Skip to content
జాతీయం › వార్తలు

Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. ఠాక్రే సోదరులతో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ..

jagan 30 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. ఠాక్రే సోదరులతో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ..

Maharashtra Politics

Maharashtra Politics: తీవ్ర రాజకీయ వ్యతిరేకతలు, విమర్శలు పక్కనపెట్టి మహారాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ కాలం తర్వాత ఒకే వేదికపై కీలక నాయకులు ప్రత్యక్షమవడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తిని రేకెత్తించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే , మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) చీఫ్ రాజ్‌ ఠాక్రేలు ముంబైలో జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకోవడమే కాకుండా, కార్యక్రమానికి ముందు ప్రత్యేకంగా ఏకాంతంగా సమావేశమయ్యారు. ఇటీవల ముగిసిన మహారాష్ట్ర శాసన మండలి (MLC) ఎన్నికల్లో బీజేపీ-శివసేన (షిండే) కూటమికి ఆశించిన ఫలితాలు రాకపోవడం, మహాయుతి కూటమి అంతర్గత విభేదాల వార్తల నేపథ్యంలో ఈ ముగ్గురు నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రముఖ కార్టూనిస్ట్ ప్రశాంత్ కులకర్ణి సంపాదకత్వంలో మరాఠీ రాజకీయ వ్యంగ్య చిత్రాల వందేళ్ల చారిత్రాత్మక ప్రస్థానాన్ని వివరిస్తూ రూపొందించిన ‘మహారాష్ట్రచ్యా హాస్యరేఖా’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ముంబైలోని దాదర్ సావర్కర్ స్మారక్ సభాగృహంలో నిర్వహించబడింది. గంథాలీ ప్రచురణలు చేపట్టిన ఈ కార్యక్రమానికి ముందు ఒక ప్రత్యేక గదిలో సీఎం ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే, రాజ్‌ ఠాక్రేలు కలిసి కుర్చీల్లో కూర్చుని ముచ్చటించుకున్నారు. అయితే ఇది పూర్తిగా రాజకీయ రహితమైన, మర్యాదపూర్వకమైన ‘చాయ్ భేటీ’ మాత్రమేనని, ఇందులో ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.

పుస్తకావిష్కరణ సభలో నేతల మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు, చమత్కారాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ నాయకుడు ఆశిష్ షెలార్ మాట్లాడుతూ, రాజ్ ఠాక్రే పిలిస్తే ఫడ్నవీస్ వెంటనే వచ్చారని చెప్పగా, దానికి ఫడ్నవీస్ చమత్కరిస్తూ స్పందించారు. 2019 వరకు ఉద్ధవ్ ఠాక్రే ఎప్పుడు పిలిచినా తాను వెళ్లేవాడినని, అయితే 2019 తర్వాత ఆయన నుంచి తనకు పిలుపే రాలేదని, ఫోన్ కోసం తాను ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నానని నవ్వులు పూయించారు.

మరోవైపు రాజ్‌ ఠాక్రే మాట్లాడుతూ, 2029 వరకు ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తే సరిపోతుందని వ్యాఖ్యానించడమే కాక.. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కళా, సాంస్కృతిక విషయాల్లో కలసికట్టుగా వేదికలు పంచుకోవడం మహారాష్ట్ర ఉత్తమ సంప్రదాయమని అన్నారు. ముంబైలో వ్యంగ్య చిత్రకారుల (కార్టూనిస్టుల) కోసం ప్రత్యేక ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేస్తానని, ఆ ప్రక్రియలో ఠాక్రే సోదరులిద్దరి సహకారం తీసుకుంటానని ఫడ్నవీస్ హామీ ఇచ్చారు.

ఇటీవల వెలువడిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల ఫలితాల్లో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ (MVA) మూడు స్థానాలను కైవసం చేసుకోగా, అధికార మహాయుతి కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. నాగ్‌పూర్ వంటి కంచుకోటలో బీజేపీ ఓడిపోవడం వల్ల అధికార కూటమిలో పరస్పర ఆరోపణలు మొదలయ్యాయి. ఈ తరుణంలో జరిగిన ఈ భేటీ రాజకీయంగా నూతన సమీకరణాలకు దారితీస్తుందా అనే ప్రచారాన్ని బీజేపీ సీనియర్ నేత ప్రవీణ్ దరేకర్ తోసిపుచ్చారు. కేవలం ఒక సాంస్కృతిక వేదికపై నేతలు కలవడాన్ని బట్టి కొత్త కూటములు ఏర్పడతాయని భావించడం తొందరపాటే అవుతుందని వ్యాఖ్యానించారు.