Skip to content
జాతీయం › వార్తలు

Diwali Effect: దీపావళి తర్వాత ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. విషపూరిత పొగతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు..

jagan 09 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Diwali Effect: దీపావళి తర్వాత ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. విషపూరిత పొగతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు..

Delhi Pollution

Diwali Effect: దీపావళి పండుగ ముగిసిన అనంతరం దేశ రాజధాని ఢిల్లీని తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం ఆవరించింది. ఆదివారం రాత్రి ప్రజలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడం, వాతావరణ పరిస్థితుల ప్రతికూలత కారణంగా నగరంలో గాలి నాణ్యత మరింత దిగజారింది. రాత్రి 7 గంటల సమయంలో ఢిల్లీ సగటు గాలి నాణ్యత సూచీ (AQI) 371కి చేరగా, ‘వెరీ పూర్’ (అత్యంత దారుణం) కేటగిరీలో నమోదైనట్లు అధికారిక నివేదికలు వెల్లడించారు.

నగరవ్యాప్తంగా పనిచేస్తున్న 59 కాలుష్య పర్యవేక్షణ కేంద్రాలలో 19 చోట్ల ఏక్యూఐ ఏకంగా 401 దాటి ‘సీవియర్’ (తీవ్రమైన) కేటగిరీకి చేరింది. మరో 7 కేంద్రాల్లో ‘పూర్’, మిగిలిన 33 కేంద్రాల్లో ‘వెరీ పూర్’ స్థాయి వాయు కాలుష్యం రికార్డైంది. ముఖ్యంగా జహంగీర్‌పురి ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ అత్యధికంగా 460 వద్ద నమోదుకావడం గమనార్హం.

శీతాకాలంలో పెరిగే కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో ఢిల్లీ ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) మూడో దశ నిబంధనలను నవంబర్ 6 నుంచి కఠినంగా అమలు చేస్తోంది. సాధారణంగా ఏక్యూఐ 401 నుంచి 500 మధ్య నమోదైనప్పుడు ఈ దశను ప్రవేశపెడతారు. ఇందులో భాగంగా కాలుష్యాన్ని పెంచే అన్ని రకాల నిర్మాణాలు, భవనాల కూల్చివేత పనులపై తాత్కాలికంగా నిషేధం విధించారు. అలాగే బిఎస్-3 పెట్రోల్ , బిఎస్-4 డీజిల్ కేటగిరీకి చెందిన నాలుగు చక్రాల వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

నగరంలో పొగమంచుతో పాటు విషపూరితమైన పొగ దట్టంగా కమ్ముకోవడంతో శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు వహించాలని వైద్యులు హెచ్చరించారు. నిబంధనలను పాటిస్తూ వాయు కాలుష్య నియంత్రణకు పౌరులంతా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు: Air Pollution Alert Delhi Pollution