Heavy Rain Alert in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షాల హెచ్చరిక.. ఐటీ ఉద్యోగులు త్వరగా ఇళ్లకు వెళ్లాలని పోలీసుల సూచన..
Heavy Rain in Hyderabad Triggers Traffic Jams Across the City
Heavy Rain Alert in Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాబోయే కొన్ని రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వర్షాల వల్ల రోడ్లపై తీవ్ర ప్రయాణ ఇబ్బందులు, ట్రాఫిక్ స్తంభన తలెత్తకుండా చూడటానికి సైబరాబాద్ ఐటీ కారిడార్‌లోని కంపెనీలు, వాణిజ్య సంస్థలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉద్యోగులకు రవాణా ఇబ్బందులు లేకుండా ‘దశలవారీ ముందస్తు లాగ్‌ఔట్స్’ (Phased Logouts) విధానాన్ని అమలు చేయాలని సూచిస్తూ పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
గురువారం వరకు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను ఒకేసారి కాకుండా విడతలవారీగా విధుల నుంచి ఇంటికి పంపించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. మధ్యాహ్నం 2 గంటల నుంచే ఈ లాగ్‌ఔట్స్ ప్రక్రియ ప్రారంభించి, సాయంత్రం 4 గంటల లోపే గరిష్టంగా పూర్తి చేయాలని సూచించారు. సాయంత్రం వేళ వర్షం తీవ్రత పెరిగితే వేలాది మంది ఉద్యోగులు ఒకేసారి రోడ్లపైకి రావడం వల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతుందని వివరించారు. పరిస్థితుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాబోయే మూడు రోజుల పాటు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) సౌకర్యాన్ని కల్పించాలని కంపెనీలకు విజ్ఞప్తి చేశారు.
ట్రాఫిక్ నియంత్రణ సమర్థవంతంగా సాగేందుకు ఐటీ కంపెనీల యాజమాన్యాలు తమ సంస్థ చిరునామా, ముందస్తు లాగ్ఔట్ సమయాల వివరాలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఈ-మెయిల్ (cybtrcc@gmail.com) ద్వారా పంపాలని సూచించారు. ఐటీ సంస్థల నుంచి వచ్చే లాగౌట్ సమయాల సమాచారం ఆధారంగా ప్రధాన జంక్షన్లు, కారిడార్లలో అదనపు సిబ్బందిని మోహరించి ట్రాఫిక్ పునరుద్ధరణ సదుపాయాలు కల్పిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.