Lateef Bhat: కుల్గాం ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ భట్ హతం.. రెండు రోజుల క్రితమే అతడి సహచరుడు ఉమర్ నిసార్ మృతి..
Indian Army
Lateef Bhat: జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదులపై విరుచుకుపడ్డాయి. బుధవారం (నవంబర్ 18) ఉదయం జరిగిన భీకర ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా (LeT) కమాండర్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ భట్ (Lateef Bhat) హతమయ్యాడు. ఎన్కౌంటర్ ముగిసిన అనంతరం ఘటనా స్థలంలో అతని మృతదేహాన్ని బలగాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి.
కశ్మీర్ లోయలో సజీవంగా ఉన్న అత్యంత కీలకమైన స్థానిక ఉగ్రవాదుల్లో లతీఫ్ భట్ ఒకడని, అతని హతంతో ఉగ్రవాద నెట్‌వర్క్‌కు కోలుకోలేని దెబ్బ తగిలిందని భద్రతా వర్గాలు వెల్లడించాయి. కాగా, ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు నక్కి ఉన్నారేమోనన్న అనుమానంతో భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆపరేషన్ పూర్తి వివరాలు, తుది నివేదికను ఆర్మీ వర్గాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నాయి.
కుల్గాం జిల్లాలోని జంగల్పురా గ్రామంలో ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. అంతకుముందు ఎన్కౌంటర్ స్థలం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన లతీఫ్ భట్‌ను బలగాలు వెంబడించగా, అతను గ్రామంలోని ఒక మసీదులో తలదాచుకున్నాడు. ఆపరేషన్ సమయంలో ప్రాణనష్టం నివారించేందుకు, అతడిని ప్రాణాలతో పట్టుకునేందుకు భద్రతా బలగాలు వీడియో కాల్ ద్వారా లతీఫ్ భట్‌తో మాట్లాడాయి.
ఆయుధాలను వీడి లొంగిపోవాలని బలగాలు కోరుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, లొంగిపోయేందుకు భట్ ససేమిరా నిరాకరించి బలగాలపై కాల్పులకు తెగబడ్డాడు. మరోవైపు, మతపరమైన ప్రదేశం కావడంతో మసీదులో ఉదయం ప్రార్థనలు ప్రశాంతంగా ముగిసే వరకు వేచి చూసిన భద్రతా దళాలు, ఆ తర్వాతే ఆపరేషన్ ప్రారంభించాయి. మసీదు కట్టడానికి ఎటువంటి నష్టం (డ్యామేజ్) కలగకుండా అత్యంత చాకచక్యంగా వ్యవహరించి లతీఫ్ భట్‌ను మట్టుబెట్టడం విశేషం.
ఈ నెల 11వ తేదీన కుల్గాంలో సీఆర్పీఎఫ్ (CRPF) పోస్టుపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో లతీఫ్ భట్, మరో ఉగ్రవాది ఉమర్ నిసార్ దార్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF)లో ఉమర్ నిసార్ దార్ ఇటీవలే చేరాడు. గడిచిన ఆరు నెలలుగా కమాండర్ లతీఫ్ భట్‌కు దార్ స్థానికంగా ఆశ్రయం (షెల్టర్) కల్పిస్తూ ఉగ్ర కార్యకలాపాలకు సహకరిస్తున్నాడు. కాగా, సోమవారం జరిగిన మరో ఎన్కౌంటర్లో భద్రతా బలగాల కాల్పుల్లో ఉమర్ నిసార్ దార్ హతమవగా, ఇప్పుడు అతనికి నాయకత్వం వహిస్తున్న లతీఫ్ భట్ సైతం మట్టుబెట్టబడటంతో సీఆర్పీఎఫ్ పోస్టుపై దాడి చేసిన ఉగ్రవాదుల కథ ముగిసినట్లయింది.