Global Warming Intensifies: భానుడి భగభగలు.. ప్రపంచాన్ని వణికిస్తున్న గ్లోబల్ వార్మింగ్.. చరిత్రలోనే అత్యంత వేడి నమోదైన 4 సంవత్సరాల్లో ఒకటిగా 2026..
Super El Niño Warning: 2027 Could Rewrite Earth's Heat Records
Global Warming Intensifies: ప్రపంచ మానవాళి చరిత్రలోనే అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన నాలుగు సంవత్సరాలలో ఒకటిగా 2026 నిలవనుందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) బాంబు పేల్చింది. ఇప్పటికే తీవ్ర ఉష్ణోగ్రతలతో రికార్డు సృష్టించిన 2023, 2024, 2025 సంవత్సరాల సరసన 2026 కూడా చేరనుందని సంచలన నివేదికను విడుదల చేసింది.
ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు నమోదైన ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందు నాటి (1850–1900) స్థాయితో పోలిస్తే ఏకంగా 1.47 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు 2023, 2025 లలో నమోదైన పూర్తి ఏడాది సగటు ఉష్ణోగ్రతల కంటే ఎక్కువ కావడం గమనార్హం. కేవలం అత్యంత వేడి సంవత్సరంగా చరిత్రకెక్కిన 2024తో పోలిస్తే మాత్రమే ఇవి కొంత తక్కువగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.
సంవత్సరం ప్రారంభంలో ఏర్పడిన లా నినా (La Niña) వాతావరణ పరిస్థితులు తాత్కాలికంగా ప్రపంచ ఉష్ణోగ్రతలను 0.1 నుంచి 0.2 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించినప్పటికీ, జూన్ నాటికి అనూహ్యంగా ఎల్ నినో (El Niño) ప్రవేశించడంతో పరిస్థితి తలకిందులైంది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు తీవ్రంగా వేడెక్కడం వల్ల ఆగస్టు చివరి నాటికి ఎల్ నినో తీవ్రత మరింత పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాల సమయంలో భారతదేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు కరువు పరిస్థితులను ప్రకటించి నీటి సంరక్షణ చర్యలకు దిగాల్సి వచ్చింది.
ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఎల్ నినో రికార్డుల్లోనే అత్యంత బలమైన వాటిలో ఒకటిగా మారే అవకాశముందని, సముద్రం నుంచి విడుదలయ్యే తీవ్ర వేడి 2027 ఆరంభం వరకు అధిక ఉష్ణోగ్రతలు , దారుణమైన వాతావరణ పరిస్థితులకు కారణమవుతుందని WMO ప్రధాన కార్యదర్శి సెలెస్టే సౌలో హెచ్చరించారు.
భారతదేశంలో ఈ ఏడాది నమోదైన ప్రాణాంతక వడగాలులను తీవ్ర వాతావరణ పరిణామంగా WMO గుర్తించింది. ఏప్రిల్ 2026లో సంభవించిన తీవ్ర వడగాలుల మూలంగా దేశంలో సుమారు 14.65 కోట్ల మంది తీవ్ర వేడిమికి గురయ్యారని నివేదిక వెల్లడించింది. ఎల్ నినో ప్రభావం వల్ల 2026 పూర్తి ఏడాది సగటు ఉష్ణోగ్రత మరింత పెరిగే సూచనలు ఉన్నాయని తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న ఇటువంటి ప్రాణాంతక పరిస్థితులు ప్రజారోగ్యం, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతూ ఆహార భద్రతను దెబ్బతీస్తున్నాయని, పేదరికాన్ని , వలసలను మరింత పెంచుతున్నాయని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. రాబోయే 2027 వరకు ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో సంభవించే తీవ్ర మార్పులపై ప్రపంచ దేశాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది.