ZEE Subhash Chandra: రూ.1,322 కోట్ల రుణ బకాయిల కేసులో జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రకు ఈడీ షాక్.. మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభం
మీడియా రంగ ప్రముఖుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు సుభాష్ చంద్రకు మరో చిక్కు ఎదురైంది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థకు సంబంధించిన భారీ రుణాల వ్యవహారంలో ఆయనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. సుమారు రూ.980 కోట్ల రుణాలు పొందేందుకు ఆస్తుల విలువను అధికంగా చూపించే ధ్రువపత్రాలు సమర్పించారన్న ఆరోపణలపై ఈ చర్య చేపట్టింది.
ఈ రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో తమకు రూ.1,322 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ప్రాతిపదికగా తీసుకుని ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద విచారణ ప్రారంభించింది. ఈ ఆరోపణలపై సుభాష్ చంద్ర స్పందన ఇంకా వెలువడలేదు.
రెండు రుణాలు.. మొత్తం రూ.980 కోట్లు
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఫిర్యాదులో రెండు వేర్వేరు రుణాల ప్రస్తావన ఉంది.
- రూ.500 కోట్ల రుణం: వసంత్ సాగర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మంజూరైంది. పాన్ ఇండియా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహ రుణగ్రహీతగా ఉంది.
- రూ.480 కోట్ల రుణం: డిజిటల్ సబ్‌స్క్రైబర్ మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇచ్చారు. స్పిరిట్ ఇన్ఫ్రా పవర్ అండ్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహ రుణగ్రహీతగా వ్యవహరించింది.
మొదటి రుణాన్ని పాత బకాయిల పరిష్కారం, అదనపు నిధుల సమీకరణ, వ్యాపార విస్తరణ అవసరాల కోసం తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి 2018 మార్చి 28న సుభాష్ చంద్ర నిరంతర హామీ ఇచ్చినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. రెండో రుణం అద్దె ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని మంజూరు చేసే విధానంలో అందించారు. దీనికీ ఆయన హామీ ఉన్నట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది.
ఆస్తుల విలువపై వివాదం
ఈ కేసులో ప్రధానంగా సుభాష్ చంద్ర ఆర్థిక స్థితిని తెలియజేస్తూ సమర్పించిన నికర ఆస్తుల విలువ ధ్రువపత్రాలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
2018 మార్చి 28న డీజేఎం అండ్ కో జారీ చేసిన ధ్రువపత్రంలో ఆయన ఆస్తుల నికర విలువ సుమారు రూ.59,000 కోట్లుగా చూపినట్లు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది. అదే ఏడాది జూలై 6న ఎంపీజే అండ్ కో జారీ చేసిన మరో పత్రంలో ఈ విలువను రూ.40,562 కోట్లుగా పేర్కొన్నారు. రెండో రుణం మంజూరుకు ఈ ధ్రువపత్రం కూడా ఆధారంగా నిలిచినట్లు ఫిర్యాదుల