Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

Good Sleep: మంచి నిద్రతో డయాబెటిస్, గుండె జబ్బులకు చెక్.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు

jagan 07 Nov 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
Good Sleep: మంచి నిద్రతో డయాబెటిస్, గుండె జబ్బులకు చెక్.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు

Good Sleep

Good Sleep: మధుమేహం (టైప్-2 డయాబెటిస్), గుండెజబ్బులు , పక్షవాతం (స్ట్రోక్) వంటి కార్డియో-మెటబాలిక్ వ్యాధులతో బాధపడుతున్న వారికి నాణ్యమైన నిద్ర ఎంతో మేలు చేస్తుందని తాజా అంతర్జాతీయ పరిశోధన వెల్లడించింది. సాధారణంగా ఈ తీవ్ర అనారోగ్య సమస్యల వల్ల వయసు పెరిగే కొద్దీ మెదడు నాడులు క్షీణించి ఆలోచనా సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఎక్కువ. అయితే, క్రమం తప్పకుండా ప్రశాంతమైన నిద్రపోవడం ద్వారా మెదడు నిర్మాణాత్మక ఆరోగ్యాన్ని , జ్ఞాపకశక్తిని కాపాడుకోవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ పరిశోధన స్వీడన్‌కు చెందిన ప్రముఖ ‘కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్’ (Karolinska Institutet) పరిశోధకుల ఆధ్వర్యంలో జరగగా.. దీని ఫలితాలు ప్రతిష్ఠాత్మక ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ (JAHA) లో ప్రచురితమయ్యాయి.

4 లక్షల మంది డేటా – 35 వేల ఎంఆర్‌ఐ స్కాన్ల విశ్లేషణ: పరిశోధకులు బ్రిటన్‌కు చెందిన ‘యూకే బయోబ్యాంక్’ (UK Biobank) లో నమోదు చేసుకున్న 4 లక్షల మందికి పైగా మధ్యవయస్కులు , వృద్ధుల ఆరోగ్య వివరాలను సుదీర్ఘకాలం పాటు విశ్లేషించారు.

విశ్లేషించిన జనాభా: అధ్యయనంలో పాల్గొన్న వారిలో 54,000 మందికి పైగా గుండె, రక్తనాళాలు , జీవక్రియ సంబంధిత తీవ్ర సమస్యలు ఉన్నవారే.
స్కాన్ల ఆధారాలు: నిద్ర నాణ్యతను సరిగ్గా అంచనా వేసేందుకు దాదాపు 35,000 మందికి సంబంధించిన బ్రెయిన్ ఎంఆర్‌ఐ (Brain MRI) స్కాన్లను ల్యాబ్‌లో పరిశీలించారు.

నిద్ర నాణ్యత అంచనాకు తీసుకున్న 5 కీలక ప్రమాణాలు:

  1. నిద్ర వ్యవధి (Sleep Duration): రోజుకు తగినన్ని గంటలు నిద్రపోవడం.
  2. శరీర జీవగడియారం (Chronotype): క్రమబద్ధమైన సమయపాలన.
  3. నిద్రలేమి (Insomnia): సరిగ్గా నిద్రపట్టకపోవడం లేదా పదేపదే మెలకువ రావడం.
  4. గురక (Snoring): శ్వాసకోశ అడ్డంకులు లేకుండా నిద్రించడం.
  5. పగటిపూట నిద్రమత్తు (Excessive Daytime Sleepiness): పగటివేళల్లో తీవ్రంగా నిద్రమత్తు ఆవహించకపోవడం.

గ్రే అండ్ వైట్ మ్యాటర్ పరిరక్షణ – అధ్యయన ముఖ్యాంశాలు: రోజువారీ జీవితంలో చక్కగా నిద్రపోయే అలవాటు ఉన్నవారిలో సాధారణ ఆలోచనా సామర్థ్యం, సమస్యలను త్వరితగతిన పరిష్కరించే నైపుణ్యం , కొత్త సమాచారాన్ని వేగంగా గ్రహించే శక్తి మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు.

ముఖ్యంగా ఎంఆర్‌ఐ స్కాన్లలో – నిద్ర సమయం బాగున్నవారి మెదడులో సమాచారాన్ని ప్రాసెస్ చేసే ‘గ్రే మ్యాటర్’ (Grey Matter) , నాడుల మధ్య సంకేతాలను వేగంగా చేరవేసే ‘వైట్ మ్యాటర్’ (White Matter) ల పరిమాణం తగ్గిపోకుండా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ సానుకూల ప్రభావం మధుమేహం , గుండె సంబంధిత తీవ్ర సమస్యలతో బాధపడుతున్న వారిలో మరింత స్పష్టంగా కనిపించడం విశేషం. నిద్ర అలవాట్లను మెరుగుపరుచుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడినవారు కూడా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.