానవ ఆరోగ్యానికి కూడా తీవ్ర ముప్పుగా పరిణమిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం 2003 నుంచి ఇప్పటివరకు భారత్ సహా 25 దేశాల్లో 1,003 మానవ హెచ్5ఎన్1 కేసులు నమోదు కాగా, అందులో 479 మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో నమోదయ్యే కేసుల్లో అత్యధికం క్లేడ్ 2.3.2.1ఎ స్ట్రెయిన్ వల్లే వస్తున్నట్లు శాస్త్రీయ అధ్యయనాలు తేల్చాయి.
ఇటీవలి కాలంలో ఈ వైరస్ స్ట్రెయిన్ ఇతర జంతువులు, క్షీరదాలకు సైతం సోకుతుండటంతో పాటు ముగ్గురు మనుషుల్లోనూ కనిపించడం ఆందోళన కలిగించింది. ఇప్పటివరకు ఈ ప్రత్యేక స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేందుకు మార్కెట్లో నిర్దిష్ట వాణిజ్య టీకా అందుబాటులో లేదు. ఇప్పుడు నిహ్సాడ్ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ స్వదేశీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో విదేశీ టీకాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గడమే కాకుండా, దేశీయ పౌల్ట్రీ రంగానికి , రైతుల జీవనోపాధికి భారీ ఊరట లభించనుంది.