Historic Summit: ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ తొలిసారి ముఖాముఖి భేటీ.. చైనాలో చారిత్రాత్మక త్రైపాక్షిక సమావేశం
Trump and putin and jinping
Historic Summit: ప్రపంచ రాజకీయ, దౌత్య వర్గాల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తూ అగ్రరాజ్యాధినేతలు ఒకే వేదికపైకి రానున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా ముఖాముఖి త్రైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా నవంబర్ 19న చైనాలోని షెన్జెన్ నగరంలో జరగనున్న ఈ భేటీ చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగినదని చైనా విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది.
ప్రపంచ శాంతి పరిరక్షణ, అగ్రరాజ్యాల మధ్య వ్యూహాత్మక స్థిరత్వం వంటి కీలక అంశాలపై ముగ్గురు నేతలు చర్చించనున్నట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో ఎదురవుతున్న సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడంలో ఈ మూడు దేశాలకు కీలక బాధ్యత ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే, ఈ సమావేశానికి సంబంధించిన పూర్తిస్థాయి అధికారిక అజెండాను మాత్రం చైనా ఇంకా వెల్లడించలేదు.
ఈ చారిత్రాత్మక భేటీలో అణ్వాయుధ నియంత్రణ ప్రధాన అజెండాగా నిలిచే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల నిల్వలను తగ్గించే అంశంపై ట్రంప్ చర్చించనున్నట్లు వైట్‌హౌస్ ఇప్పటికే స్పష్టం చేసింది. అమెరికా, రష్యా మధ్య చివరిగా మిగిలిన కీలక అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం ‘న్యూ స్టార్ట్’ (New START) 2026 ఫిబ్రవరిలో ముగిసిపోవడంతో, అణు నిరాయుధీకరణపై చర్చలకు ప్రాధాన్యత పెరిగింది. తక్షణమే నిర్దిష్ట ఒప్పందాలు కుదరకపోయినా, భవిష్యత్ చర్చలకు ఈ భేటీ ఒక కొత్త మార్గాన్ని చూపుతుందని వాషింగ్టన్ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు, ఈ సమావేశంలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఉత్తర కొరియా పరిణామాలు , కృత్రిమ మేధ (AI) వంటి అంతర్జాతీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం వల్ల తలెత్తుతున్న భౌగోళిక రాజకీయ, ఆర్థిక పరిణామాలను ట్రంప్ ప్రస్తావించే వీలుండగా, ఉక్రెయిన్ అంశంపై అమెరికా-రష్యా మధ్య వేరే దౌత్య మార్గంలో చర్చలు జరుగుతున్నాయని అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మొత్తానికి మూడు అగ్రరాజ్యాల అధినేతల తొలి కలయిక అంతర్జాతీయ శాంతి, అణ్వాయుధ నియంత్రణ దిశగా కీలక ముందడుగు అవుతుందని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.