Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

వచ్చేవారం అసాధారణమైన అగ్రనాయక సంభాషణలు

Prajapaksham 11 Nov 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
వచ్చేవారం అసాధారణమైన అగ్రనాయక సంభాషణలు

Trump and Putin and xi jinping

దక్షిణ చైనాలోని షెన్‌జెన్‌ నగరంలో వచ్చేవారం జరిగే ఆసియా సహకార (ఎపిఇసి) సంస్థ ఆర్థికమంత్రుల సమావేశం (నవంబర్‌ 18,19) దాని నిర్ణీత ఎజండాను మించి అసాధారణ ప్రాముఖ్యత సంతరించుకుంది. అగ్రరాజ్యాలుగా ప్రపంచ గతిని నిర్దేశిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, చైనా ప్రజా రిపబ్లిక్‌ అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌, రష్యన్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు వ్లదీమిర్‌ ఫుతిన్‌ ఈ సందర్భంగా ద్వైపాక్షికంగా, త్రైపాక్షికంగా సంభాషణలు జరిపే అవకాశముంది. ఇవి అగ్రనాయకుల మర్యాదపూర్వక సమావేశాలు కావు. నాలుగేళ్లు దాటి ఐదవ సంవత్సరంలో ప్రవేశించిన రష్యా యుద్ధం, ఇరాన్‌ యుద్ధం, ఆర్థిక సహకారం వంటి ప్రపంచ వ్యాప్త ప్రభావవంతమైన అంశాలు చర్చకు రానున్నట్లు ఊహాగానాలు. అటువంటి సమావేశం అవకాశంపై తాము ఇతర పక్షాలతో మాట్లాడుతున్నట్లు చైనా అధికారులు చెప్పారు. రష్యా ఒప్పందం, ఇరాన్‌ సమస్య, అణ్వాయుధ నియంత్రణ ఎజండాలో ఉంటాయ ని అధ్యక్షుడు ట్రంప్‌ ఆదివారం సూచనప్రాయంగా చెప్పారు. అధ్యక్షుడు ఫుతిన్‌, అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఒక సమావేశం ఉంటుంది అది చాలా ఆసక్తిదాయకంగా ఉంటుందన్నారు. అణ్వస్త్రాల తొలగింపు (ఇరాన్‌ గురించిన ప్రస్తావన కావచ్చు), ఇరాన్‌లో యుద్ధం తదితర అనేక విషయాలు చర్చిస్తాం అని ట్రంప్‌ పొడిపొడి మాటల్లో చెప్పారు. ‘ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ తీశాం. ద్రవ్యోల్బణం విపరీతంగా ఉంది. వారు ఒత్తిడిలో ఉన్నారు. వారు మంచి ఒప్పందం చేసుకోకపోతే మళ్లీ దాడి చేస్తాం’ అని గాంభీర్యం ప్రకటించారు. మధ్యంతర ఎన్నికల్లో తమ ఓటమికి కారణాల్లో ఒకటి ఇరాన్‌ యుద్ధం అంటూనే బెదిరింపు మనస్తత్వం మానలేదు.
ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో తమ ప్రాణమిత్రుడు బెంజిమన్‌ నెతన్యాహు కూటమి పరాజయం, త్రిశంకు పార్లమెంటులో మెజారిటీ సాధనకు ప్రయత్నించాల్సిందిగా ప్రతిపక్ష నాయకుడు ఐసన్‌కోట్‌కు అధ్యక్షుడు ఐజాక్‌ హెర్గోజ్‌ ఆహ్వానం, అమెరికన్‌ కాంగ్రెస్‌లో తన సొంత రిపబ్లికన్‌ పార్టీ మెజారిటీ కోల్పోయి డెమొక్రాట్లకు అధికారం అందించిన (కొత్త కాంగ్రెస్‌ జనవరి 3న ప్రమాణ స్వీకారం చేస్తుంది) నేపథ్యంలో ట్రంప్‌ తమ అధ్యక్ష అధికారాలను ఎలా ఉపయోగిస్తారోనని ప్రపంచదేశాలు ఆసక్తిగా వేచిచూస్తున్న నేపథ్యంలో ట్రంప్‌ ఎపిఇసి సమావేశానికై చైనా వస్తున్నారు. చైనా అధ్యక్షునితో వచ్చేవారం ట్రంప్‌ సమావేశం ఈ సంవత్సరంలో మూడవది కానుంది. దిగుమతి సుంకాలు విపరీతంగా పెంపుచేసి చైనాను ఆర్థికంగా దెబ్బతీయటానికి ట్రంప్‌ చేసిన ప్రయత్నాలను కమ్యూనిస్టు చైనా ఎదురుసుంకాలతో తిప్పికొట్టిన పూర్వరంగంలో ఈ సంవత్సరం మే నెలలో ట్రంప్‌ చైనాలో అధికారిక పర్యటన జరిపారు. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ సెప్టెంబర్‌లో వాషింగ్టన్‌ సందర్శించారు. ఉక్రేన్‌ యుద్ధం పట్ల ట్రంప్‌ వైఖరి రష్యా, చైనాలను మరింత సన్నిహితం చేసింది.
హార్ముజ్‌ జలసంధిపై ఇరాన్‌ పట్టును తొలగించి తమ ఆధిపత్యం నెలకొల్పేందుకు, ఇరాన్‌ ఆయిలు రేవులను తమ యుద్ధనౌకలతో దిగ్బంధించి దాన్ని ఆర్థికంగా దెబ్బతీసి తమ దారికి తెచ్చుకునేందుకు ట్రంప్‌ పన్నాగాలన్నీ నిష్ఫలమైనాక, ఇరాన్‌ అణు కార్యక్రమం విషయంలో కొన్ని రాయితీలు సాధించి యుద్ధం ముగించాలని ట్రంప్‌ కోరుకుంటున్నాడు. లోగడ పాకిస్థాన్‌, ఖటార్‌, టుర్కియే (టర్కీ) మధ్యవర్తులుగా సాధించిన పోరాట విరమణ, చర్చల ఎజండాను అమెరికా ఉల్లంఘించగా, ప్రస్తుతం ఖటార్‌ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేస్తోంది. ఖటార్‌ ప్రధానమంత్రి షేక్‌ మహమ్మద్‌ బిన్‌ అబ్దుల్హ్మ్రాన్‌ అల్‌ థని
సోమవారం వాషింగ్టన్‌లో ట్రంప్‌తో చర్చలు జరిపారు.
ఇరాన్‌కు అణుబాంబు లేకుండా చేయటం తన లక్ష్యంగా ప్రకటించిన ట్రంప్‌ ఈ విషయంలో షెన్‌ జెన్‌ సంభాషణల్లో చైనా సహకారం కోరే
అవకాశముంది. ఇరాన్‌ అందుకు అంగీకరించాలంటే ఇరాన్‌ షరతులను ట్రంప్‌ అంగీకరించాల్సి ఉంటుంది. రష్యా, చైనాల సహకారంతో ఇరాన్‌ యుద్ధం
ముగించటం ట్రంప్‌ ఉద్దేశంగా కనిపిస్తున్నది. ఏదో పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని ప్రతిబింబిస్తూ ఆయిలు మార్కెట్‌ క్రూడ్‌ రేట్లు తగ్గించింది. స్టాక్‌
మార్కెట్లలో ఆయిలు కంపెనీల షేర్లు పుంజుకున్నాయి. డాలర్‌ మారక విలువ స్వల్పంగా తగ్గింది.
ఉక్రేన్‌ యుద్ధం ముగింపజేసేందుకు పలుమార్లు ప్రతిపాదనలు చేసిన ట్రంప్‌ ప్రతిసారీ యూరోపియన్‌ యూనియన్‌ ఒత్తిడికి తలొగ్గి వెనకడుగువేస్తూ వచ్చారు. ఇప్పుడు మధ్యంతర ఎన్నికల్లో ఎదురుదెబ్బ తదుపరి ట్రంప్‌ మరోసారి సీరియస్‌గా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు తెలుపుతున్నాయి. యూరప్‌ భద్రత ఒప్పందం రష్యాకోణం నుంచి ప్రధాన అంశమైనందున ట్రంప్‌ ఈ విషయంలో కూడా చైనా సహకారం కోరుతున్నాడు. మరోవైపున, ఉక్రేన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ యూరప్‌ నేతలతో సంభాషిస్తూ చర్చల బల్లవద్ద తమకు స్థానం కావాలంటున్నారు. యూరప్‌ నేతలు, ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్‌ నేతలు కూడా తమ భాగస్వామ్యం లేకుండా యూరప్‌ భద్రత ఒప్పందం కూడదని ట్రంప్‌ని హెచ్చరిస్తున్నారు. ఏమైనా ఉక్రేన్‌ యుద్ధం కూడా ఎజండాలోకి వచ్చింది. అందువల్ల షెన్‌జెన్‌లో ట్రంప్‌ సంభాషణలకు అసాధారణ ప్రాముఖ్యత ఉంది.

ట్యాగ్‌లు: China editorial putin Trump